ఎన్నికల సంఘం కీలక ప్రకటన: ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం, ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే?
న్యూఢిల్లీ: కొద్ది రోజుల్లో దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు (assembly elections) జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. నవంబర్ 7 నుంచి మొదలుకొని నవంబర్ 30 వరకు పలు దఫాల్లో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ (exit polls)పై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
నవంబర్ 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం 6.30 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచారం చేయడం, ఫలితాలు ప్రచురించడం వంటివి చేయరాదని ఎన్నికల సంఘం పేర్కొంది.

ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
కాగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో వరుసగా నవంబర్ 7, నవంబర్ 17, నవంబర్ 25, నవంబర్ 30 తేదీల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో కొనసాగుతోంది. ఈ నాలుగు రాష్ట్రాలతోపాటు మిజోరంలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఈ రాష్ట్రాల్లో ప్రచారాన్ని ఇప్పటికే ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications