జగన్ స్టైల్‌లో హరీష్ రావు వార్నింగ్! రాసి పెట్టుకోండి, మనం రాగానే..
తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు అధికార పార్టీకి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి ఎలాంటి తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేస్తున్నారో.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అదే రేంజ్ పొలిటికల్ హీట్ పెంచారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'ఫ్యూచర్ సిటీ' ప్రాజెక్ట్‌పై హరీష్ రావు క్లియర్ కట్ టైంలైన్‌తో డెడ్ లైన్ విధించారు. "రాసి పెట్టుకోండి.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయం, వచ్చిన వెంటనే ఈ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ సిటీని వంద శాతం రద్దు చేయడం తథ్యం" అంటూ తన స్టైల్లో పవర్‌ఫుల్ పొలిటికల్ వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఫ్యూచర్ సిటీ' అనేది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ జిమ్మిక్కు అని హరీష్ రావు తీవ్రంగా ఆరోపించారు. "ఫార్మా సిటీ అభివృద్ధి చెందితే బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే ఈర్ష్యతోనే కాంగ్రెస్ ఈ డ్రామాలు ఆడుతోంది. భూములు పంచిపెట్టి బ్యాక్ ఎండ్‌లో ఏదో భారీ లబ్ధి పొందాలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేసింది. కానీ, వాళ్లు ఏం చేసినా నడవదు.. నిలబడదు. ఎందుకంటే కేంద్ర పర్యావరణ శాఖ అన్ని అనుమతులు ఇచ్చింది కేవలం మేము ప్రతిపాదించిన ఫార్మా సిటీకే! కాంగ్రెస్ తెచ్చిన ఫ్యూచర్ సిటీకి ఎలాంటి లీగల్ బ్యాకప్ లేదు" అని హరీష్ రావు కుండబద్దలు కొట్టారు.

హైకోర్టులో దొరికిపోయిన కాంగ్రెస్ సర్కార్
రేవంత్ రెడ్డి ప్రభుత్వం బయటకు 'ఫ్యూచర్ సిటీ' అంటూ కలరింగ్ ఇస్తున్నప్పటికీ, కోర్టుల ముందు మాత్రం అసలు రంగు బయటపడిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఈ మధ్యే హైకోర్టులో ఒక కేసు విచారణకు వచ్చినప్పుడు.. "మేము ఫార్మా సిటీని కంటిన్యూ చేస్తున్నాం" అని స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కోర్టుకు అఫిడవిట్ సమర్పించిందని ఆయన గుర్తుచేశారు. బయట జనాన్ని నమ్మించడానికి ఒక మాట, కోర్టులో మరో మాట చెప్తూ రేవంత్ సర్కార్ కేవలం టైంపాస్ చేస్తోందని, ఇప్పటికే రెండున్నరేళ్ల పాలన గడిచిపోయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. చివరి ఏడాది ఎలాగూ ఎన్నికల మూడ్ ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ ఉండదన్నారు.
75:25 రివర్స్ స్కెచ్.. చట్ట ప్రకారం చెల్లదు!
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా సిటీని ప్రతిపాదించినప్పుడు.. 75 శాతం ఫార్మా రంగానికి, దానికి అనుబంధంగా కనీస సౌకర్యాలు, ఎడ్యుకేషన్, హౌసింగ్ కోసం మిగిలిన 25 శాతం భూమిని కేటాయించాలని ప్లాన్ చేసిందని హరీష్ రావు వివరించారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పూర్తిగా రివర్స్ చేసి.. 75 శాతం భూమిని రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలకు వాడుకుంటూ, కేవలం 25 శాతమే ఫార్మాకు పరిమితం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఈ డీవియేషన్ (మార్పు) చట్ట ప్రకారం అస్సలు చెల్లదని ఆయన స్పష్టం చేశారు.
పార్లమెంట్ చట్టం ఉంది.. భూములు వెనక్కి తీసుకోవడం ఖాయం!
తన హెచ్చరికల వెనుక బలమైన చట్టం ఉందంటూ హరీష్ రావు పార్లమెంట్ నిబంధనలను గుర్తుచేశారు. "ఫార్మా సిటీ వస్తే లక్షలాది మంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు వస్తాయని, మన దగ్గర నుంచి ఒక్క కంపెనీ కూడా పక్క రాష్ట్రాలకు పోవద్దని మేము ఎంతో కష్టపడి భూసేకరణ చేశాం. పార్లమెంట్ చట్టం ప్రకారం.. ఏ ఉద్దేశంతోనైతే రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నామో, దానికి భిన్నంగా (డీవియేషన్) ల్యాండ్ యూజ్ మారిస్తే ఆ భూములను తిరిగి రైతులకే ఇచ్చేయాలి. ఇది నా సొంత మాట కాదు.. దేశ చట్టం చెప్తున్న మాట" అని హరీష్ రావు ఉద్ఘాటించారు. తాము అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేసి, చట్టబద్ధంగా అక్కడ ఫార్మా సిటీనే రీస్టోర్ చేస్తామని, పాత ప్రాజెక్టునే ఉన్నది ఉన్నట్టుగా నిలబెడతామని పొలిటికల్ హీట్ పెంచుతూ హరీష్ రావు స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications