ఆప్ పుట్టి ముంచిన సొంత పొరపాట్లు
భవిష్యత్‌లో జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని కలలు కన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆకాంక్షలు నెరవేరే అవకాశాలే కనిపించడం లేదు.
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని కలలు కన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆకాంక్షలు నెరవేరే అవకాశాలే కనిపించడం లేదు. 2015 ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని మట్టి కరిపించి సంచలన విజయాలు సాధించిన కేజ్రీవాల్ తన పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని ప్రణాళికలు రచించారు.
కానీ తాజాగా ఐదు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బీఎస్పీలతో పోలిస్తే భారీగా నష్టపోయింది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) మాత్రమే. పంజాబ్‌లో ఆప్ వడిని అధికారం చేరినట్లే అనిపించినా ఫలితాలు మాత్రం రెండోస్థానానికి నెట్టేశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్ పార్టీ మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొన్నదన్న వార్తలు వచ్చాయి.

ఇక గోవాలో సీఎం అభ్యర్థిగా ప్రకటించిన మాజీ ఐపీఎస్ అధికారి ఎల్విన్ గోమ్స్ కూడా ఎన్నిక కాలేకపోవడం ఆ పార్టీకి ప్రజల్లో ఉన్న పలుకుబడికి నిదర్శనంగా నిలుస్తోంది. సోషల్ మీడియా, స్థానిక యువత మద్దతుతో ప్రచారం చేసినా విజయాన్ని ఒడిసి పట్టలేకపోవడానికి గల ప్రధాన కారణాల్లో అంతర్గతంగా పార్టీలో నెలకొన్న అసమ్మతికి తోడు పంజాబ్ ఆప్ శాఖలో ప్రముఖ నాయకుడిగా ఉన్న సుచాసింగ్ చౌటెపూర్ పార్టీని వీడటమే. ఆయన వైదొలిగిన తర్వాత పార్టీలోని చిన్నా చితకా నాయకులంతా అదే బాటలో పయనించినా ఆప్ నాయకత్వం పట్టించుకోలేదు.
భ్రమల్లో ఆప్ నాయకత్వం
బయటకు వెళ్లేవారి కంటే పార్టీలోకి వచ్చే వారే ఎక్కువని ఆప్ నాయకత్వం భ్రమల్లో చిక్కుకున్నది. దీనికి తోడు రెబెల్స్ బెడద కూడా ప్రతికూల ఫలితాలకు కారణమని భావిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా పార్టీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం కూడా ఆప్ వైఫల్యానికి మరో కారణం. స్థానిక నాయకుడు సుఖ్‌పాల్‌సింగ్ ఖైరాకు ప్రచారం చేసే వెసులుబాటు కల్పించలేదు. కొత్తగా పార్టీ ఎదగడానికి రాష్ట్రమంతా నాయకులు అవసరమన్న సంగతిని ఆప్ విస్మరించింది. పార్లమెంట్ సభ్యుడు భగవత్ మాన్‌ను మాత్రమే రాష్ట్రమంతా పర్యటించేందుకు అనుమతించడంతో ఆప్ గెలిస్తే.. బయటి వ్యక్తుల ఆధిపత్యం పెరిగిపోతుందన్న భావోద్వేగాలు పంజాబీల్లో పెరిగిపోయాయి.
ఖలిస్థాన్ వాదులతో చెలిమితో దూరమైన హిందువులు
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలంతా ఖలిస్థాన్ వాదులు, ఇతర అతివాదులతో అంటకాగడం హిందూ ఓటర్లకు నచ్చలేదు. ఖలిస్థానీ ఉగ్రవాదం ముందుకొచ్చినప్పటి నుంచి హిందువులంతా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా నిలిచారు. ప్రారంభంలో ఆప్‌కు సిక్కులు, హిందువులు మద్దతునిచ్చినా అతివాదులతో ఆ పార్టీ నేతల బుజ్జగింపు చర్యలతో హిందువుల్లో కీలక వర్గాలు దూరం అయ్యారు.
పంజాబ్ రాష్ట్ర రాజకీయాలు మాల్వా, డోబా, మాజ్హా ప్రాంతాలపై ఆధారపడి ఉంటాయి. తొలి నుంచి చివరి వరకు మాల్వా ప్రాంతంపై దృష్టిని కేంద్రీకరించిన ఆప్.. మిగతా ప్రాంతాలను పట్టించుకోలేదు. డోబా, మాజ్హా ప్రాంతాలు తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు. కాంగ్రెస్ సంప్రదాయ ఓటింగ్‌ను చీల్చేందుకు ఆప్ ఏ మాత్రమూ ప్రయత్నించకపోవడం ఆ పార్టీని దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఆప్ గట్టిపోటిని ఇచ్చింది: ప్రశాంత్ కిశోర్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తమకు గట్టిపోటీ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. క్షేత్రస్థాయిలో ఆప్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అమరిందర్ సింగ్‌ను అభినందించారు. ఈ అద్భుత విజయం పంజాబ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల వల్ల సాధ్యమైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పదేళ్ల తర్వాత పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి తిరిగి అధికారం కట్టబెట్టడంలో కీలకభూమిక పోషించారు.












Click it and Unblock the Notifications