మందుబాబులకు బ్యాడ్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది. ఈ నెల 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. సోమవారం నుంచే పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారు.
ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్.. ఆహ్వానపత్రికలను అందించింది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, సెలెబ్రిటీలకు ఆహ్వానం అందింది. అయోధ్యలో ప్రతి ఇంటికీ రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలను పంపించింది.

రామమందిరం ప్రారంభోత్సవ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రామమందిరం ప్రారంభోత్సవం రోజైన జనవరి 22వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా డ్రై డేను ప్రకటించింది. మద్యం అమ్మకాలను నిలిపివేస్తామని వెల్లడించింది.
ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఆదేశాలను జారీ చేశారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా రాజస్థాన్ ఎక్సైజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి జస్వంత్ సింగ్ కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులను ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలను నిలిపివేయాలని సూచించారు. ఈ ఆదేశాలు పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యతను జిల్లా అధికార యంత్రాంగానికి అప్పగించారు.
రాష్ట్రంలోని అన్ని ఆలయాలను అందంగా అలంకరించాలని, ఆ రోజంతా రామ భజనలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజలందరూ తమ తమ నివాసాల్లో దీపాలను వెలిగించాలని, అయోధ్యా రాముడిని పూజించాలని కోరారు. పండగ వాతావరణంలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications