వైఎస్సార్, జగన్ కే హ్యాండిచ్చావ్..! సాయిరెడ్డికి తలంటేసిన కాంగ్రెస్..!
గతేడాది రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించి ఈ మధ్య యూటర్న్ తీసుకుని వరుసగా కేంద్ర, రాష్ట్రాల్లో రాజకీయాలపై, పార్టీలపై ట్వీట్లు పెడుతున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)కి తాజాగా కాంగ్రెస్ (Congress) భారీ షాకిచ్చింది. తమిళనాడులో డీఎంకే కూటమికి హ్యాండిచ్చి టీవీకేకు మద్దతు పలకడంపై కాంగ్రెస్ పార్టీకి నీతులు చెప్పడం ప్రారంభించిన సాయిరెడ్డికి.. స్థానిక కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ ఘాటుగా జవాబిచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్ కు విధేయత లేదంటూ విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్ కు మాణిక్కం ఠాకూర్ (Manickam tagore) గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
"షాకు లొంగిపోయిన" విజయసాయి రెడ్డి, ఇతరులకు విధేయత, నమ్మకం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం పరాకాష్టకు చేరిన రాజకీయ వైరుధ్యం అన్నారు. ఈయన వైఎస్ఆర్ వారసత్వాన్ని వదిలేసి, తాను నిర్మించి, ఇప్పటికీ సీబీఐ కోర్టులో ఉన్న వ్యాపారానికి సహాయపడిన వ్యక్తికే దూరమై, రాజకీయ గాలులు మారినప్పుడు తన సొంత రాజకీయ భాగస్వామి జగన్‌కు కూడా దూరమయ్యారు. దృఢ సంకల్పం కంటే రాజకీయ మనుగడకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి, పొత్తులు లేదా సూత్రాల గురించి ఉపన్యాసాలు ఇవ్వడానికి ఏమాత్రం అర్హులు కారన్నారు.

అమిత్ షాకు,బీజేపీ వ్యవస్థకు పూర్తిగా లొంగిపోయిన తర్వాత, ఇప్పుడు తమిళనాడు రాజకీయాల గురించి పట్టించుకుంటున్నట్లు నటిస్తూ ఢిల్లీ వాదనలనే వల్లెవేస్తున్నారన్నారు. ఈడీ-సీబీఐ ఒత్తిడి, పథకం ప్రకారం జరిగిన ఫిరాయింపులు, బెదిరింపులు, తెరవెనుక ఒప్పందాలపై ఆధారపడి బతికే ఇదే బీజేపీ వ్యవస్థకు నైతికత, విధేయత లేదా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక అర్హత సున్నా అని తేల్చేశారు. అమిత్ షా వ్యవస్థ దొడ్డిదారిన తమిళనాడు ప్రభుత్వంలోకి ప్రవేశించి, దానిని ప్రభావితం చేయకుండా నిరోధించడానికి తమిళనాడు కాంగ్రెస్ ఒక స్పృహతో కూడిన రాజకీయ నిర్ణయం తీసుకుందని, 107 సీట్లతో, మెజారిటీ మార్కుకు కొద్ది దూరంలో ఉన్న టీవీకే, సామాజిక న్యాయం, సమాఖ్యవాదం మరియు రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్న లౌకిక పార్టీలతో కలిసి పనిచేయాలని ఎంచుకుందని,దీనినే సూత్రబద్ధమైన రాజకీయాలు అంటారని గుర్తుచేశారు.

కానీ విజయసాయి రెడ్డి వంటి వారికి అది ఎప్పటికీ అర్థం కాదన్నారు. ఎందుకంటే వారి దృష్టిలో రాజకీయాలు అంటే సిద్ధాంతం లేదా ప్రజా సేవ కాదని, అది కేవలం అధికారం, డబ్బు, ఢిల్లీలోని పాలకవర్గానికి దగ్గరగా ఉంటూ అక్రమ నెట్‌వర్క్‌లను కాపాడుకోవడం మాత్రమే అన్నారు. తమ మనుగడ కోసం, తమ ఉనికి కోసం రాజకీయ స్వాతంత్ర్యాన్ని వదులుకున్న నాయకుల చేతిలో తమిళనాడు భవిష్యత్తు ఉండదన్నారు.














Click it and Unblock the Notifications