• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్గానిస్తాన్‌లో హిందువులు, సిక్కుల సంఖ్య తగ్గిపోతోందా, అక్కడ మైనారిటీల పరిస్థితి ఏమిటి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బిందియా కౌర్

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలో వచ్చి ఏడాది పూర్తయింది. ఇప్పటికీ, రాజధాని కాబూల్ సహా ఇతర ప్రాంతాల్లో తీవ్రవాదుల దాడులు, పేలుళ్ల భయం ఉంది. ఆ దేశంలో పోరాటం ముగిసినట్టే ఉంది కానీ, శాంతి లేదనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో, మేం కాబూల్‌లోని అసామాయీ ఆలయానికి వెళ్లాం. అక్కడున్న ఇనుప తలుపులు తడితే, జాలీ ఉన్న చిన్న కిటికీ తలుపు తెరుచుకుంది. లోపలి నుంచి ఒక వ్యక్తి మమ్మల్ని అనుమానంగా చూస్తూ 'ఎవరు మీరు’ అని అడిగారు.

ఆయన హర్జిత్ సింగ్ చోప్రా, పురాతన అసామాయీ ఆలయ పూజారి. అఫ్గానిస్తాన్‌లో మిగిలి ఉన్న అతి కొద్దిమంది హిందువుల్లో ఒకరు.

ఈ ఆలయంలో అమ్మవారిని పూజిస్తారు. ఇక్కడ అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఇక్కడే శివాలయం కూడా ఉంది. గుడిలో శ్రీమద్భాగవతం, రామాయణం కూడా ఉన్నాయి.

ఆలయ ప్రాంగణంలోనే హర్జిత్ సింగ్, ఆయన భార్య బిందియా కౌర్ నివసిస్తున్నారు. వారితో పాటు ఒక గార్డు కూడా ఉంటారు.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ పాలన కారణంగా వీరిద్దరి కుటుంబాలు భారత్ తరలివెళ్లాయి. కానీ, ఆ భార్తాభర్తలిద్దరూ ఈ గుడిని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయారు.

తాలిబాన్

తీవ్రవాదుల దాడి భయం

దాడుల భయంతో ఈ ఆలయంలో పూజలు కూడా నిశ్శబ్దంగా జరుగుతాయి. పూజలు రికార్డు చేసేందుకు అనుమతి లేదు. పూజ జరుగుతోందని తెలిస్తే దాడులు జరుగుతుందనే భయం ఉంది.

ఒకప్పుడు హర్జిత్ సింగ్ అఫ్గానిస్తాన్‌లోని ఖోస్త్ ప్రాంతంలో పనిచేసేవారు. అఫ్గానిస్తాన్‌లో హిందువుల పరిస్థితిని వివరించారాయన.

"మేం అమ్మవారి చరణాల వద్ద కూర్చుని సేవ చేసుకుంటున్నాం. భయపడాల్సిన అవసరం మాకు లేదు. మేం ఆలయం విడిచిపెట్టి వెళ్లం. అఫ్గానిస్తాన్‌లో 10-11 మంది హిందువులు మిగిలారు. ఏడు ఎనిమిది ఇళ్లు ఉంటాయి. అందులో మాదీ ఒకటి. ఒకటి రాజారాంలో ఉంది. మరొక రెండిళ్లు కార్తీ పర్వాన్‌లో ఉన్నాయి. ఒకట్రెండు ఇళ్లు షేర్ బజార్‌లో ఉన్నాయి. అక్కడ ఉన్నవాళ్లు చాలా పేదవాళ్లు. వాళ్లకి పాస్‌పోర్ట్ అంటే ఏమిటో కూడా తెలీదు. వాళ్లు చదువుకోలేదు. ఇక్కడే పుట్టి పెరిగారు.

మొదట జలాలాబాద్‌లో బాంబు పేలుడు జరిగింది. దాంతో, సుమారు 600-700 మంది భయపడి భారతదేశానికి వెళ్లిపోయారు. షేర్ బజార్‌లో (కాబూల్‌లో) బాంబు పేలినప్పుడు 30 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అప్పుడు మరో 200 మంది భారత్ వెళ్లిపోయారు.

