ఏపీకి యూపీ ఇచ్చిన సందేశం: ముఖ్యమంత్రి ఒక్కరే సమర్థుడైతే సరిపోదు: ఆ మంత్రులకు తప్పని ఓటమి
లక్నో: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించింది. పంజాబ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఘన విజయాన్ని అందుకుంది. తన నాలుగు రాష్ట్రాలను తాను నిలబెట్టుకోగలిగింది. ఈ నాలుగు చోట్ల కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా.. కాషాయమయం అయ్యాయి. ఈ నాలుగింటితో పాటు పంజాబ్‌లో కాంగ్రెస్ మటుమాయమైంది.
Recommended Video

కలిసొచ్చిన ఛరిష్మా..
ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ తన మిత్రపక్షాలతో కలుపుకొని 273 స్థానాలను గెలుచుకుంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. ఒంటి చేత్తో పార్టీని విజయతీరాలకు చేర్చారాయన. అవినీతి రహిత పరిపాలనను అందించడం, శాంతిభద్రతలను కాపాడటం, మహిళలకు రక్షణ కల్పించడం, విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలకు తోడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఛరిష్మా.. బీజేపీకి విజయానికి కారణాలయ్యాయంటూ విశ్లేషణలు వెలువడుతున్నాయి.

మంత్రులు ఓటమి..
ఇంత ఘన విజయంలోనూ యోగి ఆదిత్యనాథ్- మంత్రివర్గ సహచరులు పరాజయం బాట పట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉప ముఖ్యమంత్రి సహా ఏకంగా తొమ్మిది మంత్రులు తమ ప్రత్యర్థుల చేతుల్లో ఘోరంగా ఓడిపోయారు. ముఖ్యమంత్రి ఒక్కరే సమర్థవంతంగా పరిపాలన సాగిస్తే సరిపోదని, ఆయనతో పాటు మంత్రివర్గ సహచరులు కూడా అంతే శక్తివంచన లేకుండా బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందనే సందేశాన్ని ఇచ్చిందీ ప్రజాతీర్పు.

కేశవ్ ప్రసాద్ మౌర్య మొదలుకుని..
ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఘోరంగా ఓడిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సిరాథు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. అప్నాదళ్ (కమేరావాది) అభ్యర్థిని పల్లవీ పటేల్ చేతిలో ఆయన ఓడిపోయారు. అప్నాదళ్ (కే).. సమాజ్‌వాది పార్టీకి మిత్రపక్షం. సమాజ్‌వాది పార్టీ ఎన్నికల గుర్తు మీదే ఆమె పోటీ చేశారు. కేశవ్ ప్రసాద్ మౌర్యను 7,337 ఓట్ల తేడాతో మట్టికరిపించారు. ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో జెయింట్ కిల్లర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

మంత్రులపై ఎస్పీ అభ్యర్థులు..
కేశవ్ ప్రసాద్ మౌర్య మాత్రమే కాకుండా.. మరో తొమ్మిదిమంది మంత్రులు ఓటమిబాట పట్టారు. ఠాణా భవన్ స్థానంలో చక్కెర పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ రాణా ఓడిపోయారు. రాష్ట్రీయ లోక్‌దళ్ అభ్యర్థి అష్రాఫ్ అలీఖాన్ 10 వేల ఓట్లకు పైగా తేడాతో ఆయనపై విజయం సాధించారు. బహేరీ స్థానం నుంచి పోటీ చేసిన ఛత్రపాల్ సింగ్ గంగ్వార్.. సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి అతావుర్ రెహ్మాన్ చేతిలో 3,355 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి..
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్ ఓటమిపాలయ్యారు. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని పత్తీ స్థానంలో పోటీ చేసిన ఆయనపై ఎస్పీ అభ్యర్థి రామ్‌సింగ్ ఏకంగా 22,051 ఓట్ల తేడాతో గెలుపొందారు. చిత్రకూట్‌లో మంత్రి చంద్రికా ప్రసాద్ ఉపాధ్యాయ.. ఎస్పీ అభ్యర్థి అనిల్ కుమార్ చేతిలో 20,876 ఓట్ల తేడాతో మట్టి కరిచారు. బల్లియా జిల్లాలోని బరియా నియోజకవర్గంలో మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా 12,951 ఓట్ల తేడాతో ఎస్పీ అభ్యర్థి జైప్రకాశ్ ఆంచల్ చేతిలో పరాజయాన్ని చవి చూశారు.

విద్యాశాఖ మంత్రి..
క్రీడాశాఖ మంత్రి ఉపేంద్ర తివారీని.. ఫేఫ్నా స్థానంలో ఎస్పీ అభ్యర్థి సంగ్రామ్ సింగ్ 19,354 ఓట్ల తేడాతో చిత్తు చేశారు. హుస్సేన్ గంజ్ స్థానంలో ఎస్పీ అభ్యర్థి ఉషా మౌర్య చేతిలో మంత్రి రణ్‌వీర్ సింగ్ ధున్ని ఓటమి చవి చూశారు. దిబియాపూర్‌లో మంత్రి లఖన్ సింగ్ రాజ్‌పుత్, ఇటావాలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సతీష్ చంద్ర ద్వివేది- తమ ప్రత్యర్థి పార్టీ ఎస్పీ అభ్యర్థుల చేతుల్లో పరాజయం పాలయ్యారు.












Click it and Unblock the Notifications