మహిళా భక్తులు స్నానం చేస్తుండగా ఫోటోలు,వీడియోలు... బ్లాక్‌మెయిల్‌కి పాల్పడ్డ కానిస్టేబుల్ అరెస్ట్
అతనో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్... ప్రజలకు రక్షణగా నిలవాల్సింది పోయి తానే బ్లాక్‌మెయిల్ వ్యవహారాలకు తెరలేపాడు. పవిత్ర పుణ్యక్షేత్రంలో పాడు పనులకు పాల్పడ్డాడు. మహిళా భక్తులు స్నానం చేస్తుండగా తీసిన ఫోటోలు,వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్ చేశాడు. ఆలయ నిర్వాహకుల ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు వారి నుంచి డబ్బు గుంజాలని చూశాడు. చివరకు పోలీసుల ఎంట్రీతో సదరు కానిస్టేబుల్ కటకటాల పాలయ్యాడు.
పోలీసుల కథనం ప్రకారం... తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం సమీపంలోని పాండవులమెట్ట ప్రాంతంలో సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. స్థానిక వైర్‌లెస్ రిపీటర్ సెంటర్‌లో కనకారావు అనే వ్యక్తి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆలయానికి వచ్చే మహిళా భక్తులపై అతని కన్ను పడింది. వారిని అడ్డుపెట్టుకుని ఆలయ నిర్వాహకుల నుంచి డబ్బులు గుంజాలని చూశాడు. ఇందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు.

ఆలయ అర్చకుడి బంధువైన ఓ బాలుడితో మహిళా భక్తులు స్నానం చేస్తుండగా ఫోటోలు తీయించాడు. ఆపై ఆ ఫోటోలను అడ్డుపెట్టుకుని ఆలయ నిర్వాహకులను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. రూ.5లక్షలు ఇవ్వాలని వారిని డిమాండ్ చేసిన కనకారావు... ఇవ్వనిపక్షంలో ఆ ఫోటోలు బయటపెడుతానని,దానికి మీరే బాధ్యులని ప్రచారం చేస్తానని వారిని బెదిరించాడు. దీంతో ఆలయ నిర్వాహకుల కుటుంబం పోలీసులను ఆశ్రయించి అతనిపై ఫిర్యాదు చేసింది.
ఆ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఏఆర్ కానిస్టేబుల్ కనకారావు,అతనికి సహకరించిన మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్సై తెలిపారు.
కాగా,మరో ఘటనలో నెల్లూరు జిల్లా గూడూరులో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో తేజస్విని అనే యువతిపై వెంకటేశ్ అనే యువకుడు కత్తితో దాడి చేసి,చున్నీతో గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అతను ఆత్మహత్యకు యత్నించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలికి చొరబడ్డ అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.












Click it and Unblock the Notifications