మహిళా ఉద్యోగులకు పంద్రాగస్టు కానుక..!
పంద్రాగస్టున ఒడిశా సర్కారు మహిళా ఉద్యోగులకు పండుగ లాంటి వార్తను అందించింది. ఈ రోజు నుంచి రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు నెలలో ఒకరోజు పీరియడ్స్ సెలవును ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని మహిళా ఉద్యోగులందరీకి ఇది వర్తిస్తుంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా ఈ ప్రకటన చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కటక్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇప్పటి వరకు మహిళలకు నెలసరి సమయంలో ఎలాంటి సెలవులు ఇవ్వడం లేదని ఈ సందర్భంగా అన్నారు. ఇక, ఇప్పటినుంచి నెలలో ఒకరోజు ప్రతి ఒక్క మహిళా ఉద్యోగికి సెలవు ప్రకటిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యం, శ్రేయస్సే లక్ష్యంగా పీరియడ్స్ సెలవుల్ని తక్షణమే అమల్లోకి తీసుకువస్తున్నట్లు డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా తెలిపారు.

దీనికి సంబంధించి ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు. ఇప్పటి నుంచి మహిళలు నెలసరి సమయంలో మొదటి రోజు లేదా రెండవ రోజు సెలవు తీసుకోవచ్చని ఒడిశా సర్కారు పేర్కొంది. అయితే, ఈ సెలవు మహిళ ఉద్యోగుల ఇష్టానుసారంగానే ఉంటాయన్నారు. వాళ్లకు సెలవు ఇష్టమయితే తీసుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. మహిళ సెలవు కావాలని కోరితే మాత్రమే సెలవు పొందగలరని అన్నారు. ఇది ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో పాటు ప్రైవేటు సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులకు కూడా వర్తిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications