అంత ఇల్లు వద్దు: కేజ్రీవాల్, 2 వారాల్లో పార్టీ అభ్యర్థులు
ఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసాన్ని శనివారం ఆయన తిరస్కరించారు. తనకు కేటాయించిన నూతన ఐదు పడక గదుల ఇంటిపై వివాదాలు చెలరేగడంతో, విపక్షాల ఆరోపణలకు తావివ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అరవింద్ కేజ్రివాల్ చెప్పారు. తనకు చిన్న ప్లాట్ ఇస్తే చాలని కేజ్రీవాల్ తెలిపారు.
తనకు ఇంటిని కేటాయించే వరకు గజియాబాద్‌లోని తన ఇంటి నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగిస్తానని అరవింద్ కేజ్రివాల్ చెప్పారు. తనకు తన స్నేహితులు, మద్దతుదారుల నుంచి శుక్రవారం పలు ఫోన్ కాల్స్ వచ్చాయని, అందులో వారు నూతనంగా కేటాయించిన ఐదు పడకల భవనంలోకి వెళ్లరాదని కోరినట్లు తెలిపారు. దీంతో తాను ఆ భవనానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు కేజ్రివాల్ చెప్పారు.

భగవాన్ దాస్ రోడ్‌లోని రెండు ఐదు పడకలు డుప్లెక్ష్ ఇంటిని కేజ్రివాల్ తన కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. ఈ భవనంలోకి వెళ్లేందుకు శుక్రవారం అంగీకారం తెలిపిన కేజ్రివాల్ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ సభ్యుల నుంచి వచ్చిన ఆరోపణలతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కాగా కేజ్రివాల్ శుక్రవారం మాట్లాడుతూ.. తాను ఇంతకుముందు తన నాలుగు పడకల ఇంటిలో నివాసం ఉండేవాడినని, ఇప్పుడు ఈ భవనంలో ఐదు పడకల గదిలో నివాసం ఉంటానని, తేడా ఏమి లేదని చెప్పారు.
రెండు వారాల్లో లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులు: ఆప్
ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు కూడా తమ అభ్యర్థులను బరిలో దించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించింది. రెండు వారాల్లో లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటిస్తామని ఈ సమావేశం తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు స్పష్టం చేశారు.
తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు ఆప్ సీనియర్ నాయకుడు తెలిపారు. తొలి జాబితాలో 10 నుంచి 15 మందితో కూడిన అభ్యర్థులను ప్రకటిస్తామని మరో నేత చెప్పారు. ఆప్ సీనియర్ నాయకుడు యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ కంటే ఉత్తమ నాయకుడ్ని ఎంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాము అధికారం కోసం ఎదురుచూడటం లేదని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications