వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్: సన్నబియ్యం సాంబ మసూరీ పుట్టినిల్లుగా పిలిచే ఈ కాలేజీ ప్రత్యేకత ఏమిటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్

దేశంలో ఆహారధాన్యాలకు తీవ్ర కొరతతో అల్లాడిన దశ నుంచి ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ దేశాలకు బియ్యం, గోధుమలు ఎగుమతి చేసే స్థాయికి ఎదగడంలో అనేక మలుపులున్నాయి. కీలక నిర్ణయాలున్నాయి.

అలాంటి వాటిలో వ్యవసాయ కళాశాలల ఏర్పాటు కూడా ఒకటి. స్వాతంత్ర్యానికి పూర్వమే ఆంధ్రా యూనివర్సిటీకి అనుబంధంగా వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంలో తొలుత కోయంబత్తూరులో, తర్వాత నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే ఉన్న బాపట్లలో వ్యవసాయ కళాశాలలు ఏర్పాటయ్యాయి.

వ్యవసాయరంగంలో మేలురకం వంగడాల పరిశోధన, సశ్యరక్షణలో అవసరమైన మార్పులతో హరిత విప్లవం వంటివి విజయవంతం కావడంతో ఈ వ్యవసాయ కళాశాలలు కీలక పాత్ర పోషించాయి. నేటికీ దేశ వ్యవసాయాభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి.

బాపట్ల వ్యవసాయ కళాశాల ఏర్పాటై 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్

నెహ్రూ హయంలో..

బాపట్ల వ్యవసాయ కళాశాల. తెలుగు రాష్ట్రాల్లో చిరపరిచితమయిన విద్యాసంస్థల్లో ఒకటి. స్వతంత్రానికి ముందే ప్రొఫెషనల్ కోర్సులు ప్రారంభించడం విశేషం కాగా, స్వతంత్ర భారత తొలినాళ్లలో వ్యవసాయ రంగానికి లభించిన ప్రాధాన్యత రీత్యా ఈ కళాశాల ప్రత్యేకతను సంతరించుకుంది.

78 ఏళ్లుగా నడుస్తున్న సంస్థ నేటికీ దేశ వ్యవసాయరంగంలో మెరికల్లాంటి శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగ నిపుణులకు తయారీ కేంద్రంగా విలసిల్లుతోంది.

1945 జూలై 16న తొలుత ఆంధ్ర యూనివర్సిటీకి అనుబంధంగా వ్యవసాయ కోర్సులు ప్రారంభమయ్యాయి. 1948 నాటికే తొలి బ్యాచ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

1950లో బాపట్లలో 328 ఎకరాల విస్తీర్ణంలో ఇది పునాదులు వేసుకుంది. ఆ మరుసటి ఏడాది నుంచి ఎంఎస్సీ అగ్రికల్చర్ కోర్సు మొదలయ్యింది.

బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్

1964లో ఏర్పాటయిన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధగా కళాశాలగా మారింది.

అగ్రికల్చర్ యూనివర్సిటీని ఆ తర్వాత ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీగా మార్చారు. ప్రస్తుతం ఈ కాలేజీలో పీజీతో పాటుగా పీహెచ్‌డీ పట్టాలు కూడా అందిస్తున్నారు.

96 మంది విద్యార్థులతో ప్రయాణం ప్రారంభించిన కళాశాల నేడు దక్షిణ భారతదేశంలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ కళాశాలగా అవతరించింది. తొలి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి దక్కిన ప్రాధాన్యతకు అనుగుణంగా వ్యవసాయ కళాశాల అభివృద్ధికి నాటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ విశేషంగా ప్రోత్సాహం అందించారని పూర్వ విద్యార్థులు చెబుతుంటారు. ఈ కాలేజీ విద్యార్థుల ప్రతిభను నాటి నెహ్రూ ప్రత్యేకంగా అభినందించిన విషయాన్ని గుర్తు చేసుకుంటారు.

బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్

సాంబ మసూరి ఇక్కడే పుట్టింది...

ప్రస్తుతం సన్నబియ్యం రకాల్లో ఎక్కువ మంది ఇష్టపడే సాంబమసూరి రకం వరి వంగడం బాపట్ల వ్యవసాయ కళాశాలలోనే పుట్టింది. కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన డాక్టర్ ఎంవీ రెడ్డి సారధ్యంలోని బృందం దీనికి ఆద్యులు.

బీపీటీ 5204గా పిలిచే ఈ వరి వంగడం 40 ఏళ్లుగా ప్రపంచంలోని అనేక దేశాల్లో విస్తరించి, అందరినీ ఆకట్టుకుందంటే దానివెనుక ఎంతో నిబద్ధత, చిత్తశుద్ది ఉందని రిటైర్డ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎస్వీఎస్ గంగాధర్ రావు అన్నారు.

"నేను ఇక్కడే యూజీ, పీజీ చేశాను. వివిధ ప్రాంతాల్లో సైంటిస్ట్‌గా పనిచేశాను. రాగుల్లో కొత్త వంగడాలకు రూపకల్పన చేశాము. కానీ సాంబమసూరి రకం వరి వంగడం విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందంటే దానికి ఆనాటి ప్రొఫెసర్ల కృషి కారణం. మేము విద్యార్థులుగా ఉండగా, రాత్రిళ్లు సెకండ్ షో సినిమా చూసి వస్తుంటే ల్యాబ్‌లో ఎంవీ రెడ్డి, ఆయన బృందం పనిచేస్తుండేవారు. మాకే ఆశ్చర్యమేసింది. వారి నిబద్ధతకు అది నిదర్శనం. అందుకే ఆధునిక వంగడాలు, దిగుబడిని పెంచే వివిధ అంశాలు వారి పరిశోధనల నుంచి వెలువడ్డాయి" అని గంగాధర్ వివరించారు.

మావంటి ఎందరికో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని అందించిన నాటి ప్రొఫెసర్ల కృషి మరువలేనిదంటూ తన అనుభాన్ని ఆయన బీబీసీతో పంచుకున్నారు.

బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్

అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు

గ్రాడ్యుయేషన్ కోర్సులతో పాటుగా పీజీలో జెనిటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ (1968), ఎంటోమోలజీ, సోయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ (1970), అగ్రికల్చర్ ఎకనామిక్స్ (1976), ప్లాంట్ ఫిజియాలజీ(1978), అగ్రోనమీ అండ్ ప్లాంట్ పాథాలజీ (1982) వంటి కోర్సులు మొదలయ్యాయి.

1983లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్‌ను ప్రారంభించారు. అదే సంవత్సరం నుంచి హోం సైన్స్ కోర్స్ కూడా మొదలయ్యింది. 1989 నుంచి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అందుబాటులోకి వచ్చింది.

1993 నుంచే పీహెచ్ డీ అందుబాటులోకి వచ్చింది.

విశాలమైన ప్రాంగణంలో నూతన భవనాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐకార్) కూడా ఇది అనుబంధంగా మారింది.

దాంతో ఏటా వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు అగ్రికల్చర్ కోర్సుల కోసం బాపట్ల కాలేజీకి వస్తున్నారు. ఏటా అగ్రికల్చర్ కోర్సులకు ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా సీట్లు కేటాయిస్తుంటారని అసోసియేట్ డీఎన్ వి శ్రీనివాసరావు తెలిపారు.

"ప్రస్తుతం దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. 98 శాతం మంది విద్యార్థులు హాస్టల్‌లోనే ఉంటారు. అందుకు అనుగుణంగా మెరుగైన సదుపాయాలు కల్పించాము. వివిధ పరిశోధనలు, పరీక్షలకు అనుగుణంగా ఏర్పాట్లున్నాయి. దేశంలోనే ఉన్నత విద్యాసంస్థల్లో ఒకటిగా కాలేజ్ వెలుగుతోంది. దేశ వ్యవసాయరంగంలో మెరికల్లాంటి ఎందరో శాస్త్రవేత్తలను బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ అందించడం గర్వంగా భావిస్తాం" అంటూ ఆయన బీబీసీతో అన్నారు.

వ్యవసాయ కోర్సులకు ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా నిత్యం మార్పులు చేసుకుంటూ కాలేజ్ కీర్తిని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నట్టు డీన్ శ్రీనివాసరావు వివరించారు.

బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్

''గర్వంగా ఉంటుంది’’

సుదీర్ఘ చరిత్ర కలిగిన వ్యవసాయ కళాశాలలో విద్యాభ్యాసం తమకు ఎంతో గర్వకారణంగా ఉంటుందని విద్యార్థులు అంటున్నారు.

మూడో సంవత్సరం బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న శ్రీ లేఖ బీబీసీతో తన అనుభవాన్ని పంచుకున్నారు.

"నేను విజయవాడ నగరంలో పుట్టాను. అక్కడే చదువుకున్నాను. వ్యవసాయం అంటే తెలియదు. కానీ అగ్రికల్చర్ కోర్స్‌కు భవిష్యత్ ఉంటుందని చెబితే వచ్చి చేరాను. ఇక్కడ అనేక విషయాలు తెలుసుకుంటున్నాను. ముఖ్యంగా వ్యవసాయం మన జీవితాలకు ఎంత కీలకమన్నది అర్థం కావడం, అందులో మన పాత్ర ఎలా ఉండాలన్నది బోధపడుతోంది. భవిష్యత్‌లో వ్యవసాయ రంగంలో స్టార్టప్‌లు సహా వివిధ అవకాశాలున్నాయి. వాటిని వినియోగించుకుని ఈ రంగంలో మెరుగైన కృషి చేయాలని ఆశిస్తున్నాను" అంటూ ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

"నేను కాకినాడ దగ్గర ఓ గ్రామం నుంచి వచ్చాను. ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అన్ని రాష్ట్రాల విద్యార్థులతో కలిసి అగ్రికల్చర్ కోర్సులు చదవడం వల్ల మా పరిధి విస్తృతం అవుతోంది. ఎక్కడ,ఎవరి వ్యవసాయ పద్ధతులు ఎలా ఉంటాయన్నది తెలుస్తోంది. ఇంతటి చరిత్ర కలిగిన కళాశాలలో చదువుకుని ఎందరో ఉన్నత స్థానాలకు వెళ్లారు. వారి బాటలో పయనించే అవకాశం మాకు దక్కింది. అందుకు గర్వ పడుతున్నాం" అంటూ డి కిరణ్ అనే విద్యార్థి అభిప్రాయపడ్డారు.

