మరోసారి మన్నాడే పాట పాడిన ఢిల్లీ సిఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మన్నాడే పాట పాడారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ప్రసంగించారు. తన ప్రసంగం సందర్భంగా ఆయన శనివారంనాడు మన్నాడే పాటలోని కొన్ని లైన్లు పాడి వినిపించారు. అది 2013లో రామ్‌లీలా మైదానంలో పాడిన పాటే కావడం విశేషం.
ఇన్‌సాన్ సే ఇన్‌సాన్ కా హో బేచారా, యెహ్ హై పైగామ్ హమారా (ప్రజలు సహోదర భావంతో మెలగాలి, ఇది మా సందేశం) అనే పాటను పెద్దగా పాడారు. హర్ ఎక్ మహల్ సే కహో కే/ ఝోపిడియో మే దియే జలాయె/ ఛోటో ఔర్ బడో మే అబ్/ కోయి ఫరక్ నఙీ రహ్ జాయే (ప్రతి భవనం గుడిసెల్లో దీపాలు ముట్టించాలి, సంపన్నులకూ పేదలకు మధ్య తేడా ఉండదు) అంటూ ఆయన పాడారు.

ఈ విప్లవాత్మకమైన గేయాన్ని ప్రదీప్ రాయగా, మన్నాడే ఆలపించారు. పైఘామ్ సినిమాలో ఆ పాట ఉంది. 2013లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆ పాట పాడి కేజ్రీవాల్ సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు. అప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా అటువంటి పని చేయలేదు. శనివారంనాడు మరోసారి కేజ్రీవాల్ ఆ గేయాన్ని ఆలపించారు.
ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా సాధించడానికి ప్రయత్నిస్తానని ఆయన తన ప్రసంగంలో అన్నారు. ఢిల్లీ అభివృద్ధికి బిజెపి నేత కిరణ్ బేడీ కలిసి వస్తారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అవసరమైతే కాంగ్రెసు నేత అజయ్ మాకెన్ సలహాలు తీసుకుంటానని చెప్పారు. ఢిల్లీలో విఐపి సంప్రదాయానికి అంతం పలుకుతామని కెజ్రీవాల్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఢిల్లీ అభివృద్ధే తన లక్ష్యమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications