కేంద్రానికి సుప్రీంకోర్టు అబేయన్స్ షాక్..:
ఆరావళి పర్వత శ్రేణులకు తీవ్ర ముప్పు ఏర్పడింది. అరావళి పర్వత శ్రేణులపై కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనను సుప్రీంకోర్టు ఆమోదించినప్పటి నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చుట్టుపక్కల భూమి నుండి 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న కొండలను మాత్రమే అరావళి పర్వతాలుగా పరిగణించాలనే కేంద్రం ప్రతిపాదించింది. దీనికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నిర్ణయం పర్యావరణానికి తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుందని పలువురు ఆందోళన చెందుతున్నారు.
ఈ పరిణామాల మధ్య సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన తీర్పుతో పాటు నిపుణుల కమిటీ సిఫార్సులను నిలిపివేసింది. వాటన్నింటినీ కూడా అబేయన్స్ లో పెట్టింది. ఇది- అరావళి పర్వత శ్రేణుల పరిరక్షణ కేసులో కీలక మలుపు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ప్రత్యేక ధర్మాసనం ఈ మేరకు తాజా తీర్పు ఇచ్చింది. పర్యావరణవేత్తల ఆందోళనలను సుమోటోగా స్వీకరించింది.

అరావళిలో మైనింగ్‌పై పూర్తి నిషేధాన్ని తిరస్కరించిన గత తీర్పుతో పాటు కొండలను పునర్నిర్వచించిన కమిటీ సిఫార్సులను కూడా తదుపరి ఆదేశాల వరకు అబియాన్స్‌లో ఉంచుతున్నట్లు స్పష్టం చేసింది. విచారణలో ప్రధాన న్యాయమూర్తి పిటిషన్‌దారుల ప్రవర్తన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత కూడా బయటకి వెళ్ళి మాట్లాడుతున్నారని, ఇది సరికాదని, దాన్ని తాము అభినందించట్లేదని తెలిపింది.
తదుపరి విచారణను జనవరి 21వ తేదీకి వాయిదా వేసిందీ ధర్మాసనం. ఈ కేసుపై సమగ్ర విచారణకు వస్తుందని కోర్టు ఆదేశించింది. వాటాదారులకు తమ వాదనలు వినిపించుకోవడానికి అవకాశం కల్పించింది. తదుపరి విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, పర్యావరణవేత్తలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని సూచించింది.
నాలుగు రాష్ట్రాల్లో లక్షలాది హెక్టార్లల్లో విస్తరించిన ఈ ఆరావళి పర్వత పంక్తులకు ఇండియన్ అమెజాన్ ఫారెస్ట్ గా గుర్తింపు ఉంది. ఈ పర్వత శ్రేణులు పశ్చిమ, వాయువ్య రాష్ట్రాలకు పెట్టనికోట. ఇక్కడి భూగర్భజలాలు, వాతావరణం, ప్రజల జీవనాన్ని ప్రభావితం చేస్తోంది. కాలుష్య నియంత్రణలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. అరావళి పర్వత శ్రేణిలో దేన్ని చేర్చాలనే దానిపై ప్రస్తుతం వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, అరావళి భవిష్యత్తుపై ఏం జరగబోతుందనేది ఆందోళనకంగా మారింది.












Click it and Unblock the Notifications