భారతీయ పర్యాటకులకు మరో గుడ్ న్యూస్-వీసా రహిత ఎంట్రీ ఇచ్చిన మరో దేశం..
అంతర్జాతీయంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తమ ఆర్ధిక వ్యవస్ధలు కుప్పకూలకుండా కాపాడుకోవడం కోసం ఆయా దేశాలు అన్ని దారులూ తెరిచేస్తున్నాయి. గతంలో వీసాలు అడిగినా జారీ చేయని దేశాలు కూడా ఇప్పుడు భారతీయులను వీసాలు లేకుండానే ఎంట్రీ ఇస్తాం రమ్మంటున్నాయి. ఇలాంటి దేశాల జాబితా పెరుగుతోంది. తాజాగా మరో దేశం ఇలాగే వీసా లేకుండానే తమ దేశంలోకి భారతీయులకు ఎంట్రీ ఇస్తాం రమ్మంటోంది.
వీసా లేకుండా భారతీయులకు ఎంట్రీ ఇచ్చేందుకు మలేషియా ముందుకొచ్చింది. పర్యాటక ప్రాంతాలు కలిగిన మలేషియాలో రాజధాని కౌలాలంపూర్ తో పాటు మరెన్నో ఆకర్షణీయ ప్రాంతాలున్నాయి. వీటికి ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. కానీ అంతర్జాతీయంగా ఆర్ధిక మందగమనం కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గుతోంది. ముఖ్యంగా భారత్, చైనా వంటి అత్యధిక జనాభా కలిగిన దేశాల నుంచి ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గుతుండటం మలేషియాను కలవరపెడుతోంది.

ఈ నేపథ్యంలో తమ దేశంలోకి డిసెంబర్ 1 నుంచి భారతీయులకు అలాగే చైనా పోరులకు కూడా వీసా రహిత ఎంట్రీ కల్పిస్తామని మలేషియా ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఓ ప్రకటన చేశారు. 30 రోజుల పాటు పర్యాటక వీసాతో ఈ ఉచిత ఎంట్రీ కల్పించేందుకు మలేషియా ఏర్పాట్లు చేస్తోంది. చైనా, భారత్ లు మలేషియాకు నాలుగో, ఐదో అతిపెద్ద మార్కెట్లు. దీంతో ఈ రెండు దేశాల పౌరులకు వీసా రహిత ఎంట్రీ ఇవ్వడం ద్వారా పర్యాటక ఆదాయం పెంచుకునేందుకు మలేషియా ప్రయత్నిస్తోంది.
మలేషియా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య 91 లక్షల పర్యాటకులు వచ్చారు. ఇందులో చైనా నుంచి 49 లక్షల మంది భారత్ నుంచి 28 లక్షల మంది వరకూ ఉన్నారు. ఈ సంఖ్యను పెంచుకునేందుకు వీసా రహిత ఎంట్రీకి మలేషియా అవకాశం కల్పిస్తోంది. ఈ ఏడాది మలేషియా పొరుగున ఉన్న థాయిలాండ్ తో పాటు శ్రీలంక వంటి దేశాలు కూడా భారతీయులకు వీసా రహిత ఎంట్రీ కల్పించాయి.












Click it and Unblock the Notifications