షాక్: రెండో రోజే మూతపడ్డ అయోధ్య రామమందిరం తలుపులు
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు.. తన జన్మస్థలంలో కొలువుదీరాడు. నగుమోముతో బాల రాముడిగా కనులవిందుగా భక్తులకు దర్శనం ఇచ్చాడు.
సోమవారం మధ్యాహ్నం రామ్ లల్లా విగ్రహానికి వేదమంత్రోచ్ఛారణలు, వేలాదిమంది ప్రముఖల జైరామ్ నినాదాల మధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రక్రియ కొనసాగిన విషయం తెలిసిందే.

ప్రారంభోత్సవం జరిగిన మరుసటి రోజు నుంచి సాధారణ భక్తులకు రాములోరిని దర్శించడానికి అనుమతి ఇచ్చింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. దీనితో ఆలయానికి భక్తులు పోటెత్తారు. బాల రాముడిని దర్శించడానికి ఇప్పటికే వేలాదిమంది భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. అర్ధరాత్రి నుంచే నుంచే ఆలయం ప్రాంగణం ముందు బారులు తీర్చినిల్చున్నారు.
దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అటు అయోధ్యానగరం నిండిపోయింది. తొలి రోజున వీఐపీలకు మాత్రమే అనుమతి ఉండటం వల్ల వారంతా అక్కడే బస చేశారు. రామమందిరం ఆలయ ప్రారంభోత్సవాన్ని టీవీలు, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తిలకించారు. నేరుగా బాల రాముడిని దర్శించుకోవడానికి ఆలయాలనికి పోటెత్తారు.
కాషాయ దుస్తులు ధరించి, హనుమ ధ్వజాలను చేతపట్టుకుని, జైశ్రీరామ్ అంటూ నినదిస్తూ ఉప్పెనలా ఆలయంలోనికి ప్రవేశించారు భక్తులు. ప్రాంగణం మొత్తం జనసంద్రంగా మారింది. ఈ క్రమంలో కొందరు భక్తులు అదుపు తప్పి కిందపడటం కనిపించింది. ఎలాంటి తొక్కసలాట చోటు చేసుకోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

పరిస్థితి చేయి దాటుతుండటంతో అయోధ్య ఆలయం ట్రస్ట్ ప్రతినిధులు షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆలయం తలుపులను మూసివేశారు. భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం ఆలయంలో ఉన్న భక్తుల వరకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇచ్చారు. వారంతా బయటికెళ్లిన తరువాత తలుపులను మూసివేశారు.
ఇది తాత్కాలికమేనని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. భక్తుల రద్దీని క్రమబద్దీకరించడానికి అదనపు సిబ్బందిని నియమించినప్పటికీ సాధ్యపడట్లేదని, వేలాదిమందిగా తరలిరావడం వల్ల అందరికీ శ్రీరాముడి దర్శన భాగ్యాన్ని కల్పించలేకపోతున్నామని పేర్కొంది. రద్దీని నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించింది.












Click it and Unblock the Notifications