విజయ్ "ఒక్కరోజు సీఎం".. అర్జున్ సంచలన వ్యాఖ్యలు
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కథానాయకుడిగా, శంకర్ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఒకే ఒక్కడు' .. 1999 లో విడుదలైన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించింది. ఇండియన్ సినీ చరిత్రలోనే ఒక క్లాసికల్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో ఒక్కరోజు సీఎం కాన్సెప్ట్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ గానే నిలిచింది. ఈ సింగిల్ లైన్ పాయింట్ అప్పట్లో దేశవ్యాప్తంగా ఓ ఊపు ఊపింది. కేవలం 24 గంటల్లో ఒక సీఎం ఏం చేయగలడు అనే అంశాన్ని శంకర్ చూపించిన విధానం అద్బుతం అని చెప్పాలి.
అయితే ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అధ్యక్షుడు, దళపతి విజయ్ అఖండ విజయం సాధించి సీఎం అయిన సంగతి తెలిసిందే. డీఎంకే, అన్నాడీఎంకే కంచుకోటల్ని బద్దలు కొట్టి విజయ్ సీఎం పీఠాన్ని అధిరోహించారు. తమిళనాడు మఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వాటిల్లో మద్యపాన నిషేధం, విద్యార్థులకు భారీ ప్రోత్సాహకాలు అందించడం చేస్తున్నారు. అయితే తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా.. విజయ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బ్లాస్ సినిమా ఈవెంట్ లో అర్జున్ ఈ వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ను సీఎం కుర్చీలో చూడగానే తనకు 'ఒకే ఒక్కడు' (ముదల్వన్) సినిమా గుర్తొచ్చింది అని అన్నారు. సీఎం చైర్ లో కూర్చోగానే ఫస్ట్ టైమ్ అర్జున్ 'ఒకే ఒక్కడు' సినిమాయే గుర్తొచ్చిందని స్వయంగా సీఎం విజయ్ చెప్పినట్టు అర్జున్ గుర్తు చేసుకున్నారు. పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే ఊహించని భారీ విజయం సాధించి సీఎం అయినందుకు విజయ్‌కు అభినందనలు తెలిపినట్లు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం అర్జున్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రీల్ లైఫ్ 'వన్ డే సీఎం' అర్జున్.. రియల్ లైఫ్ సీఎం విజయ్ అంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.

మరోవైపు తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే విజయ్ ప్రభుత్వానికి అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అన్నాడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి విజయ్ టీవీకే పార్టీలో చేరినట్లు స్పష్టం అవుతోంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలతో తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి.












Click it and Unblock the Notifications