ఆర్యన్ ఖాన్‌కు ఎదురుదెబ్బ: బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ముంబై కోర్టు, జైల్లోనే
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. క్రూజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇచ్చేందుకు ముంబై కోర్టు నిరాకరించింది. డ్రగ్స్ ఆరోపణలపై ఇటీవల అరెస్టైన ఆర్యన్ తోపాటు ఎనిమిది మందికి గురువారం కోర్టు 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే.
అయితే, ఆ వెంటనే ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టింది. వాదనలు విన్న తర్వాత ఆర్యన్ తోపాటు అర్బాజ్ మెర్చంట్, మూన్ మూన్ దమేచలకు బెయిల్ తిరస్కరించారు న్యాయమూర్తి. ఈ ముగ్గురూ బెయిల్ కోసం సెషన్స్ కోర్టుకు వెళ్లొచ్చని సూచించారు.

కాగా, ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వొద్దని ఎన్సీబీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ కోర్టును కోరారు. బెయిల్ పై విడుదల చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని చెప్పారు. సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కోర్టుకు తెలిపారు.
బెయిల్ పిటిషన్ పై వాదనల సందర్భంగా మూన్ మూన్ దమేచా న్యాయవాది మాట్లాడుతూ.. మూన్ మూన్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని, ఆమెను ముంబైకి ఆహ్వానించడం వల్లే చాలా ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చారని కోర్టుకు తెలిపారు. ఆమెకు వ్యతిరేకంగా ఎన్సీబీ వద్ద ఎలాంటి ఆధారాలూ లేవని పేర్కొన్నారు. ఇక అర్బాజ్ మెర్చంట్ న్యాయవాది బెయిల్ కోసం శనివారం సెషన్స్ కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలిసింది.
శుక్రవారం జరిగిన విచారణలో ఆర్యన్ తరుఫు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. దీంతో కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం.. వచ్చే 3 నుంచి 5 రోజుల పాటు ఆర్యన్‌ను ఆర్థర్ రోడ్ జైలులో క్వారంటైన్ సెల్‌లో ఉంచనున్నారు. ముంబై తీరంలో జరిగిన క్రూయిజ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటుండగా ఆర్యన్ సహా మొత్తం ఎనిమిది మందిని ఎన్సీబీ అరెస్టు చేసింది. అప్పటినుంచి ఎన్‌సీబీ ఆఫీస్‌లోనే విచారించింది. ముంబై కోర్టు తీర్పుతో ఆర్థర్ రోడ్ జైలుకి అతన్ని తరలించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications