ఇక మోయలేం, తమిళనాడు ఫలితాలే నిదర్శనం- తేల్చేసిన చంద్రబాబు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి అవుతోంది. ఇదే సమయంలో పార్టీ - ప్రభుత్వంలో కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్లాలని సీఎం భావిస్తున్నారు. ఎమ్మెల్యేల తీరు పైన వస్తున్న ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా చర్యలకు సమాయత్తం అవుతున్నారు. ఈ క్రమంలోనే మహానాడు వేదిక ద్వారా పార్టీకి దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా.. తాజాగా పాలిట్ బ్యూరో సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఎమ్మెల్యేల తీరు పైన సీరియస్ అయ్యారు. ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకుంటే ఫలితం ఉండదని తేల్చి చెప్పారు. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికలే దీనికి నిదర్శనంగా చెప్పుకొచ్చారు. రెండేళ్లుగా పదే పదే ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోమని చెబుతూ వస్తున్నాను.. ఇక చెప్పడం ఉండదని.. చేతలే ఉంటాయని.. మాట వినని ఎమ్మెల్యేలను పార్టీ మోయదని చంద్రబాబు స్పష్టం చేశారు. తాజాగా పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే మహానాడుపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లో ఇటీవలి ఎన్నికల్లో అధికార పార్టీలు ఓటమి పాలయ్యాయని వివరించారు బెంగాల్లో శాంతిభద్రతల వైఫల్యం తీవ్రంగా ప్రభావితం చేసిందని విశ్లేషించారు.

చంద్రబాబు దిశా నిర్దేశం
అధికార పార్టీ నేతల అరాచకాలను ప్రజలు జీర్ణించుకోలేకపోయారని చెప్పారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అభివృద్ధి పరంగా బాగాచేసినా ఎమ్మెల్యేల అవినీతి ఆ పార్టీ ఓటమికి కారణమైందని చంద్రబాబు పేర్కొన్నారు. కేరళలో లెఫ్ట్ కూటమి ఓటమికి అవినీతి.. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ ఉదాసీనత ప్రధాన కారణాలుగా నిలిచాయన్నారు. వీటిని అర్థం చేసుకుని మన పనితీరును చక్కదిద్దుకుంటే 2029 ఎన్నికల్లో మన గెలుపును ఎవ్వరూ ఆపలేరని తేల్చిచెప్పారు. పార్టీ లైన్ దాటి పనిచేసే వారు తమను తాము సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయమన్నారు. తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదని.. అలాంటి వారిని ఉపేక్షించే ప్రశ్నే లేదన్నారు. తప్పు చేసినా మిమ్మల్ని మోస్తానని మాత్రం అనుకోవద్దని స్పష్టం చేసారు. కాగా, ఈ సారి మహానాడును స్త్రీశక్తి థీమ్‌తో నిర్వహించాలని, మహిళలకే పెద్దపీట వేయాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.












Click it and Unblock the Notifications