తాలిబాన్లు వచ్చాక చాలామంది భయంతో భారత్ వెళ్లిపోయారు. కార్తీ పర్వాన్‌లో ప్రమాదం జరిగినప్పుడు 50-60 మంది భారతదేశానికి పయనమయ్యారు. మేము అమ్మవారి సేవ కోసం ఇక్కడే ఉండిపోయాం. హిందువులు, సిక్కులు ఇక్కడ ఉండలేకపోతున్నారు. అందరూ భారతదేశానికి వెళ్లిపోతున్నారు.

2018లో జలాలాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో, 2020లో కాబూల్‌లోని గురుద్వారాపై జరిగిన తీవ్రవాద దాడిలో చాలా మంది సిక్కులు మరణించారు. ఈ ఏడాది జూన్‌లో కాబూల్‌లోని కార్తీ పర్వాన్ గురుద్వారాపై జరిగిన దాడిలో ఒక సిక్కు వ్యక్తి మరణించారు" అని హర్జిత్ చెప్పారు.

బిందియా కౌర్ కుటుంబం భారత్‌లో ఉంది. ఆమె ఇక్కడ ఇంటి పనులు చేసుకుంటూ, అమ్మవారికి సేవ చేస్తూ కాలం గడుపుతున్నారు.

"గతంలో ఈ ఆలయంలో 20 కుటుంబాలు నివసించేవి. కొంతమంది భయంతో ఇక్కడి నుంచి వెళ్లిపోవడం మొదలుపెట్టారు. ఒక అయిదు కుటుంబాలు మాత్రం ఇక్కడే ఉండిపోయాయి. తరువాత, వాళ్లూ భయపడి వెళ్లిపోయారు. అందరూ ఒకరి తరువాత ఒకరుగా వెళ్లిపోయారు. ఇంతకు ముందు ఇంకా దారుణంగా ఉండేది. పేలుళ్లు జరిగేవి. గత సంవత్సరం తాలిబాన్లు వచ్చారు. మిగిలినవాళ్లు కూడా వెళ్లిపోయారు. మేం ఒంటరిగా మిగిలిపోయాం" అని బిందియా కౌర్ చెప్పారు. వాళ్ల ఇంటి పక్కన ఇళ్లకు తాళాలు వేలాడడం చూపించారు.

Harjit singh

హిందువులు, సిక్కులు మాయమైపోతున్నారు..

ఈ ఆలయానికి దగ్గర్లోనే కార్తీ పర్వాన్ ప్రాంతం ఉంది. కాబూల్‌లోని అన్ని ప్రాంతాల్లాగే ఇక్కడా కూడా ప్రతి కూడలిలోనూ చెక్ పోస్టులు ఉన్నాయి. రోడ్లపై తుపాకులతో గస్తీ కాస్తున్న తాలిబాన్లు కనిపిస్తున్నారు.

ఒకప్పుడు కార్తీ పర్వానా ప్రాంతం మొత్తం హిందువులు, సిక్కులతో నిండి ఉండేది.

"ఒకప్పుడు ఈ ప్రాంతమంతా హిందువులు, సర్దార్లకు నిలయంగా ఉండేది. హిందువులు కరెన్సీ, దుస్తుల వ్యాపారం చేసేవారు. పన్సారీ పని హిందువులది. కొంతమంది డాక్టర్లు కూడా ఉండేవారు. ప్రభుత్వ ఉద్యోగాలలో హిందువులు వైద్యులుగా, ఇంజనీర్లుగా ఉండేవారు. సైన్యంలో కూడా ఉండేవారు" అని రామ్ శరణ్ భసీన్ అనే వ్యక్తి చెప్పారు. ఆయన అక్కడే నివసిస్తున్నారు.

చాలా సంవత్సరాల క్రితం కాబూల్‌పై రాకెట్ల వర్షం కురిసిందని, తమ ఇంటిపై కూడా ఒక రాకెట్ పడిందిగానీ పేలలేదని రామ్ శరణ్ చెప్పారు.

