రాజకీయాలకు ఆప్ గుడ్ బై- ఆ కండిషన్ తో బీజేపీకి కేజ్రివాల్ సవాల్
ఢిల్లీలో మూడు కార్పోరేషన్లను విలీనం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రివాల్ బీజేపీకి ఓ సవాల్ విసిరారు. ఆ సవాల్ ను స్వీకరించి గెలిస్తే మాత్రం ఆప్ రాజకీయాల నుంచి తప్పుకుంటుందంటూ సంచలన వ్రకటన చేశారు. దీంతో కేజ్రివాల్ సవాల్ పై అన్ని పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది.
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎంసీడీ ఎన్నికలను బీజేపీ సకాలంలో నిర్వహించి గెలిస్తే ఆప్ రాజకీయాల నుంచి తప్పుకుంటుందని సీఎం అరవింద్ కేజ్రివాల్ సవాల్ విసిరారు. మునిసిపల్ ఎన్నికలను వాయిదా వేయడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికలను బీజేపీ సకాలంలో నిర్వహించి వాటిని గెలిస్తే ఆప్ రాజకీయాలను వదిలివేస్తుందని అన్నారు. ఢిల్లీలో ఉత్తర, తూర్పు, దక్షిణాది అనే మూడు స్ధానిక సంస్ధల్ని ఏకం చేసే బిల్లుకు నిన్న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో కేజ్రివాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

బిజెపి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని చెబుతుందని, కానీ అది చిన్న పార్టీ అని కేజ్రివాల్ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో చిన్న ఎన్నికలకు భయపడుతోందని విమర్శించారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన బీజేపీని డిమాండ్ చేశారు. ఎంసీడీకి సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేయడం అమర వీరులను అవమానించడమేనని కేజ్రివాల్ తెలిపారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ వాయిదా వేయడం బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమికొట్టి దేశంలో ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి త్యాగం చేసిన అమరవీరులను అవమానించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ వారు ఓటమి భయంతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేస్తున్నారు. రేపు రాష్ట్రాలు, దేశ ఎన్నికలను కూడా వాయిదా వేస్తారని కేజ్రివాల్ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications