• search
  • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆంధ్రప్రదేశ్ వరదలు: రాయలసీమ, నెల్లూరుని ముంచెత్తిన వరదలకు కారణమేంటి, నిర్లక్ష్యం వల్లే డ్యామ్‌లు కొట్టుకుపోయాయా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వర్షాలకు తెగిన రహదారి

ఈశాన్య రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షాలతో రాయలసీమలోని కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలతో పాటుగా నెల్లూరు జిల్లాలోనూ విలయం సృష్టించింది.

భారీ వర్షాలకు పెన్నా, దాని ఉపనదులన్నీ పొంగిపొర్లాయి. ఆనకట్టలు తెగిపోయాయి. గ్రామాల మీదకు ఒక్కసారిగా జలప్రళయం మాదిరి ఎగిసిపడడంతో నేటికీ పలు గ్రామాలు కోలుకోలేని స్థితిలో ఉన్నాయి.

ఇంత తీవ్రస్థాయిలో వరదలు ఎందుకొచ్చాయి, ఆనకట్టలు ఎందుకు తెగిపోయాయనేది బీబీసీ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.

రోడ్డుకు గండిపడడంతో ఆగిపోయిన వాహనాలు, నిరీక్షిస్తున్న ప్రయాణికులు

18వ తేదీ సాయంత్రం నుంచే..

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 16(16.11.2021) నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాన్ని వాతావరణ శాఖ ముందుగానే అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో వాయుగుండం తీరం దాటుతుందని హెచ్చరించింది. ఆ క్రమంలోనే 17వ తేదీ నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. తిరుమలలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఏకంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని టీటీడీ అధికారికంగా వెల్లడించింది. వర్షాల ప్రభావంతో 18వ తేదీకి తిరుమల అల్లకల్లోలంగా మారింది. తిరుపతి వరద నీటిలో చిక్కుకుంది. చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో కూడా వర్ష తాకిడి తీవ్రంగా కనిపించింది. చెరువులన్నీ నిండుకుండలయ్యాయి. వాగులు పొంగిపొర్లాయి. నదులు ఉద్ధృతంగా ప్రవహించాయి. తిరుమల ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా దిగువన పింఛా నదీకి వరదనీరు భారీ స్థాయిలో చేరింది.పింఛా కట్టకు తగిన రక్షణ ఏర్పాట్లు లేకపోవడం

గార్గేయ నదికి దిగువన పింఛా నదిపై కడప జిల్లా టి.సుండుపల్లి మండలం ముదుంపాడు సమీపంలో పింఛా డ్యామ్ నిర్మించారు. దానికి ఎగువన చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చే వరద నీరు ప్రధాన ఆధారం. గత ఏడాది కూడా భారీగా వర్షాలు కురిసిన సమయంలో పింఛా డ్యామ్ కట్ట ప్రమాదంలో చిక్కుకుంది. దాంతో తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమే చేశారు. ఈసారి ఊహించని రీతిలో వర్షాలు విరుచుకుపడిన మూలంగా పింఛా డ్యామ్‌లోకి భారీ స్థాయిలో నీరు వచ్చింది.

ఈ సీజన్‌లో సాధారణంగా 40 వేల క్యూసెక్కుల నీరు వచ్చే పింఛా డ్యామ్‌కి ఒక్కసారిగా 4 లక్షల క్యూసెక్కుల వరకూ వరద జలాలు రావడంతో కట్ట తెగిపోయింది.

18వ తేదీ చీకటి పడిన తర్వాత పింఛా డ్యామ్ కట్ట కొట్టుకుపోయింది. ఈ నీరు, బాహుదా నుంచి వచ్చిన నీటితో కలిసి చెయ్యేరు నది ఒక్కసారిగా ఉప్పొంగింది. ఫలితంగా అన్నమయ్య డ్యామ్ ప్రమాదంలో చిక్కుకుంది.

అన్నమయ్య డ్యామ్ కట్ట తెగిన ప్రాంతం

నాలుగు దశాబ్దాల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది..

1976లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా శంకుస్థాపన చేసి.. ఎన్టీఆర్ హయంలో పూర్తిచేసిన అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా 10వేల ఎకరాలకు సాగునీరు, రాజంపేట పట్టణం సహా సమీప గ్రామాలకు తాగునీరు అందుతోంది.

ఈ డ్యామ్ నిర్వహణ లోపాలపై పలు ఫిర్యాదులున్నాయి. అధికారులు సకాలంలో స్పందించలేదనే కథనాలు గతంలోనే మీడియాలో వచ్చాయి.ఇప్పుడు పింఛా డ్యామ్ నుంచి వచ్చిపడిన వరద ప్రవాహంతో ఒక్కసారిగా 3.5 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లోని అన్నమయ్య ప్రాజెక్ట్ తట్టుకునే స్థితిలో లేదని సీనియర్ ఐఏఎస్ అధికారి, కడప జిల్లా ప్రత్యేక అధికారిగా వరద సహాయక చర్యల కోసం వెళ్లిన శశి భూషణ్ కుమార్ బీబీసీకి తెలిపారు.''సహజంగా 2లక్షల క్యూసెక్కుల ప్రవాహానికి అనుగుణంగా ప్రాజెక్టు డిజైన్ చేశారు. కానీ దానికి దాదాపు రెట్టింపు స్థాయిలో వరద వచ్చింది. అప్పటికే గేట్లు ఎత్తి నీటిని తరలించే ప్రయత్నం చేశాం. కానీ కట్ట పై నుంచి ప్రవాహం సాగింది. చివరకు 19వ తేదీ ఉదయం 5.30 గంటలు దాటిన తర్వాత కట్ట తెగిపోయింది. దిగువన గ్రామాల్లోకి వరద ప్రవాహం ఒక్కసారిగా వెళ్లింది. ముందుగానే హెచ్చరికలు చేయడం వల్ల ప్రాణనష్టం తగ్గింది. కానీ నందలూరు, రాజంపేట మండలాల్లో 9 గ్రామాలు జలమయమయ్యాయి’’ అని ఆయన వివరించారు.

డ్యామ్ దిగువ గ్రామాల్లో విషాద ఛాయలు

చెయ్యేరు నది మీద నిర్మించిన అన్నమయ్య డ్యామ్ కారణంగా దిగువ ప్రాంతాల ప్రజలు ప్రశాంతంగా, రెండు పంటలు పండిస్తూ, వరి, అరటి సాగుతో సంతోషంగా జీవించేవారు.

కానీ ఏకంగా డ్యామ్ కట్ట తెగిపోయి తమ ఊరి మీదకు వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. నది ఒడ్డున గ్రామం ఉండడంతో ఏడాది పొడవునా సాగు, తాగు నీటికి సమస్య లేకుండా సాగిపోతోందని భావించిన వారికి ఆ నది విరుచుకుపడడంతో విషాదం ఎదురైంది.రాజంపేట మండల పులపుత్తూరు, గుండ్లూరు, మందపల్లి, నందలూరు మండలంలోని మరో ఆరు గ్రామాల్లో ఇదే పరిస్థితి.

సరిగ్గా 19 వ తేదీ 6 గంటల సమయంలో జలప్రళయం విరుచుకుపడినట్టుగా చెయ్యేరు వరద గ్రామం మీదకు వచ్చిపడింది.

ఇళ్లు, ఊళ్లూ అన్నీ నీట మునిగాయి. చాలామంది ప్రాణభయంతో పరుగులు తీశారు. కొండలపైకి ఎక్కి తలదాచుకున్నారు. పరుగుదీయలేని వారు డాబాలపైకి ఎక్కి తలదాచుకున్నారు. అందులో కొందరు వరద ప్రవాహంలో కొట్టుకుపోగా, మిగిలిన వారు ఇప్పటికీ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

