ఇంటికి వెళ్లాలని..: మీడియాతో ఎటిఎం దాడి విక్టిమ్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు ఏటీఎం కేంద్రంలో దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ కార్పొరేషన్ బ్యాంకు ఉద్యోగిని జ్యోతి ఉదయ్ పది రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. శుక్రవారం ఉదయం బీజీఎస్ గ్లోబల్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగం నుంచి స్పెషల్ వార్డుకు ఆమెను మార్చారు. ఈ సమయంలో ఆమె మీడియా ఎదుటకు వచ్చినా పెద్దగా మాట్లాడలేక పోయారు.
త్వరగా కోలుకుని ఇంటికి వెళ్లాలని భావిస్తున్నట్లు మాత్రమే చెప్పారు. గురువారం ఆమెను ఆసుపత్రిలో కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ పరామర్శించారు. జ్యోతి ఉదయ్ త్వరగానే కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వైస్‌ప్రెసిడెంట్ డాక్టర్ వెంకటరమణ తెలిపారు.

మెదడులోని ఎముకను తొలగించామని, ముఖంపై తగిలిన కొడవలి గాయాలు నయమవుతున్నాయని, వాటికి ప్లాస్టిక్ సర్జరీ చేశామని తెలిపారు. కుడిచేయి, కాలుకు పక్షపాతం రాగా ఫిజియోథెరఫీ చేస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రికి చేరిన ప్పుడు కనీసం ఐదారు నెలలు ఉండాల్సి వస్తుందని భావించామని, అయితే నెలన్నర లేదా రెండునెలల్లోగానే జ్యోతి ఉదయ్ సాధారణ స్థితికి చేరుకుంటారని వెంకటరమణ అన్నారు.
ఇటీవల బెంగళూర్‌లోని గార్డులేని ఎటిఎం కేంద్రంలో జ్యోతి ఉదయ్‌పై దుండగుడు దారుణంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి సంఘటన సిసిటివీ కెమెరాలో రికార్డు అయింది. అయితే, ఇప్పటి వరకు నిందితుడిని పోలీసులు పట్టుకోలేకపోయారు.












Click it and Unblock the Notifications