రాహుల్ గాంధీకి అసోం కోర్టు సమన్లు జారీ
గౌహతి: ఆర్ఎస్ఎస్ వేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అసోంలోని కామరూప్ మెట్రోపాలిటన్ కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. కేసు విచారణ నిమిత్తం సెప్టెంబర్ 29న కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
2015 డిసెంబర్ లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఆర్ఎస్ఎస్ కోర్టుకు వెళ్లింది. తమ పరువుకు భంగం కలిగించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారని ఆర్ఎస్ఎస్ కార్యకర్త అంజాన్ బోరా కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

గతంలో (2015 మార్చి) మహారాష్ట్రలోని సోనాలే లో జరిగిన బహిరంగ సభలో మహాత్మగాంధీని ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య చేశారని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ కుంత్ కోర్టుకు వెళ్లారు.
ఈ కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ఆర్ఎస్ఎస్ కు క్షమాపణ చెప్పాలని, లేదంటే కేసు విచారణ ఎదుర్కోవాలని సుప్రీం కోర్టు సూచించింది. సుప్రీం కోర్టులో రాహుల్ గాంధీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు మళ్లీ ఆయనకు అసోం కోర్టు నుంచి సమన్లు వెళ్లాయి.












Click it and Unblock the Notifications