ఊసే లేని రుణ మాఫీ హామీ: శివరాజ్ ‘శాంతిదీక్ష’ విరమణ

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

భోపాల్: వారానికి పైగా రాష్ట్రమంతా పంట రుణాల మాఫీ, గిట్టుబాటు ధరల కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రం అట్టుడుకుతున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యం.. మితిమీరిన ఆత్మ విశ్వాసం కారణంగా జరిగిన పోలీసు కాల్పుల్లో ఐదుగురు అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు.

దరిమిలా మధ్యప్రదేశ్ రాష్ట్రమంతా అగ్నిగుండంగా మారింది. ఈ దశలో రాష్ట్రంలో 'శాంతి' నెలకొనే వరకు దీక్ష కొనసాగిస్తానని, భోపాల్‌లోని దసరా మైదానాన్నే సచివాలయంగా మార్చేస్తానన్నసీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ 24 గంటలు కూడా మరువక ముందే తన శాంతి దీక్ష విరమించారు. రెండు రోజులుగా రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోనందున నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు.

కానీ పంట రుణాల మాఫీ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను తానూ అధ్యయనం చేశామన్న శివరాజ్‌సింగ్ చౌహాన్.. ఆందోళనకు పాల్పడిన రైతులకు ఉపశమనం కలిగించే చర్యలేవీ ప్రకటించలేదు. చివరకు పోలీసుల కాల్పుల్లో మరణించిన రైతుల కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు పూనుకుంటామన్న హామీ కూడా సీఎం చౌహాన్ నుంచి రాలేదు.

రుణ మాఫీ, గిట్టుబాటు ధరలు కావాలన్న రైతులు

రుణ మాఫీ, గిట్టుబాటు ధరలు కావాలన్న రైతులు

కాకపోతే ఐదుగురు రైతుల మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ భీషణ ప్రతిజ్న చేశారు. సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో రాష్ట్ర మాజీ సీఎం కైలాశ్ జోషి కొబ్బరినీరు తాగించి దీక్ష విరమింపజేశారు. శనివారం సీఎం చౌహాన్‌ను కలుసుకున్న 15 మంది చిన్న రైతుల, 236 మంది పెద్ద రైతుల ప్రతినిధి బృందాలు పంట రుణాలు మాఫీ చేయడంతోపాటు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు.

స్వామినాథన్ సిఫారసులు అమలు చేస్తామన్న సీఎం

స్వామినాథన్ సిఫారసులు అమలు చేస్తామన్న సీఎం

కాల్పుల్లో మరణించిన నలుగురు రైతులకుటుంబ సభ్యులు సీఎంను కలుసుకుని దీక్ష విరమించాలని కోరినట్టు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నందకుమార్ చెప్పారు. దీక్ష విరమించిన అనంతరం సీఎం చౌహాన్ మాట్లాడుతూ తాను స్వామినాథన్ కమిటీ నివేదిక చదివానని, దాని సిఫారసుల ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నానని చెప్పారు. మున్సిపాలిటీల్లో రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని, కనీస మద్దతు ధరకన్నా తక్కువకు పంట ఉత్పత్తులను కొంటే నేరంగా పరిగణిస్తామని చెప్పారు. రైతు అంగీకారంతోనే వారి వ్యవసాయ భూములు సేకరిస్తామని, ప్రతి ఏడాది భూమి పత్రాలు ఇంటికే పంపుతామని తెలిపారు. పంటల కొనుగోలుకు రూ.1000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా ‘అమూల్' పద్దతుల్లో భూ వినియోగ సలహా కమిటీ ఏర్పాటు చేస్తానని, పాల సేకరణకు శాస్త్రీయ పద్దతి అమలు చేస్తామని చెప్పారు.

ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ఇలా సీఎం నిష్ఠూరాలు

ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ఇలా సీఎం నిష్ఠూరాలు

రైతులతో సంప్రదించకుండా, వారి ఆమోదం లేకుండా పంట భూములను తమ ప్రభుత్వం స్వాదీనం చేసుకోబోమని తెలిపారు. తాను రైతుల సేవకుడినని ప్రకటించిన శివ్ రాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభంలో రైతుల ఆందోళనను ఎందుకు పట్టించుకోకపోవడానికి కారణాలేమిటో ఎందుకు వివరించలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గమ్మత్తేమిటంటే రైతుల అత్యంత ప్రముఖమైన డిమాండ్ ‘పంట రుణాల మాఫీ' పథకాన్ని చౌహాన్ ఎందుకు విస్మరిస్తున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ నేతల పేరెత్తకుండానే విపక్షంపై విమర్శలు గుప్పించారు. విధ్వంసానికి, హింసాత్మక చర్యలకు పాల్పడింది రైతులు కాదని, చట్ట వ్యతిరేక, సంఘ విద్రోహ శక్తుల పనని పేర్కొన్నారు. అటువంటి వారిని క్షమించబోమని భీషణ ప్రతిజ్న చేశారు.

ఆందోళన నుంచి వైదొలిగిన బీకేఎస్

ఆందోళన నుంచి వైదొలిగిన బీకేఎస్

మాల్వా రీజియన్ ప్రాంతంలో ఆందోళనకు సారథ్యం వహిస్తున్న రావ్ ఎమ్మెల్యే జితు పట్వారీ మాత్రం యువ రైతుల కార్యక్రమాలకు మద్దతు ఇవ్వబోమని సెలవిచ్చారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయత్నిస్తూ ఉంటే రాష్ట్ర హోంమంత్రి భూపేంద్ర సింగ్ భిన్నంగా మాట్లాడుతూ రైతులపై కాల్పులు జరిపినట్లు వచ్చిన వార్తలను ఖండించారు. వ్యవసాయ శాఖమంత్రి మాట్లాడుతూ పంట రుణాలను మాఫీ చేయడం సాధ్యం కాదని తేల్చేశారు. బీకేఎస్ కూడా రైతుల ఆందోళన నుంచి వైదొలుతున్నట్లు ప్రకటించడం ద్వారా రైతు సంఘాల మధ్య విభేదాలను బయట పెట్టింది.

14 నుంచి కాంగ్రెస్ ‘సత్యాగ్రహ' దీక్ష

14 నుంచి కాంగ్రెస్ ‘సత్యాగ్రహ' దీక్ష

రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శాంతి దీక్ష అంతా నాటకం అని కాంగ్రెస్ పార్టీ కొట్టి పారేసింది. త్వరలో కిసాన్ పాదయాత్ర ప్రారంభిస్తామని ఎమ్మెల్యే పట్వారి తెలిపారు. ఈ నెల 14 నుంచి రైతుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 72 గంటల ‘సత్యగ్రహ' నిర్వహించాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Madhya Pradesh chief minister Shivraj Singh Chouhan on Sunday ended his indefinite fast announcing slew of measures to benefit farmers but did not mention farm loan waiver, a prominent farmers’ demand on which the peasants agitated for ten days on the streets of the central Indian state.
Please Wait while comments are loading...