మోడీ ఇంటర్యూ: 'సుష్మాతో పాటు యూపీఏ మంత్రులు'
న్యూఢిల్లీ: వీసా డాక్యుమెంట్ల వ్యవహారంలో తనకు సిఫారసు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మద్దతుగా నిలిచారు. అంతేకాదు తనకు సాయం చేసింది సుష్మా మాత్రమే కాదని, యూపీఏలో మరో ముగ్గురు మంత్రులు, రాజస్ధాన్ సీఎం వసుంధరా రాజే కూడా తనకు సహకరించిన వారిలో ఉన్నారని అన్నారు.
ప్రస్తుతం మాంటెనీగ్రోలో సెలవులు గడుపుతున్న లలిత్ మోడీ ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో పూర్తి విషయాలను వెల్లడించారు. డిసెంబర్ 2013లో వసుంధరా రాజే, తన భార్యను పోర్చుగల్‌లో క్యాన్సర్ నిమిత్తం స్వయంగా తీసుకెళ్లారని తెలిపారు.
ఈ విషయం ఎవరికి తెలియదని, తానిప్పుడు బహిర్గతం చేస్తున్నానని అన్నారు. భారత్‌లో తనకు చాలా మంది రాజకీయ నాయకులతో పరిచయాలున్నాయని చెప్పిన లలిత్ మోడీ, యూపీఏ మంత్రులు శరద్ పవార్, ప్రపుల్ పటేల్, రాజీవ్ శుక్లాలు కూడా సహాయం చేశారని వ్యాఖ్యానించారు.

ఇక సుష్మా భర్త స్వరాజ్ కుషాల్ గత 20 ఏళ్లుగా అడ్వకేట్‌గా తెలుసునని, ఇకపోతే అతని కుమార్తె బాన్సూరీ గత నాలుగేళ్లుగా నా లాయర్‌గా ఉన్నట్లు మోడీ తెలిపారు. ఈ డాక్యుమెంట్ల వ్యవహారంపై రాజస్ధాన్ సీఎం వసుంధరా రాజే స్పందించారు. లలిత్ మోడీ కుటుంబంతో చాలా రోజులుగా పరిచయం ఉందని, ఏ డాక్యుమెంట్ల గురించి వారు మాట్లాడుతున్నారో తనకు మాత్రం తెలియదని మంగళవారం చెప్పారు.
ఇక లలిత్ మోడీ వ్యాఖ్యలపై రాజీవ్ శుక్లా స్పందిస్తూ మూడేళ్లుగా మోడీతో తాను మాట్లాడలేదని తెలుపగా, భారత్‌కు వచ్చి విచారణను ఎదుర్కొవాలని మాత్రమే లలిత్ మోడీకి సలహా ఇచ్చినట్లు శరద్ పవార్ తెలిపారు. తాజా లలిత్ మోడీ ఇంటర్యూతో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని గత ప్రభుత్వ మంత్రులపై బీజేపీ నేతలు ఎదురుదాడి మొదలు పెట్టారు.












Click it and Unblock the Notifications