ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్, రాజస్తాన్ లో బీజేపీ లీడ్-మధ్యప్రదేశ్ లో హోరాహోరీ..
ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాలకు ఇవాళ కౌంటింగ్ మొదలైంది. మిజోరం మినహా మిగిలిన రాష్ట్రాల్లో జరుగుతున్న కౌంటింగ్ లో ఎగ్జిట్ పోల్ ఫలితాలకు దగ్గరగానే ఫలితాల సరళి కనిపిస్తోంది. ఆరంభ కౌంటింగ్ సరళి గమనిస్తే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. రాజస్తాన్ లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ కు అదే స్ధాయిలో ఆధిక్యం కనిపిస్తోంది. తెలంగాణలోనూ కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది.

తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ లో గెలవబోతోందని తేలింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ లో బీజేపీ గెలుపు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇవాళ మొదలైన కౌంటింగ్ లోనూ దాదాపు ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఛత్తీస్ ఘడ్ లో వెలువడుతున్న ఆరంభ కౌంటింగ్ సరళిని గమనిస్తే కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ మార్క్ టచ్ చేసింది. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, టీఎస్ సింగ్ దేవ్ తో పాటు పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు, మంత్రులు ముందంజలో ఉన్నారు.
రాజస్తాన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన దగ్గరి నుంచీ బీజేపీ లీడ్ కొనసాగుతోంది. 199 సీట్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లకు పైగా సాధించే అవకాశాలు ఉన్నట్లు ఆరంభ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలను మార్చే సంప్రదాయం ఉన్న రాజస్తాన్ లో ఈసారి అధికార కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తప్పేలా లేదు. అయితే సీఎం అశోక్ గెహ్లాట్ తో పాటు పలువురు కాంగ్రెస్ అభ్యర్ధులు లీడ్ లో కొనసాగుతున్నారు. బీజేపీలోనూ హేమాహేమీలంతా లీడ్ లోనే ఉన్నారు.
మధ్యప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇందులోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దగ్గరగా బీజేపీ లీడ్ కొనసాగిస్తోంది. అయితే ఈ లీడ్ స్వల్పంగా ఉండటంతో కౌంటింగ్ ముందుకు సాగే కొద్దీ ఫలితాల్లో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. 230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో తాజా కౌంటింగ్ సరళి ప్రకారం కాంగ్రెస్, బీజేపీ ఇరు పార్టీలు కూడా 100కు పైగా సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.












Click it and Unblock the Notifications