ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు పదవికి అరవింద్ సుబ్రమణియన్ రాజీనామా
న్యూఢిల్లీ: భారత ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు పదవికి అరవింద్ సుబ్రమణియన్ బుధవారం రాజీనామా చేశారు. ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ కారణాలతో తాను పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆయన తెలిపారు. సుబ్రమణియన్ రాజీనామా విషయాన్ని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు.
'కొద్ది రోజుల క్రితం అరవింద్ సుబ్రమణియన్ నాతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కుటుంబ అవసరాల కోసం తాను తిరిగి అమెరికా వెళ్లాలనుకుంటున్నానని చెప్పారు. అది ఆయన వ్యక్తిగతం కావొచ్చు, కానీ ఆయనకు చాలా ముఖ్యమైన విషయం. తన రాజీనామా విషయాన్ని అంగీకరించడం తప్ప నాకు మరో అవకాశం ఇవ్వలేదు' అని జైట్లీ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు.

అంతేగాక, భారత ఆర్థిక వ్యవస్థకు ఆయన అందించిన సేవలకు గాను జైట్లీ ధన్యవాదాలు తెలిపారు. స్థూల ఆర్థిక నిర్వహణలో అందించిన సేవలను కొనియాడారు. తాను వ్యక్తిగతంగా సుబ్రమణియన్.. డైనమిజం, శక్తి, మేధోసంపత్తి, ఆలోచనలను కోల్పోతున్నానని జైట్లీ పేర్కొన్నారు.
59ఏళ్ల సుబ్రమణియన్ 2014లో మూడేళ్ల పదవీ కాలానికి గాను ఆర్థికశాఖ ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆయన పదవీకాలం పొడిగించారు. 2018 అక్టోబరుతో ఆయన పదవీకాలం ముగుస్తుండగా ఆయన ముందుగానే రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications