తపన ఉండాలేకానీ: తండ్రి, భర్త చదువు వద్దన్నారని.. 67 ఏళ్ల వయసులో...
చెన్నై: 67 సంవత్సరాల వయసులో చాలామంది మహిళలు కృష్ణా, రామా అనుకుంటూ వీలైతే రామకోటి రాసుకుంటూ కూర్చుంటారు. కానీ చెన్నైకి చెందిన చెల్లాథాయీ మాత్రం మాస్టర్స్ డిగ్రీ అందుకుంది.
ఈ వయసులో చదువా.. అనే డౌట్ మీకొచ్చిందా? వస్తుంది కానీ.. చెల్లాథాయీ ఈ వయసులో ఏంఏ చేయడానికి వెనుక పెద్ద స్టోరీయే ఉంది. పాపం.. ఆమెకు చిన్నప్పట్నించీ చదువుకోవాలనే తపన విపరీతంగా ఉండేది.

డిగ్రీ పూర్తి చేసేందుకు ఐదు దశాబ్ధాల క్రితం ఆమె దరఖాస్తు తీసుకురాగా.. అవసరం లేదంటూ ఆమె తండ్రి ఆ దరఖాస్తును చింపిపారేశాడు. అలాగే కుటుంబ సభ్యులెవరికీ ఆమె చదువుకోవడం ఇష్టంలేదు.
తరువాత కొన్నాళ్లకు ఆమెకు వివాహమైంది. తనకు చదువంటే ఇష్టమని, చదువుకుంటానని ఆమె భర్తతో చెప్పింది. దీనికి ఆయన కూడా వ్యతిరేకత వ్యక్తం చేశాడు. తండ్రి చనిపోయాక చెల్లాథాయీ భర్త.. క్లర్క్‌గా ఉద్యోగం చేసేందుకు మాత్రం ఆమెకు అనుమతినిచ్చాడు.
అలా ఆ ఉద్యోగం చేస్తూ 2013లో ఆమె ఉద్యోగ విరమణ చేసింది. అప్పటి వరకూ చదవుకోవాలన్న ఆమె కోరిక నెరవేరనే లేదు. అయితే అదే సంవత్సరం ఆమె భర్త చనిపోయాడు. ఇక ఆమె చదువుకు అడ్డు చెప్పేవారెవరూ లేకపోవడంతో ఆమె ఎంఏ పూర్తిచేసి చెల్లథాయీ తన కోరికను తీర్చుకుంది.
చదువుకోవాలనే తపన ఉండాలేకానీ దానికి ఏవీ ఆటకం కాదని, ఏ వయసులో అయినా చదువుకోవచ్చని చెబుతుంటారు. దీనిని నిజం చేసింది చెన్నైకి చెందిన చెల్లాథాయీ. చదువుకోవాలనే కోరిక ఉన్న వారికి ఈమే ఆదర్శం.. కాదంటారా?












Click it and Unblock the Notifications