అయోధ్య చుట్టూ మూడంచెల భద్రత..
Ayodhya Ram Mandir: ఇంకొన్ని గంటలు. 500 సంవత్సరాల నాటి భారతీయుల కల సాకారం కాబోతోంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్యలో.. సరయూ నదీ తీరం ఒడ్డున నిర్మితమైన రామమందిరం ప్రారంభం కాబోతోంది. రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మొదలుకానుంది.
ఈ కార్యక్రమం కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడి ఆలయాలు, ప్రధాన మార్గాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. రామ నామ జపంతో ఈ నగరం మారుమోగిపోతోంది. సరయూ నది తీరం మొత్తం రామభక్తులతో నిండిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోందక్కడ.

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి 7,000 మందికి పైగా ప్రముఖులు హాజరు కానున్నారు. వారంతా ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సామాజికం, సినిమా, క్రీడారంగానికి చెందిన సెలెబ్రిటీలు అయోధ్యకు చేరుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని అయోధ్యలో భారీ భద్రతను మోహరింపజేశారు. 13,000 మంది బలగాలతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. యాంటీ బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను అందుబాటులో ఉంచారు. అయోధ్య ఆలయం వద్ద జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను సిద్ధం చేశారు.

నగరం మొత్తం అణువణువు కనిపించేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. మొత్తంగా 10,000 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఆయా సీసీటీవీలన్నీ కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పని చేస్తాయి. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై నిఘా ఉంచారు. అదనపు పోలీసు బలగాలను మోహరింపజేశారు.
మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇదివరకే కేంద్రీయ పారిశ్రామిక భద్రత బలగాలు తమ ఆధీనంలో తీసుకున్నాయి. 500 మంది సిబ్బందిని విమానాశ్రయం వద్ద మోహరింపజేశారు. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్, బస్టాండ్.. ఇలా ప్రయాణ ప్రాంగణాలన్నింటిపైనా పోలీసులు నిఘా పెట్టారు.












Click it and Unblock the Notifications