సాగునీటి ప్రాజెక్ట్ లలో ఇంత దారుణంగా మోసం చేయటం జగన్ కే చెల్లు!
ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు దుష్ప్రచారం సాగిస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మీడియాతో మాట్లాడిన ఆయన, మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిని అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా అభివర్ణించారు.
నిర్వాసితుల పరిహారం వైసీపీ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదు: మంత్రి నిమ్మల
వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి రూ.5 వేల కోట్ల విలువైన పనులు మిగిలి ఉండగా పూర్తి అయినట్టు చెప్పి జగన్ పాలనలో రైతులను మోసం చేశారని మంత్రి ఆరోపించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.900 కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉండగా వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను వేగవంతం చేసి నిర్వాసితులకు పరిహారం అందిస్తున్నామన్నారు.

తాము పని చేస్తుంటే జగన్ క్రెడిట్ చోరీ చేస్తున్నాడు
తాము పని చేస్తుంటే జగన్ క్రెడిట్ చోరీ చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో 5 ఏళ్లలో వెలిగొండ ప్రాజెక్టులో కేవలం రూ.792 కోట్ల విలువైన 20% పనులు మాత్రమే జరిగాయని, కూటమి ప్రభుత్వం 23 నెలల్లోనే రూ.759 కోట్ల పనులు పూర్తి చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. నల్లమల సాగర్ రిజర్వాయర్ నిర్వాసితుల పునరావాసం కోసం అదనపు బడ్జెట్‌లో రూ.903 కోట్లు కేటాయించామని తెలిపారు.
సొంత మీడియా ద్వారా సాగునీటి ప్రాజెక్ట్ లపై జగన్ దుష్ప్రచారం
ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక జగన్ తన సొంత మీడియా ద్వారా దుష్ప్రచారం సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులు రైతుల ఆదాయం పెంచడం, వ్యవసాయ రంగం అభివృద్ధి చేయడంలో కీలకమని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ఈ ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేయబడ్డాయని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని వేగంగా పూర్తి చేస్తుండగా విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.
రైతులు జగన్ చేయించే ప్రచారాలు నమ్మొద్దు
దోపిడీలు, కిరాతకాలకు ప్రసిద్ధి చెందిన జగన్ క్రెడిట్ చోరీ చేయడం సరికాదని తీవ్రంగా మండిపడ్డారు. ఈ దుష్ప్రచారం రైతుల మధ్య గందరగోళం సృష్టించే ప్రయత్నమని, ప్రజలు నిజాలు తెలుసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం సాగునీటి రంగంలో వేగవంతమైన అభివృద్ధి సాధిస్తుందని, రైతాంగ సంక్షేమానికి కట్టుబడి తాము పని చేస్తున్నామని చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు.












Click it and Unblock the Notifications