అకాడమిక్ సిలబస్‌తో పాటుగా ఫీల్డ్ అనుభవాలకు అనుగుణంగా ఉన్న ప్రాంగణం బాగా ఉపయోగపడుతోందని వారు తెలిపారు.

బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్

ఎందరో ప్రముఖులు...

బాపట్ల వ్యవసాయ కళాశాలలో విద్యాభ్యాసం చేసిన పలువురు ప్రముఖులను ప్లాటినం జూబ్లీ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. సుమారుగా 1500 మంది పూర్వ విద్యార్థులతో సమ్మేళనం ఏర్పాటు చేశారు.

వారిలో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారని ఈ వేడుకల నిర్వాహకులు బీబీసీకి తెలిపారు.

ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు, మాజీ ఎమ్మెల్యేలు చిట్టూరి వెంకటేశ్వర రావు, పోతుల రామారావు వంటి వారు బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థులే.

సివిల్స్ అధికారుల్లో ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత సీఎం సలహాదారు అజయ్ కల్లం, మాజీ డీజీపీ ఎం మాలకొండయ్య సహా అనేక మంది ప్రముఖులు ఈ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వారే.

నాబార్డ్‌కు చైర్మన్‌గా పనిచేసిన చింత గోవిందరాజులు కూడా బాపట్ల కళాశాల పూర్వ విద్యార్థి. సినీ నటుడు చంద్రమోహన్ కూడా బాపట్లలో వ్యవసాయ విద్యనభ్యసించారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఎం.ఎస్‌.వి.ఎస్‌. శాస్త్రి, ఈడ్పుగంటి వెంకటసుబ్బారావు(ఐ.వి.సుబ్బారావు) బాపట్లలో చదువుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

ప్రస్తుతం ఎన్జీరంగా యూనివర్సిటీ వీసీగా ఉన్న ఏ విష్ణువర్థన్ రెడ్డి కూడా 1980 బ్యాచ్‌ విద్యార్థిగా బాపట్ల ఏజీ కళాశాలలోనే విద్యాభ్యాసం చేశారు.

1945--2020 మధ్య బాపట్ల వ్యవసాయ కళాశాల నుంచి పట్టాలు పొందిన విద్యార్థులంతా ఈ ప్లాటినం జూబ్లీ వేడుకులకు హాజరవుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

కరోనా కారణంగా ఆలస్యంగా....

2020 నాటికే ఈ కాలేజ్ 75 వసంతాలను పూర్తి చేసుకుంది. అయితే కరోనా కారణంగా అప్పట్లో జరపాల్సిన ప్లాటినం జూబ్లీ వాయిదా పడిందని నిర్వాహకులు అంటున్నారు.

సీఆర్ శ్రీనివాస్ అయ్యంగార్ తొలి ప్రిన్సిపాల్‌గా మొదలయిన ఈ కళాశాల 78వ వసంతంలో అడుగుపెట్టిన వేళ జరుగుతున్న ఈ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అసోసియేట్ డీన్ శ్రీనివాసరావు అన్నారు.

"వ్యవసాయరంగంలో ఆధునిక టెక్నాలజీని వినియోగించడానికి అనుగుణంగా కోర్సులు తీర్చిదిద్దుతున్నాం. రాబోయే తరం విద్యార్థులు కూడా రైతుల సేవలో, దేశ పురోభివృద్ధిలో కీలక భూమిక పోషించేందుకు తగ్గట్టుగా తర్ఫీదునిస్తున్నాము. పరిశోధనల్లో ప్రోత్సాహం అందిస్తూ, మరింత ఉత్సాహంగా మెరుగైన వంగడాల రూపకల్పనలో అందరినీ భాగస్వాములను చేసేందుకు ఈ వేడుకలు తోడ్పతాయని భావిస్తున్నాం" అంటూ ఆయన బీబీసీతో అన్నారు.

వ్యవసాయరంగంలో కూడా మార్పులు వస్తున్నాయని, ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా కొత్త పంటలవైపు మొగ్గు చూపే రైతులకు మేలు చేసేలా బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ పనిచేస్తుందని ఆయన తెలిపారు.

వ్యవసాయరంగం, దానికి సంబంధించిన కోర్సులు గుర్తుకు రాగానే తెలుగునేల మీద అనేక మందికి ఈ కళాశాల గుర్తు కొస్తోంది. శత వసంతాల దిశగా సాగుతున్న ఈ క్యాంపస్‌లో ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Bapatla Agriculture College: What is special about this college called the birthplace of various verities of the rice
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X