నోట్ల రద్దు తర్వాత 5 రోజుల్లో.. అమిత్ షా డైరెక్టర్‌గా ఉన్న బ్యాంకుకు డిపాజిట్ల వెల్లువ
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా డైరెక్టరుగా ఉన్న అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకుకు పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆ నోట్ల డిపాజిట్లు వెల్లువెత్తాయి. ఆర్టీఐ సమాచారం కింద ఈ విషయం వెలుగు చూసింది. జిల్లా సహకార బ్యాంకులు అన్నింటిలోను ఇక్కడి బ్యాంకుకే ఎక్కువ డిపాజిట్లు వచ్చాయి.
దాదాపు రెండేళ్ల క్రితం నవంబర్ 8న నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ బ్యాంకులో అయిదు రోజుల్లో మొత్తం రూ.745.59 కోట్ల విలువైన రూ.500, రూ.వెయ్యి నోట్లు జమ అయ్యాయి. ఏడీసీబీ తర్వాత స్థానంలో రాజ్‌కోట్ జిల్లా సహకార బ్యాంకు నిలిచింది.

మరో బ్యాంకులో పెద్దమొత్తం
ముంబైకి చెందిన మనోరంజన్ రాయ్ అనే వ్యక్తి ఆర్టీఐ పిటిషన్ ద్వారా ఆ వివరాలను రాబట్టారు. అహ్మదాబాద్ డీసీసీబీకి కేవలం అయిదు రోజుల్లో అంటే నవంబర్ 13వ తేదీ సాయంత్రానికి రూ.745.59 కోట్ల విలువైన నోట్ల డిపాజిట్ జరిగింది. ఏడీసీబీ తర్వాత రాజ్‌కోట్ జిల్లా సహకార బ్యాంకు నిలిచింది. ఈ బ్యాంకు ఛైర్మన్ జయేశ్‌భాయ్ విఠల్‌భాయ్ రాడాడియా.. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ప్రభుత్వంలో కేబినెట్ మినిస్టర్.

చాలాకాలంగా అమిత్ షా బ్యాంకు డైరెక్టర్
ఈ బ్యాంకులో రూ.693.19 కోట్ల విలువైన రూ.500, రూ.వెయ్యి నోట్లు జమయ్యాయి. ఏడీసీబీ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. అమిత్ షా ఇంకా ఆ బ్యాంకు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. చాలా సంవత్సరాల నుంచి ఆ బ్యాంకు డైరెక్టర్‌గా ఉన్నారు. 2000లో దానికి ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. 2017, మార్చి 31 నాటికి ఏడీసీబీ మొత్తం డిపాజిట్ల విలువ రూ.5,050 కోట్లు. 2016-17లో ఆ బ్యాంకు నికర లాభం రూ.14.31 కోట్లు.

అక్కడి కంటే చాలా ఎక్కువ
అహ్మదాబాద్, రాజ్‌కోట్ జిల్లా సహకార బ్యాంకుల్లో జమ అయిన రద్దయిన నోట్ల విలువ గుజరాత్ రాష్ట్ర సహకార బ్యాంకు కన్నా చాలా ఎక్కువ. రాష్ట్ర సహకార బ్యాంకులో రద్దైన నోట్ల జమ కేవలం రూ.1.11 కోట్లు మాత్రమే. దేశవ్యాప్తంగా డిపాజిట్ అయిన రద్దయిన పెద్ద నోట్ల మొత్తం విలువ రూ.15.28లక్షల కోట్లు కాగా అందులో సగానికిపైగా అంటే రూ.7.91లక్షల కోట్లు కేవలం ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులు, 32 రాష్ట్ర సహకార బ్యాంకులు, 370 జిల్లా సహకార బ్యాంకులు, దాదాపు 40 తపాలా కార్యాలయాల్లో జమయ్యాయి.

తీవ్రమైన అంశమే
కేవలం కొన్ని బ్యాంకులు, వాటి శాఖలు, కొన్ని తపాలా కార్యాలయాలు, రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకులలో సగానికి పైగా పాత నోట్లు జమకావడం తీవ్రమైన అంశమేనని మనోరంజన్ అన్నారు. అండమాన్ నికోబర్ దీవుల్లో నాలుగు లక్షల కన్నా తక్కువ జనాభా ఉండగా అక్కడి రాష్ట్ర సహకార బ్యాంకుకు చెందిన 29 శాఖల నుంచి రూ.85 కోట్లకు పైగా వచ్చింది.












Click it and Unblock the Notifications