పార్లమెంట్ ఎన్నికలవేళ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం: బీజేపీకి విపరీతమైన మైలేజ్!!
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం అత్యంత అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. చారిత్రాత్మక ఘట్టంగా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ జైశ్రీరామ్ నినాదాలతో తమ గళాన్ని అయోధ్యకు వినిపించేలా హంగామా చేశారు. ఒక్కసారిగా హిందుత్వం దేశవ్యాప్తంగా పెల్లుబకటం హిందువులంతా ఐక్యంగా ఏకకంఠంతో జైశ్రీరామ్ నినాదాలు వినిపించడం ఆసక్తికరంగా మారింది.
అయితే ఇందులో రాజకీయ కోణం కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బిజెపి తన సొంత కార్యక్రమంలా నిర్వహించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ బిజెపి నాయకులు రంగంలోకి దిగి నిన్న అనేక కార్యక్రమాలను నిర్వహించారు. రాములవారి శోభాయాత్రలు, స్క్రీన్ వేసి మరీ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ ఘట్టాన్ని ప్రజలకు చూపించడం, అన్నదానాలు, భజనలు, నగరసంకీర్తనలు వంటి వాటిలో బిజెపి నేతలు కార్యకర్తలు చురుగ్గా పాల్గొన్నారు.

ఇక ఈ కార్యక్రమాన్ని బిజెపి తన సొంత కార్యక్రమంలా నిర్వహించి హిందువుల మనోభావాలకు దగ్గరగా వెళితే కాంగ్రెస్ మాత్రం అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. రామాలయ పూర్తి కాకముందే ఎలక్షన్ స్టంట్ లో భాగంగా ఇప్పుడు రామమందిర ప్రారంభోత్సవాన్ని పెట్టుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తూ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. దీంతో కాంగ్రెస్ హిందువుల మనోభావాలను పట్టించుకోలేదని, వారి సంతోషంలో భాగస్వామ్యం తీసుకోలేదు అనే టాక్ వినిపిస్తుంది.
భారతదేశంలో 79 శాతం హిందువులు ఉండగా ఇందులో దాదాపు 50 శాతం హిందువులు హిందుత్వ భావజాలాన్ని గట్టిగా వినిపించేవారు మిగతా వారంతా అప్పుడప్పుడు పూజాధికాలు నిర్వహించే హిందువులు. మొత్తంగా ఇండియాలో మెజార్టీ హిందువులు. అయితే అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం శతాబ్దాల కాలంగా హిందువులు వేచి చూస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే రామ మందిరాన్ని నిర్మాణం చేసి రామమందిర ప్రారంభోత్సవానికి ముందు నుండి అయోధ్య అక్షింతల పంపిణీ వంటి కార్యక్రమాలతో ప్రజలలో హిందుత్వ భావజాలాన్ని పెంచి, అయోధ్య రామాలయం అంటే ఇది అందరు హిందువులది అని చెప్పే ప్రయత్నం చేసిన బిజెపి ఈ ప్రయత్నంలో సక్సెస్ అయింది.
ప్రస్తుతం బిజెపికి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంతో విపరీతమైన మైలేజ్ వచ్చింది. ఇది భవిష్యత్తులో జరగనున్న లోక్సభ ఎన్నికల పైన గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలోనూ మత ప్రాతిపదికన ఓట్లు పడిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications