డీకే శివకుమార్ నిప్పులు- పరువునష్టం దావా వేస్తానంటూ ఘాటుగా వార్నింగ్
న్యూఢిల్లీ: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పదవిపై ఏర్పడిన ప్రతిష్ఠంభన తొలగట్లేదు. శనివారమే ఫలితాలు వెలువడినప్పటికీ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై పీటముడి పడింది. ఆదివారం రాత్రి సీఎల్పీ భేటీ అయినప్పటికీ- ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేకపోయింది. సీఎల్పీ నేతను ఎంపిక చేసే సర్వాధికారాలను పార్టీ అధిష్ఠానానికి వదిలివేసింది. దీనితో కర్ణాటక రాజకీయాలు హస్తినకు షిఫ్ట్ అయ్యాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని అందుకుంది. 135 స్థానాల్లో విజయఢంకా మోగించింది. 43 శాతానికి పైగా ఓట్ల షేర్‌ను సాధించింది. తమ నేతను ఎన్నుకోవడానికి ఆదివారం సాయంత్రం సీఎల్పీ భేటీ అయినప్పటికీ- ఎలాంటి నిర్ణయం కూడా వెలువడలేదు.

అధిష్ఠానం నుంచి పిలుపు అందడంతో ఈ మధ్యాహ్నం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్ హస్తినకు బయలుదేరి వెళ్లారు. విమానాశ్రయం నుంచి నేరుగా తన సోదరుడు, లోక్‌సభ సభ్యుడు డీకే సురేష్ ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం అక్కడే భోజనం చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ శాసన సభ్యులు ఆయనను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో డీకే శివకుమార్ మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవి లభించకపోతే పార్టీకి, పదవికి రాజీనామా చేస్తారా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఘాటుగా సమాధానాలను ఇచ్చారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనకు కన్నతల్లిలాంటిదని గుర్తు చేశారు. కన్నతల్లిని ఎవరైనా వదిలి వెళ్తారా? అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు.

ముఖ్యమంత్రి పదవి లభించకపోతే రాజీనామా చేస్తారంటూ కొన్ని ఛానళ్లల్లో ప్రత్యేక కథనాలు ప్రసారమౌతోన్నాయంటూ విలేకరులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై డీకే శివకుమార్ నిప్పులు చెరిగారు. ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని అన్నారు. తాను రాజీనామా చేస్తానంటూ కథనాలను ప్రసారం చేస్తోన్న ఛానళ్లపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలంటూ తన టీమ్‌ను ఆదేశించినట్లు కూడా చెప్పారు.
అధిష్ఠానం, సీనియర్ నాయకుల సహకారంతో పీసీసీ అధ్యక్షుడి హోదాలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని తాను పునర్నిర్మించానని, అలాంటి పార్టీని ఎలా వదిలి వెళ్తానని ప్రశ్నించారు. పార్టీ అధిష్ఠానం, ప్రజలు ఎన్నుకున్న 135 మంది శాసన సభ్యులు తన వాళ్లేనని, తన కుటుంబ సభ్యులేనని చెప్పారు. రాజీనామా చేస్తానంటూ వస్తోన్న వార్తలను బుల్ షిట్ అంటూ కొట్టిపడేశారు.












Click it and Unblock the Notifications