"అప్పుడు నేను ఇంట్లో లేను. నా భార్య మాత్రమే ఉంది. ఆ రాకెట్ పేలలేదు. దేవుడే మమ్మల్ని కాపాడాడు. అది పేలితే నా ఇల్లుగానీ, నా భార్యగానీ నాకు దక్కేవారు కాదు" అని చెప్పారు.

నేడు అఫ్గానిస్తాన్‌లో ప్రజలు భయం నీడలో బతుకుతున్నారు. సొంత ఇళ్లల్లోనే బందీలుగా కాలం గడుపుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్లల్లోంచి బయటకు రావట్లేదు.

ఒక సర్వే ప్రకారం, 1992కు ముందు అఫ్గానిస్తాన్‌లో రెండు లక్షలకు పైగా హిందువులు, సిక్కులు ఉండేవారు.

కానీ గత 30 సంవత్సరాలలో హిందువులు, సిక్కులపై దాడులు, భారతదేశం లేదా ఇతర దేశాలకు వలసల తరువాత, నేడు వారి సంఖ్య దాదాపు 100కి పడిపోయింది. ఇప్పుడు ఈ సంఖ్య ఇంకా తగ్గిపోయింది.

అఫ్గానిస్తాన్ స్థానిక సంస్థ పోర్షే రీసెర్చ్ అండ్ స్టడీస్ ఆర్గనైజేషన్ మైనారిటీల సమస్యలపై పనిచేస్తుంది. తాలిబాన్ల రాక తరువాత సంస్థ మూతపడింది. ఇందులో పనిచేసిన చాలా మంది దేశం విడిచిపెట్టారు.

అఫ్గానిస్తాన్‌లోని హిందువులు, సిక్కుల పరిస్థితిపై ఈ సంస్థ తన నివేదికలో... "అఫ్గానిస్తాన్ నుంచి హిందువులు, సిక్కుల వలస చరిత్ర, 1980లలో సోవియట్ ఆక్రమణ, తోలుబొమ్మ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జిహాద్ వ్యతిరేక ఉద్యమంతో ముడిపడి ఉంది. అప్పటి నుంచి దేశంలో మైనారిటీలపై రోజువారీ ఆంక్షలు, దౌర్జన్యాలు, వారి వలసలు కొనసాగుతున్నాయి" అని తెలిపింది.

ఈ నివేదిక ప్రకారం, అఫ్గానిస్తాన్‌లో హిందువులు, సిక్కులకు 1960 నుంచి 1980 మధ్య కాలం శాంతియుతంగా సాగింది. వాళ్లని లాలా లేదా పెద్దన్నాయ్య అని పిలిచేవారు. వాళ్లకు ఇక్కడి సామాన్య ప్రజలతో మంచి సంబంధాలు ఉండేవి.

1988 నుంచి పెద్ద సంఖ్యలో వారి వలసలు ప్రారంభమయ్యాయి. ఆ ఏడాది ఏప్రిల్ 13, వైశాఖి నాడు జలాలాబాద్‌లో ఒక వ్యక్తి 13 మంది సిక్కులను, నలుగురు ముస్లిం సెక్యూరిటీ గార్డులను తుపాకీతో కాల్చి చంపాడు.

ఆ తరువాత, అపహరణలు, ఆర్థిక, విద్య, సాంస్కృతిక అణచివేత, భూములు, ఆస్తులను జప్తు చేయడం మొదలైన చర్యల వల్ల హిందువుల, సిక్కుల పరిస్థితి మరింత దిగజారింది.

ఈ రిపోర్ట్ రాసిన అలీ దాద్ మొహమ్మదీ అఫ్గానిస్తాన్‌లో హిందువులు, సిక్కులపై వివక్ష గురించి ఇలా అన్నారు.

