తప్పిన మరో ఎయిరిండియా బోయింగ్ క్రాష్ ? సడన్ గా 900 అడుగుల కిందకొచ్చి..!
ప్రపంచ విమానయాన చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటైన అహ్మదాబాద్-లండన్ ఎయిరిండియా ఫ్లైట్ క్రాష్ ఘటన మర్చిపోకముందే దాదాపు అలాంటి ప్రమాదమే ఒకటి జరగబోయి చివరి నిమిషంలో తప్పినట్లు ఆలస్యంగా తెలిసింది. జూన్ 12న అహ్మదాబాద్-లండన్ విమాన ప్రమాదం చోటు చేసుకోగా.. సరిగ్గా 38 గంటల తర్వాత జూన్ 14న దాదాపు ఇలాంటిదే ఓ ప్రమాదం అంచుల వరకూ మరో విమానం వెళ్లింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న డీజీసీఏ ఎయిర్ ఇండియా భద్రతాధికారికి సమన్లు ఇచ్చి విచారించినట్లు తెలుస్తోంది.
జూన్ 14 తెల్లవారుజామున ఢిల్లీ నుండి వియన్నాకు బయలుదేరిన బోయింగ్ 777 విమానం టేకాఫ్ కాగానే ఏకంగా 900 అడుగుల కిందకు జారిపోయింది. సరిగ్గా అహ్మదాబాద్-లండన్ విమానం కూడా ఇలాగే టేకాఫ్ కాగానే అకస్మాత్తుగా జారిపోయి పక్కనే ఉన్న భవనాలపై పడి పేలిపోయింది. ఇప్పుడు ఈ ఢిల్లీ-వియన్నా విమానం కూడా సరిగ్గా అలాంటి పరిస్దితినే ఎదుర్కొంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో తెల్లవారుజామున 2.56కు ప్రతికూల వాతావరణ పరిస్దితుల మధ్య వియన్నాకు బయలుదేరిన ఈ బోయింగ్ టేకాఫ్ తర్వాత 900 అడుగుల కిందకు జారిపోయింది.

వెంటనే పైలట్లకు వారి ముందున్న ప్యానల్ పై ఎమర్జెన్సీ హెచ్చరికలు రావడం ప్రారంభమైంది. విమానం అకస్మాత్తుగా ఎత్తు (ఆల్టిట్యూడ్) కోల్పోతుందని, వెంటనే సాధారణ పరిస్ధితికి తీసుకురావాలని ఈ హెచ్చరికల సారాంశం. ఢిల్లీలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తున్న పరిస్ధితుల్లో విమానం టేకాఫ్ కాగానే చోటు చేసుకున్న ఈ ఘటనతో పైలట్లు ఆందోళనకు గురయ్యారు. అయితే వెంటనే కోలుకుని ఫ్లైట్ ను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరికి వారి ప్రయత్నాలు ఫలించి విమానం సాధారణ ఎత్తులోకి వచ్చేసింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అనంతరం ఈ బోయింగ్ విమానం 9 గంటల 8 నిమిషాల తర్వాత వియన్నాలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే విమానం ఇలా సడన్ గా ఎత్తు కోల్పోవడం, అత్యవసర పరిస్ధితులు ఎదుర్కొన్న ఘటనపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు కోసం ఇప్పటికే ఎయిర్ ఇండియా భద్రతా అధిపతిని పిలిపించారు. దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఆ విమానం నడిపిన ఇద్దరు పైలట్‌లను ఫ్లయింగ్ డ్యూటీ నుండి తొలగించారు. పైలట్ నివేదిక అందిన తర్వాత, నిబంధనల ప్రకారం ఈ విషయాన్ని డీజీసీఏకి తెలిపామని, ఆ తర్వాత విమానం రికార్డర్ల నుండి డేటా అందాక దర్యాప్తు ప్రారంభమైందని, విచారణ పూర్తయ్యే వరకూ పైలట్‌లను తొలగించినట్లు ఎయిరిండియా వెల్లడించింది.












Click it and Unblock the Notifications