దుమ్ము దులిపిన భారత్.. నౌషెరాలోని పాక్ ఆర్మీ శిబిరాల పేల్చివేత (వీడియో)
జమ్ముకశ్మీర్‌లోని నౌషెరా ప్రాంతంలో ఉన్న పాక్ ఆర్మీ శిబిరాలపై దాడులు జరిపి వాటిని పేల్చివేసినట్లు భారత సైన్యం తాజాగా ప్రకటించింది. ఈ దాడులకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు.
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని నౌషెరా ప్రాంతంలో ఉన్న పాక్ ఆర్మీ శిబిరాలపై దాడులు జరిపి వాటిని పేల్చివేసినట్లు భారత సైన్యం తాజాగా ప్రకటించింది. ఈనెల 20, 21 తేదీల్లో ఈ దాడులు నిర్వహించినట్టు ఆర్మీ మేజర్ జనరల్ అశోక్ నరులా వెల్లడించారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు.
నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదుల చొరబాటుకు పాక్ ఆర్మీ ప్రోత్సహిస్తోందని, పాకిస్తాన్ ఉగ్రమూకల్ని పెంచి పోషిస్తోందని, అమర్‌నాథ్ యాత్రికులపై దాడులు, దేశంలో అలజడి సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నట్టు ఆర్మీకి వచ్చిన సమాచారం ఆధారంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో దాడులు చేసినట్టు ఆర్మీ పేర్కొంది.
ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు పాక్ సైనికాధికారులు సహకరిస్తున్నారన్నారు. తమకు అందిన సమాచారం ఆధారంగా పూర్తిగా పరిశీలన జరిపాకే పాక్ ఆర్మీ స్థావరాలపై దాడులు జరిపినట్టు వివరించారు.
#WATCH Pakistani posts destroyed by Indian Army in Nowshera (Jammu and Kashmir) pic.twitter.com/whrWb0wMfg
— ANI (@ANI_news) May 23, 2017
పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేయడం వల్ల ఆ దేశానికి భారీ నష్టం జరిగినట్లేనని మేజర్ జనరల్ అశోక్ నారులా తెలిపారు. నియంత్రణ రేఖ వద్ద పాక్ రేంజర్ల దాడులను అడ్డుకునేందుకు భారత్ కూడా ప్రతిదాడులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
జమ్మూకశ్మీర్‌లో శాంతి, సామరస్యం కావాలన్నదే తమ కాంక్ష అని ఆయన పేర్కొన్నారు. నియంత్రణ రేఖ వద్ద భారత ఆర్మీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసిన భారత సైన్యానికి కాంగ్రెస్ పార్టీ సెల్యూట్ చేసింది.
అంతా అబద్ధమన్న పాక్...
అయితే భారత ఆర్మీ దాడిని పాకిస్తాన్ ఖండించింది. ఆ దేశ ఆర్మీ చీఫ్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ భారత్ చేస్తున్నవన్నీ నిరాధార ఆరోపణలేనని, నౌషెరా ప్రాంతంలో పాక్ ఆర్మీ శిబిరాలను ధ్వంసం చేసినట్లు పేర్కొనడం కూడా అబద్ధమేనన్నారు. గతంలో భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ చేయకుండానే చేసినట్లు చెప్పిందని, ఇది కూడా అలాంటిదేనంటూ ఆయన కొట్టిపారేశారు.












Click it and Unblock the Notifications