"వాళ్లు ఇళ్ల నుంచి బయటకు అడుగు పెట్టిన తరువాత, వాళ్ల పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించేవారు. వారిని ముస్లిమేతరులు, హిందూ కచాలూ అని పిలిచేవారు. హిందువులకు వేరే మార్గం లేదు. అఫ్గానిస్తాన్ వదిలి వెళ్లిపోవాలి లేదా ఇక్కడే ఉంటూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. తరువాత, వారి ఆస్తులు, ఇళ్లను కూడా లాక్కున్నారు."

అఫ్గానిస్తాన్‌లోని హిందువుల దేవాలయాలు, గురుద్వారాలను ధ్వంసం చేశారని, వాటిని డంప్ యార్డులుగా లేదా వారి పెంపుడు జంతువులను కట్టే శాలలుగా వాడుకున్నారని మొహమ్మదీ చెప్పారు. మిగిలి ఉన్న ఆ కొద్ది గురుద్వారాలపై తీవ్రవాద దాడులు జరిగాయని చెప్పారు.

రామ్ శరణ్ భసీన్

కార్తీ పర్వాన్ గురుద్వారాపై దాడి, మరమ్మతులు

ఈ ఏడాది జూన్‌లో కార్తీ పర్వాన్ ప్రాంతంలోని ఒక పురాతన గురుద్వారాపై తీవ్రవాదుల దాడి జరిగింది. ఒక సిక్కు వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. గురుద్వారాకు పెద్ద నష్టం వాటిల్లింది.

తాలిబాన్ల ఆర్థిక సాయంతో మరమ్మత్తులు చేయిస్తున్న ఆ గురుద్వారాకు మేం వెళ్లాం. దాని చుట్టూ నడిచి చూస్తే, గురుద్వారా ఎంతగా ధ్వంసమైపోయిందో తెలుస్తోంది.

సిక్కుల చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, కుర్చీలు, బల్లలు, సెక్యూరిటీ కెమెరాలు, కిటికీలు, తివాచీలు, అల్మారాలు ఇలా ఎన్నో కాలిపోయాయి. అక్కడ మరమ్మత్తు పనులు చేస్తున్న వారంతా స్థానిక అఫ్గాన్లు అని మాకు చెప్పారు.

దాడి జరిగినప్పుడు గురుద్వారా కేర్‌టేకర్ గుర్నామ్ సింగ్ రాజ్‌వంశ్ అక్కడికి దగ్గరలోనే ఉన్నారు.

"గురుద్వారా వెనుకే మా ఇల్లు ఉంది. గురుద్వారాపై దాడి జరిగిందని తెలియగానే పరిగెత్తుకుని ఇక్కడకు వచ్చాం. రోడ్డు బంద్ చేశారు. ఒక 18 మంది గురుద్వారాలో ఉన్నారు. సవీందర్ సింగ్ అనే ఆయన బాత్రూంలో ఉండిపోయారు. అక్కడే ప్రాణాలు వదిలారు" అని ఆయన చెప్పారు.

మాతో మాట్లాడిన తరువాత కొద్ది రోజులకు గుర్నాం సింగ్ కూడా అందరిలాగే భారత్ వెళ్లిపోయారు. వరుస దాడులతో, భయంతో బిక్కుబిక్కుమంటూ భారత వీసా కోసం ఎదురుచూస్తున్నవారు ఇంకా కొందరున్నారు.

నేను కాబూల్ రాక మునుపు దిల్లీలోని తిలక్ నగర్‌లో గురు అర్జున్ దేవ్ జీ గురుద్వారాలో హర్జిత్ కౌర్‌ను, ఆమె కుటుంబాన్ని కలిశాను. ఆమె కొద్ది రోజుల ముందే కాబూల్ నుంచి భారతదేశానికి తరలి వచ్చారు.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల కంటే ముందు నుంచే పరిస్థితి దారుణంగా ఉండేదని, ఇప్పుడు మరింత అధ్వాన్నంగా తయారైందని హర్జిత్ కౌర్ చెప్పారు. బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పుల వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని. పిల్లల చదువులు మూలపడ్డాయని చెప్పారు.

కొంతమంది భారత్ వెళ్లినా, అఫ్గాన్‌లో ఉన్న ఆస్తుల కారణంగా మళ్లీ వెనక్కు రావలసి వచ్చిందని గుర్నామ్ సింగ్ చెప్పారు.

అఫ్గానిస్తాన్‌

అల్పసంఖ్యాకులపై కొనసాగుతున్న దాడులు

గత నెల జూలైలో కార్తీ పర్వాన్‌లోని ఒక సిక్కు దుకాణంపై అజ్ఞాత వ్యక్తులు గ్రెనేడ్‌తో దాడి చేశారు. ఆ దుకాణంలో సుమారు నాలుగు లక్షల అఫ్గాన్ కరెన్సీ దెబ్బతింది. అయితే, ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు.

ఆ దుకాణం యజమాని అర్జీత్ సింగ్ మధ్యహ్నం భోజనానికి బయటకు వెళ్లినప్పుడు ఈ దాడి జరిగింది.

"పెద్ద శబ్దం వినిపించింది. నా దుకాణం నుంచి పొగలు కనిపించాయి. మధ్యలో ఉన్న కౌంటర్ బూడిదైపోయింది. సరుకులు కింద చెల్లాచెదురుగా పడిపోయాయి" అని ఆయన చెప్పారు.

కార్తీ పర్వాన్ గురుద్వారా దాడిలో మరణించిన సవీందర్ సింగ్, అర్జీత్ సింగ్‌కు బావ. అంతకు ముందు 2018లో జరిగిన ఒక దాడిలో అర్జీత్ కుటుంబంలోని వ్యక్తులు మరణించారు.

తన దుకాణంపై దాడితో మిగతా సిక్కు దుకాణదారులంతా చాలా భయపడ్డారని అర్జీత్ సింగ్ చెప్పారు.

మరో సిక్కు సుఖ్‌వీర్ సింగ్ ఖాల్సా కుటుంబంలో అందరికీ భారత వీసా వచ్చింది గానీ, ఆయన భార్యకు మాత్రం రాలేదు. దాని కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారు. ఇలా కుటుంబంలో ఒకరిద్దరికి వీసా రాక అక్కడే చిక్కుకుపోయినవారు కూడా ఉన్నారు.

మరోవైపు, తమ దేశంలో ఉన్న అందరినీ రక్షించడమే తమ విధానమని తాలిబాన్లు అంటున్నారు.

కాబూల్ పోలీసు ప్రతినిధి ఖలీద్ జద్రాన్ బీబీసీతో మాట్లాడుతూ, "అఫ్గానిస్తాన్‌లో ఉన్న పౌరులందరిని రక్షించడం మా విధానం. ఇది ఇక్కడ ఉన్న హిందూ, సిక్కు మైనారిటీలకూ వర్తిస్తుంది. మేము వారికి రక్షణ కల్పిస్తున్నాం. వారికి ఏదైనా ప్రమాదం ఉందని భావిస్తే, ఆ సమాచారాన్ని మా దళాలతో పంచుకోవాలి. వారిని రక్షించడానికే మా దళాలు ఉన్నాయి" అని అన్నారు.

అఫ్గానిస్తాన్ శతాబ్దాలుగా యుద్ధం నీడలో బతుకుతోంది. తాజాగా తాలిబాన్ రాకతో అక్కడ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అంతర్జాతీయ నిధులు ఆగిపోవడం, కరువు, భూకంపాలు అక్కడి ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. ఆర్థికవ్యవస్థ అధ్వాన్న స్థితిలో ఉంది. ప్రజలకు ఆహారం, మందులు దొరకట్లేదు.

ఎవరికి వీలుంటే వారు ఆ దేశం విడిచి వెళ్లిపోతున్నారు. అఫ్గానిస్తాన్‌లో హిందువులు, సిక్కులు నివసించిన కాలం ఒకటి ఉండేదని చరిత్రకారులు చెప్పే రోజు ఎంతో దూరంలో లేదనే భయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Are the numbers of Hindus and Sikhs decreasing in Afghanistan, what is the situation of minorities there? - BBC Ground Report
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X