నందలూరులో

కళ్లెదురుగానే కొట్టుకుపోయారు

'మా ఆయనకు చెవుడు. ఎంత చెప్పినా వినబడలేదు. వరద వచ్చేస్తుందని మాకు ఎవరో ఫోన్ చేశారు. ఆలోగానే నీరు వాకిట్లోకి వచ్చేసింది. కొండపైకి వెళ్లాలంటే మాకు ఓపిక లేదు. అరవై ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా గానీ ఇలాంటి భయంకర దృశ్యాలు చూడలేదు. మిద్దె పైకి ఎక్కి తలదాచుకున్నాం. చుట్టూ వరద నీరు. అలలు అలలుగా ఎగిసిపడేది. ఏం జరుగుతుందో తెలియదు.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాం. మూడు, నాలుగు గంటల తర్వాత శాంతించింది. మధ్యాహ్నం తర్వాత మా ఇంటి దిగువకు వరద చేరడంతో కిందకి వచ్చాం.

మా కళ్లెదురుగానే కొందరు నీటిలో కొట్టుకుపోయారు. మా బంధువులిద్దరి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు’’ అంటూ పులపుత్తూరు గ్రామానికి చెందిన ఎం నాగమణి బీబీసీకి తెలిపారు.సమీపంలోని గుండ్లూరు శివాలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ శివాలయ పుజారి కుటుంబం ఆచూకీ కూడా ఇప్పటి వరకూ దొరకలేదు. ఇంకా అనేక మంది గల్లంతయినట్టు చెబుతున్నారు. చెయ్యేరు వరదల మూలంగా మరణించిన వారిలో 12 మంది మృతదేహాలు లభ్యమయినట్టు అధికారులు ప్రకటించారు. మరో 15 మంది వరకూ ఆచూకీ దొరకాలని చెబుతున్నారు.

వరదలో కొట్టుకొచ్చిన వాహనం

గల్లంతయిన వారి సంఖ్య ఎక్కువే

అన్నమయ్య ప్రాజెక్టు దిగువన వరదల్లో గల్లంతయిన వారి సంఖ్యపై అనేక రకాల ప్రచారాలు సోషల్ మీడియాలో సాగుతున్నాయి.

ప్రభుత్వం మాత్రం వారి సంఖ్య 15గా నిర్ధరించింది. తమ వాళ్లు కనిపించడం లేదంటూ ఎక్కడికక్కడ స్థానికులు చెబుతున్న సంఖ్యతో పోల్చితే ఇది సగం కంటే తక్కువే.

''ప్రభుత్వం చెప్పిన సంఖ్యకు, మా ఊరిలో కనిపించకుండా పోయిన వారి సంఖ్యకు సంబంధం లేదు.

మా సొంత మేనత్త, ఆమె భర్త కనిపించడం లేదు. ఇంట్లో సామాను కోసం అని కొంత ఆలస్యం చేశారు. మేం కేకలు వేస్తున్నా వారు తొందరగా బయటపడలేదు. దాంతో ఇప్పుడు వారి ఆచూకీ లేదు.

మా గ్రామంలోనే ఎస్సీ కాలనీలో ముగ్గురు కనిపించడం లేదు. రాజుల పేటకు చెందిన నలుగురు కనిపించడం లేదు. ఒక్క మా ఊరిలోనే 10 మంది. మందపల్లిలో ఆరు, గుండ్లూరులో 10 ఇలా ఇప్పటికే మా ప్రాంతంలో 26 మంది గల్లంతయ్యారు. ప్రభుత్వం మాత్రం తక్కువగా చెబుతోంది’’ అని పులపుత్తూరుకి చెందిన ఎం.నాగిరెడ్డి బీబీసీకి తెలిపారు.

ఇంకా నీటిలోనే ఉన్న నందలూరు

సోమశిల తట్టుకుని నిలబడింది..

ఎగువన రెండు డ్యాముల కట్టలు తెగి ఒక్కసారిగా వరద ప్రవాహం రావడంతో సోమశిల వద్ద పరిస్థితి ప్రమాదకరంగా మారింది.

సోమశిల రిజర్వాయర్ పరిరక్షణ నిమిత్తం ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు.

అప్పటికే సుమారు 80వేల క్యూసెక్కుల నీటిని పెన్నా నదిలోకి వదులుతుండగా డిశ్చార్జ్ పెంచి రెగ్యులేట్ చేశారు.

