రేపు కోర్టులో లిక్కర్ స్కాం గుట్టు విప్పబోతున్న కేజ్రివాల్- భార్య సునీత హింట్..!
సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణం గుట్టును బయటపెట్టేందుకు సీఎం అరవింద్ కేజ్రివాల్ సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ ఆయన్ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపడమే కాకుండా కస్టడీలోకి కూడా తీసుకుని విచారిస్తోంది. అయినా మొండిపట్టు వీడకుండా జైల్లో నుంచే ఢిల్లీ పరిపాలన సాగిస్తున్న కేజ్రివాల్.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రేపు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో జరిగే విచారణలో తన భర్త అరవింద్ కేజ్రివాల్ మద్యం స్కాంగా చెబుతున్న వ్యవహారం గుట్టు విప్పబోతున్నట్లు ఆయన భార్య సునీతా కేజ్రివాల్ ఇవాళ ప్రకటించారు. కేజ్రివాల్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన తరఫున అన్ని ప్రకటనలు చేస్తున్న సునీత.. ఇవాళ కీలక వివరాలు వెల్లడించారు. రేపు ఢిల్లీ కోర్టులో మద్యం స్కాం అని చెబుతున్న డబ్బు ఎటు పోయిందో తన భర్త వివరాలు బయటపెడతారని పేర్కొన్నారు. దీంతో రేపటి విచారణపై ఉత్కంఠ నెలకొంది.

ఢిల్లీ మద్యం విధానంలో లొసుగులతో భారీ ఎత్తున ముడుపులు తీసుకుని పంజాబ్, గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రివాల్.. రేపు కోర్టులో అసలు ఈ మద్యం విధానంలో భాగంగా ఏం జరిగిందనేది ఆధారాలతో సహా బయటపెట్టనున్నట్లు సునీత తెలిపారు. దీంతో కేజ్రివాల్ వద్ద ఆధారాలు ఏంటి, వాటిని ఇప్పటివరకూ ఈడీకి సమర్పించారా లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇప్పటికే కేజ్రివాల్ ను రెగ్యులర్ గా కలుస్తున్న ఆమె, మంత్రులు ఆయన వాయిస్ ను జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications