ధర్నా: మోడీపై ప్రభుత్వంపై మోడీ సోదరుడు తీవ్ర విమర్శలు, అంచనాల్లో విఫలం
న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్రమోడీ చిన్ని సోదరుడు ప్రహ్లాద్ మోడీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని ప్రజల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.
ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వంలో చిత్తశుద్ధి కరువైందని అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన "ఆల్ ఇండియా ఫెయిర్ ఫ్రైస్ షాప్ ఫెడరేషన్" కార్యక్రమంలో మంగళవారం పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధించాలని మీరు (ప్రజలు) కష్టపడ్డారు. కానీ ఇప్పటికీ జంతర్ మంతర్ వద్దకు వచ్చి ధర్నా చేస్తున్నారు. అంటే ఇదంతా ఎన్‌డీఏ ప్రభుత్వ వైఫల్యమని నేను అనుకుంటున్నా" అని మోడీ సోదరుడు పేర్కొన్నారు.

ప్రధాని మోడీ గురించి ప్రస్తావిస్తూ "నేను చేస్తున్న వ్యతిరేకత ఒక సోదరుడిపై మరో సోదరుడు చేస్తుంది కాదు. నా సోదరుడు చాలా విలువైన వ్యక్తి. తనని గౌరవిస్తా. కానీ నేనో వృత్తిలో ఉన్నాను కాబట్టి, ఈ ప్లాట్ ఫామ్‌కు వచ్చి నా సోదరుడి ముందు నా గొంతు విప్పుతున్నా" అని ప్రహ్లాద్ మోడీ వెల్లడించారు.
ఆల్ ఇండియా ఫెయిర్ ఫ్రైస్ షాప్ ఫెడరేషన్‌కు ఉపాధ్యక్షుడిగా ప్రహ్లాద్ మోడీ కొనసాగుతున్నారు. దేశంలో అవినీతి అంశంపై మాట్లాడిన మోడీ, అవినీతిపై పోరాడతామన్న సందేశంతో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఇప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా మరిచిందని అన్నారు.












Click it and Unblock the Notifications