చివరకు 19వ తేదీ సాయంత్రం ఒక సమయంలో 5.38 లక్షల క్యూసెక్కుల నీటిని డిశ్చార్జ్ చేసేస్థాయికి వరద ప్రవాహం వెళ్లింది.

అయినా సోమశిల సురక్షితంగా నిలవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.సోమశిల నుంచి వస్తున్న ఇన్ ఫ్లోతో పాటుగా పెన్నేరు వరద పెన్నా నదిలో చేరడంతో పెన్నా పోటెత్తింది. నెల్లూరు వద్ద వరద తాకిడి తీవ్రంగా కనిపించింది.

నెల్లూరులో

నెల్లూరులో కకావికలం

ఎగువన కురిసన వర్షాలతో పెన్నా నది పోటెత్తింది. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహించింది. నెల్లూరు నగరం, కోవూరు నియోజకవర్గం సహా పలు ప్రాంతాలను జలదిగ్బంధంలో చిక్కుకోవడానికి కారణమైంది. 20వ తేదీ తెల్లవారుజాము నుంచి నెల్లూరులో వరద తాకిడి తీవ్రంగా కనిపించింది. అంతకుముందే గూడురు వద్ద జాతీయ రహదారిపై నీరు చేరింది. కావలి, సూళ్లూరుపేట పరిసరాల్లో లక్షల ఎకరాల పంట నీటమునిగింది. పొలాలు చెరువులను తలపించాయి.చివరకు 20వ తేదీ రాత్రి నెల్లూరు వద్ద ఎన్‌హెచ్-16కి కూడా గండిపడింది. కోవూరు సమీపంలో కూడా కృష్ణపట్నం, బళ్లారి రోడ్డు పైకి వరద ప్రవాహం చేరడం, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకపోవడంతో తీవ్రంగా వరద తాకిడి కొనసాగుతోంది.ఎగువన సోమశిల శాంతించినప్పటికీ మైలవరం డ్యామ్ తో పాటుగా, పెన్నార్ నుంచి ప్రవాహం కొనసాగుతోంది. దాని కారణంగా పెన్నా నదికి వరద 21 వ తేదీ రాత్రి వరకూ కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు.

సీఎం జగన్ ఏరియల్ సర్వే

18 మంది మృతి, 3,500 పశువులు మృతి

భారీ వర్షాలు, వరదల మూలంగా ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రమాదాల్లో 18 మంది మరణించినట్టు అధికారికంగా ధ్రువీకరించారు. గల్లంతయిన వారి కోసం గాలిస్తున్నట్టు ప్రకటించారు.

అయితే గల్లంతయిన వారి సంఖ్య అధికారక లెక్కలకు, స్థానికుల సమాచారానికి పొంతన లేదు. దాంతో చివరకు ఎంత మంది ఆచూకీ కనుగొంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది.మరోవైపు తీవ్రంగా ఆస్తి నష్టం సంభవించింది. వేల పశువులు వరదల్లో కొట్టుకుపోయాయి. సుమారు 3,500 పశువులు మృతి చెందినట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 28 కుంటలు, చెరువులు, కాలువలు తెగిపోయాయని విపత్తుల నిర్వహణశాఖ వెల్లడించింది.రాష్ట్రంలో సుమారు 200 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం కాగా, పంట నష్టం తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు.

అనంతపురం జిల్లాలో లక్ష ఎకరాలు, కడప జిల్లాలో లక్షన్నరకు పైగా నష్టం సంభవించిందని ప్రాథమికంగా అంచనా వేశారు.

చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ తెలిపింది.ఇప్పటికే వరదలు, భారీ వర్షాల తీవ్రతపై కేంద్రం స్పందించింది. ప్రధాని మోదీ సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు.

సీఎం కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. బాధితులందరినీ ఆదుకుంటామని ప్రకటించారు.

వరదలు తగ్గిన తర్వాత పంట నష్టం అంచనా వేసి పరిహారం చెల్లిస్తామని సీఎం తెలిపారు.

ముందు జాగ్రత్త చర్యల్లో లోపం..

''వాతావరణ శాఖ భారీ వర్షాలు పడతాయనే హెచ్చరిక చేసినప్పుడే అప్రమత్తం కావాల్సింది. కానీ డ్యాముల నిర్వహణలో జాగ్రత్తలు పాటించలేదు. ముందుగా డ్యాములు ఖాళీ చేయాలి. ఎగువ నుంచి వరద వచ్చే ప్రమాదం ఉన్నందుకు దానికి సన్నద్ధం కావాలి. కానీ పింఛా వద్ద జరిగిన తప్పిదమే ఇంత పెద్ద వరదకు కారణమయ్యింది.

భారీ వర్షాలు పడినా నిరుడు నష్టం రాకుండా గట్టెక్కాం. అప్పుడే పింఛా కట్ట ప్రమాదానికి గురైంది. తగిన చర్యలు లేవు. తాత్కాలిక ఏర్పాట్లతో ఇంత పెద్ద వరదను ఎదుర్కోవడం సాధ్యం కాదు.

దానివల్లే అన్నమయ్య ప్రాజెక్టు ముప్పు ఏర్పడింది. ఫలితంగా ప్రజలు వరదల్లో కొట్టుకుపోవాల్సి వచ్చింది. నెల్లూరు జిల్లాలో అపారనష్టానికి కారణమైంది’’ అని ఇరిగేషన్ రిటైర్డ్ ఇంజనీర్ ఎస్.బాలవీరాంజనేయులు అభిప్రాయపడ్డారు.ఒకవైపు పెన్నా నదికి గండికోట, మైలవరం, పెన్నార్ నుంచి వరదలు వచ్చాయి. రెండోవైపు సోమశిల తీవ్రస్థాయిలో కనిపించింది. అలాంటప్పుడు తగిన జగ్రత్తలు తీసుకుంటే నష్ట నివారణ జరిగేది. అక్కడే తగిన ముందస్తు చర్యలు లేవు. ప్రాణ నష్టానికి మూలం అదే అంటూ ఆయన బీబీసీతో అన్నారు.అయితే, అన్నమయ్య డ్యామ్ గేట్లు నిర్వహణ లోపం, వరద అంచనాలో విషయంలో జరిగిన తప్పిదాలే భారీ నష్టాలకు కారణమనే వాదనను ఐఏఎస్ అధికారి శశిభూషణ్ కుమార్ తోసిపుచ్చారు. ''అన్నమయ్య డ్యామ్ నిర్వహణ లోపాలు లేవు. భారీ వరద ఊహించని స్థాయిలో వచ్చింది. అప్పటికే దిగువ గ్రామాల ప్రజలను హెచ్చరించాం. 1500 మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. మిగిలిన వారు మాత్రం అప్రమత్తత పాటించలేదు. అందుకే ప్రాణ నష్టం జరిగింది. అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది’’ అన్నారు శశిభూషణ్ కుమార్.

నిర్లక్ష్యం వల్లే ఈ నష్టం: అచ్చెన్నాయుడు

ప్రజలు వరదలలో చిక్కుకుని విలవిలలాడుతుంటే ముఖ్యమంత్రి రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది.''రాష్ర్టంలో వర్షాలు, వరదలు కారణంగా ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో బిక్కుబిక్కుమంటు రోడ్లపై ఉన్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఈ విధంగా ముఖ్యమంత్రి వరదలపై శ్రద్ధ పెట్టకుండా బురద రాజకీయాలు చేస్తూన్నారు.రాష్ట్రానికి వరద ముప్పు ఉందని తెలిసినా ముఖ్యమంత్రి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యహవరించటం వల్లే ఇంత పెద్ద మెత్తంలో పంట, ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.

దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ‎వరదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడడంతోపోటు వెంటనే సహాయ చర్యలు చేపట్టాలి.

చనిపోయిన వారి ‎ కుటుంబాలకు తక్షణమే ఆర్దిక సాయం అందించాలి. ఆరుగాలం శ్రమించి చేతికందిన పంట నీట మునగటంతో అన్నదాతలు ఆవేదన, ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వం తక్షణమే పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
AP floods: Rayalaseema, Nellore floods, dams washed away due to negligence
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X