రాజస్తాన్ వర్సెస్ హర్యానా-భజరంగ్ దళ్ సభ్యుడి అరెస్టుపై సీఎంల వార్...
హర్యానాలోని నూహ్ లో తాజాగా చోటు చేసుకున్న మతఘర్షణల వ్యవహారం రాజస్తాన్ లోనూ చిచ్చు రేపుతోంది. ఈ మతఘర్షణలకు కారకుడిగా భావిస్తున్న గోసంరక్షణ కార్యకర్త మోనూ మనేసర్ ను పట్టుకునే విషయంలో హర్యానా, రాజస్తాన్ ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొంది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ కు చెందిన నాసిర్, జునైద్ అనే ఇద్దరు వ్యక్తులను హత్య చేసిన బజరంగ్ దళ్ సభ్యుడు, గోసంరక్షకుడు మోను మనేసర్‌పై చర్యలు తీసుకునేందుకు రాజస్థాన్ పోలీసులకు స్వేచ్ఛ ఉందంటూ రెండు రోజుల క్రితం హర్యానా సీఎం ఖట్టర్ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా గెహ్లాట్ ఇవాళ స్పందించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో భివానీలో ఇద్దరు ముస్లిం యువకులను హత్య చేసిన కేసులో నిందితులను అరెస్టు చేయడంలో హర్యానా పోలీసులే సహకరించడం లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇవాళ ఆరోపించారు. హర్యానా పోలీసులు సహకరించకుండా రాజస్థాన్ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని గెహ్లాట్ మండిపడ్డారు. మనేసర్ ను పట్టుకునే విషయంలో రాజస్తాన్ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలకు హర్యానా నుంచి తగిన సహకారం లభించకపోవడంపై ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు.

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని ఘట్మీకా గ్రామానికి చెందిన నాసిర్, జునైద్‌లను గోసంరక్షకులు అపహరించి కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిబ్రవరి 16న హర్యానాలోని భివానీలోని లోహారు అటవీ ప్రాంతంలో కాలిపోయిన కారులో వారి మృతదేహాలు కనిపించాయి. దీంతో వివాదం చెలగింది. దీనికి కారణమైన గోసంరక్షుడు మనేసర్ హర్యానాలోని నూహ్ లో చెలరేగిన అల్లర్లలో కనిపించడం వివాదాన్ని మరింత పెంచింది. ఆ తర్వాత ఆయన తమ రాష్ట్రంలో లేడని ప్రకటించిన సీఎం ఖత్తర్.. రాజస్తాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని సూచించారు.
దీనిపై స్పందించిన సీఎం అశోక్ గెహ్లాట్.. రాజస్థాన్ పోలీసులకు అన్ని విధాలుగా సహాయం చేస్తానని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మీడియాలో ప్రకటన ఇచ్చారని, కానీ మన పోలీసులు నాసిర్-జునైద్ హత్య కేసు నిందితులను అరెస్టు చేయడానికి వెళ్ళినప్పుడు, హర్యానా పోలీసులు సహకరించలేదని గుర్తుచేశారు. రాజస్థాన్ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. నిందితుడి ఆచూకీ కోసం హర్యానా పోలీసులు రాజస్థాన్ పోలీసులకు సహకరించడం లేదన్నారు. హర్యానాలో హింసను అరికట్టడంలో ఖట్టర్ విఫలమయ్యారని, ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి ప్రకటనలు చేయడం సరికాదని అన్నారు.












Click it and Unblock the Notifications