హైదరాబాద్, బెంగళూరు కీలకం: యుఎస్-భారత్ రక్షణ బంధంపై రిచర్డ్ వర్మ
న్యూఢిల్లీ: భారత్-అమెరికా రక్షణ ఒప్పందాల్లో భాగంగా హైదరాబాద్, బెంగళూరు నగరాలు కేంద్రంగా అమెరికా రక్షణ పరికరాల పరిశ్రమలను ప్రారంభించనున్నది. ఈ రెండు నగరాలు తమ సంస్థలకు ముఖ్యమైన వనరు అని భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్‌వర్మ మీడియాతో పేర్కొన్నారు. అమెరికా, భారత్ భాగస్వామ్యాన్ని 21వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో ఒక నిర్ణయాత్మక ఉగ్రవాద నిరోధక భాగస్వామ్యంగా చేయడానికి గత నెల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య జరిగిన చర్చలు బీజాలు వేశాయని కూడా ఆయన పేర్కొన్నారు.
రెండు దేశాల మధ్య స్నేహానికి నిజమైన పరీక్ష వాటి సాయుధ బలగాలు పరస్పరం ఏ మేరకు విశ్వాసంతో సహకరించుకుంటున్నాయన్నదేనని రిచర్డ్ వర్మ చెప్పారు. ఒబామా పర్యటన సందర్భంగా అమెరికా, భారత రక్షణ సంస్థల మధ్య సంబంధాలు గణనీయమైన పురోగతి సాధించాయని నగరంలోని వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌లో గురువారం జరిగిన ఓ సెమినార్‌లో వర్మ పేర్కొన్నారు.

విమాన వాహక నౌక టెక్నాలజీపై భారత్, అమెరికాలు ఒక ఉమ్మడి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసుకుంటాయని కొద్ది సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించారా అని ఆయన అన్నారు. ‘మన సహకార భాగస్వామ్యం కొత్త మలుపులు తిరిగిందని చెప్పడానికి రక్షణ పరికరాలను ఉమ్మడిగా అభివృద్ధి చేయడం, ఉమ్మడిగా తయారు చేసే విషయాన్ని పరిశీలించాలని భారత్, అమెరికా రక్షణ సంస్థలు, ప్రైవేటు రంగాలు నిర్ణయించడం కన్నా మెరుగైన ఉదాహరణ ఉండదు' అని వర్మ చెప్పారు.
అత్యంత సన్నిహిత భాగస్వాములు మాత్రమే అలాంటి రక్షణ సహకారాన్ని కొనసాగిస్తారని కూడా చెప్పారు.
‘అమెరికా రక్షణ పరిశ్రమ ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్‌లను అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి ముఖ్యమైన కేంద్రాలుగా చేస్తాయి' అని ఆయన అన్నారు. అయితే రెండు దేశాల మధ్య మరింత సమన్వయానికి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మూడు ప్రధాన ఒప్పందాలు- సిస్మోవా, బెకా, ఎల్‌ఎస్‌ఏ- కుదుర్చుకోవడం రెండు దేశాల మధ్య అజెండాగా ఉంటుందని ఆయన స్పష్టం చేసారు.
ఒబామా పర్యటన సందర్భంగా రక్షణ వాణిజ్య, సహకార ఒడంబడిక (డిటిటిఐ) కింద నాలుగు వినూత్న ప్రాజెక్టులను గుర్తించడంతో పాటుగా విమాన వాహక నౌక టెక్నాలజీపై వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయడానికి అంగీకరించడం రెండు దేశాల మిలటరీల మధ్య సంబంధాలలో ఒక మైలురాయని తెలిపారు.












Click it and Unblock the Notifications