2027లోనే కొత్త జీతాలు.. కానీ భారీగా 'అరియర్స్'!
దేశవ్యాప్తంగా ఉన్న కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th Pay Commission) పరిధిలో వేతన సవరణల ప్రక్రియ ఊపందుకుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిషన్, ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాలలో భాగస్వామ్య పక్షాలతో క్షేత్రస్థాయి చర్చలు జరుపుతోంది.
ఈ క్రమంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల పెంపును డిసైడ్ చేసే 'ఫిట్మెంట్ ఫ్యాక్టర్' (Fitment Factor) ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కొత్త పే స్కేల్ ఖరారైతే ఉద్యోగుల కనీస బేసిక్ శాలరీ ఏకంగా మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని రక్షణ, రైల్వే తదితర కార్మిక సంఘాల అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.

జీతాన్ని డిసైడ్ చేసే మ్యాజిక్ నంబర్ 'ఫిట్మెంట్ ఫ్యాక్టర్'
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పాత ప్రాథమిక వేతనాన్ని (Basic Pay) కొత్త పే-స్ట్రక్చర్‌కు అనుగుణంగా మార్చడానికి ఉపయోగించే ఒక గణిత గుణకాన్ని (Multiplier) 'ఫిట్మెంట్ ఫ్యాక్టర్' అంటారు. సరళంగా చెప్పాలంటే, ప్రస్తుత బేసిక్ జీతాన్ని ఈ నంబర్‌తో గుణించి కొత్త జీతాన్ని లెక్కిస్తారు. గత 7వ వేతన సంఘం హయాంలో ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57గా ఖరారు చేశారు. దీనివల్ల ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనం అప్పట్లో రూ. 7,000 నుండి ఒకేసారి రూ. 18,000కి పెరిగింది. ఇప్పుడు 8వ పే కమిషన్‌లో ద్రవ్యోల్బణం, పెరిగిన జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని ఈ గుణకాన్ని భారీగా పెంచాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి.
రూ. 18 వేల నుండి రూ. 72 వేల వరకు.. సంఘాల భారీ డిమాండ్లు!
ప్రస్తుతం కొనసాగుతున్న చర్చల్లో వివిధ ఉద్యోగ సమూహాలు తమ డిమాండ్లను కమిషన్ ముందు ఉంచాయి. నేషనల్ కౌన్సిల్ (NC-JCM) ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 3.83కి పెంచాలని ప్రతిపాదిస్తుండగా, భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్ (BPMS) ఒక అడుగు ముందుకు వేసి దీనిని 4.0 శాతానికి పెంచడంతో పాటు వార్షిక ఇంక్రిమెంట్‌ను 3% నుండి 6% కి పెంచాలని డిమాండ్ చేస్తోంది.
- ఒకవేళ ప్రభుత్వం 3.83 ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను అంగీకరిస్తే, కనీస ప్రాథమిక వేతనం రూ. 18,000 నుండి ఒకేసారి రూ. 51,480కి చేరుతుంది.
- అదే 4.0 డిమాండ్‌కు గ్రీన్ సిగ్నల్ లభిస్తే, కనీస బేసిక్ శాలరీ ఏకంగా రూ. 72,000 కు పెరుగుతుంది.
- మరోవైపు రైల్వే టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ (IRTSA) ఉద్యోగుల స్థాయిని బట్టి (లెవెల్ 1 నుండి లెవెల్ 18 వరకు) 2.92 నుండి 4.38 వరకు వేర్వేరు మల్టిపుల్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్లను ఇవ్వాలని, కనీస జీతం రూ. 52,000 ఉండాలని సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.
క్షేత్రస్థాయి పర్యటనల్లో పే కమిషన్.. పెన్షనర్లకు గుడ్ న్యూస్!
జనవరి 1, 2026 నుండి కొత్త వేతన సవరణలు అమలులోకి రావాల్సి ఉన్నందున, 8వ పే కమిషన్ తన కసరత్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మే 18, 19 తేదీల్లో హైదరాబాద్‌లో పర్యటించిన కమిషన్ సభ్యులు, జూన్ మొదటివారంలో శ్రీనగర్, లడఖ్, లక్నోలలో పర్యటించి ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను సేకరించనున్నారు. ఇదే సమయంలో పెన్షనర్లకు ఊరటనిచ్చేలా.. ప్రతి 10 ఏళ్లకు కాకుండా, ప్రతి ఐదేళ్లకోసారి పెన్షన్ సవరణ చేపట్టాలనే పార్లమెంటరీ కమిటీ సిఫార్సును కూడా పరిశీలించాలని క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ నేతృత్వంలోని జేసీఎం సమావేశంలో నిర్ణయించారు.
2027లోనే కొత్త జీతాలు.. కానీ భారీగా 'అరియర్స్'!
కమిషన్ డేటా విశ్లేషణ మరియు నివేదిక తయారీకి ప్రభుత్వం సుమారు 18 నెలల సమయం కేటాయించింది. దీని ప్రకారం 2027 మధ్య నాటికి కానీ కమిషన్ తన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం లేదు. ఆ తర్వాతే కేంద్ర క్యాబినెట్ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది. అంటే పెరిగిన కొత్త జీతాలు చేతికి అందడానికి ఉద్యోగులు 2027 వరకు వేచి చూడక తప్పదు.
అయితే, ఈ కొత్త పే స్కేల్స్ జనవరి 1, 2026 నుండి పాత తేదీతో (Retrospective Effect) వర్తిస్తాయి కాబట్టి, అమలు ఆలస్యమైనప్పటికీ మధ్యలో ఉన్న నెలలన్నింటికీ భారీ మొత్తంలో బకాయిలు (Arrears) ఒకేసారి ఉద్యోగుల ఖాతాల్లో జమ కానున్నాయి. అప్పటివరకు ఉద్యోగులకు 7వ పే కమిషన్ నిబంధనల ప్రకారమే కరువు భత్యం (DA) పెంపుదల వంటి ఆర్థిక ప్రయోజనాలు కొనసాగుతాయి.














Click it and Unblock the Notifications