అప్పుడు రాజకీయ సన్యాసం, రిజైన్: కేజ్రీవాల్ హెచ్చరిక
న్యూఢిల్లీ: అవినీతిరహిత భారత్ ఆవిర్భవించాక తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని, అప్పుడు తమ పార్టీ అవసరం కూడా ఉండదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సమన్వయకర్త, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులు ఎంత ఎక్కువ సంఖ్యలో గెలిస్తే అంతగా అవినీతిపరులు సభలో ప్రవేశించే అవకాశాలు తగ్గిపోతాయని ఆయన అన్నారు.
దేశంలో అవినీతికి చోటు లేకుండా చేసి మంచి విధాన నిర్ణయాలను అమలు చేయగలిగినప్పుడు రాజకీయాల్లో ఎఎపి అవసరమే ఉండదని, తాను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని చెప్పారు. జన్‌లోక్‌పాల్ బిల్లు అసెంబ్లీలో నెగ్గకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ హెచ్చరించారు. ఈ బిల్లుకు ఆమోదం కోసం ఎంత వరకైనా వెళ్తానని శనివారం ప్రకటించిన ఆయన దీనికి ఆమోదం లభించని పక్షంలో అధికారంలో ఉండే అర్హత లేదని ఆదివారం వ్యాఖ్యానించారు.

దేశంలో అవినీతిని పారద్రోలడానికి సిఎం కుర్చీని వెయ్యిసార్లయినా త్యాగం చేయొచ్చని అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఇక్కడికి రాలేదని, అసలు రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ఢిల్లీకి విద్యుత్ సరఫరాపై ఒప్పందం చేసుకున్న విద్యుత్ సంస్థలు నిజాయితీగా వ్యాపారం చేస్తే వాటితో కలిసి పని చేయడం తమకు సంతోషమేనని కానీ, బెదిరింపులకు పాల్పడితే మాత్రం కొన్ని కష్టాలకు ఓర్చుకుని అయినా సరే ఢిల్లీ ప్రజలు వాటిని ఎదుర్కొంటారని భావిస్తున్నానని అన్నారు.
ఆయా విద్యుత్ సంస్థల యజమానులైన అనిల్ అంబానీ, టాటాలతో వ్యక్తిగతమైన వైరం తనకు లేదన్నారు. ఇది ప్రజలందరి సమస్య అని చెప్పారు. కాగా, బాధ్యతల నుంచి తప్పుకోవడానికి కేజ్రీవాల్ ఇలా తెలివిగా మాట్లాడుతున్నారని, నిబంధనల ప్రకారం ప్రవేశపెడితే బిల్లుకు మద్దతిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.












Click it and Unblock the Notifications