వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ: భారత విదేశీ వ్యవహారాల శాఖ, బ్రిటన్ ప్రధాని ఎలా స్పందించారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నరేంద్ర మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై భారత ప్రభుత్వం స్పందించింది.

ఇదే అంశంపై బ్రిటన్ పార్లమెంట్‌లో ఎదురైన ప్రశ్నకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కూడా సమాధానం ఇచ్చారు.

''ఇండియా: ది మోదీ క్వశ్చన్’’ పేరిట ఒక డాక్యుమెంటరీని రెండు భాగాలుగా బీబీసీ రూపొందించింది.

జనవరి 17వ తేదీన యూకేలో ఈ డాక్యుమెంటరీ తొలి భాగం ప్రసారం అయింది.

రెండో భాగాన్ని జనవరి 24న ప్రసారం చేయనున్నారు. అయితే, ఈ డాక్యుమెంటరీ భారత్‌లో అందుబాటులో లేదు.

రాజకీయాల్లో నరేంద్ర మోదీ తొలిరోజులను డాక్యుమెంటరీ తొలి భాగంలో చూపించారు. భారతీయ జనతా పార్టీలో సాధారణ నేత నుంచి నరేంద్ర మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యే దశలను ఇందులో చిత్రీకరించారు.

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో పోలీసుల పహారా

పాత్రికేయుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఒక ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ, '' ప్రధానమంత్రికి అపఖ్యాతిని అంటగట్టేందుకు రూపొందించిన కథనంగా ఈ డాక్యుమెంటరీని మేం భావిస్తున్నాం. పక్షపాతం, నిష్పాక్షికత లేమి, గతకాలపు వలసవాద మనస్తత్వం ఈ డాక్యుమెంటరీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిని రూపొందించిన ఏజెన్సీ విధానానికి, అపఖ్యాతిని అంటగట్టాలని చూస్తున్న వ్యక్తుల మనస్తత్వానికి ఈ డాక్యుమెంటరీ ప్రతిబింబం’’ అని ఆయన అన్నారు.

ఈ డాక్యుమెంటరీ రూపొందించడంలో బీబీసీ ఉద్దేశం ఏంటని బాగ్చి ప్రశ్నించారు.

''ఈ డాక్యుమెంటరీ తీయడం వెనక ఉన్న ఎజెండా, ఉద్దేశాలు మాకు తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి’’ అని ఆయన అన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో జరిగిన అల్లర్లలో 2000 మందికి పైగా మరణించినప్పుడు ఆయన తీసుకున్న చర్యల గురించి ఈ డాక్యుమెంటరీలో ప్రశ్నలు లేవనెత్తారు.

గుజరాత్ అల్లర్లకు సంబంధించి బ్రిటిష్ విదేశాంగ కార్యాలయం నుంచి బీబీసీకి అందిన నివేదికను ఈ డాక్యుమెంటరీలో హైలైట్ చేశారు. ఈ నివేదికను గతంలో ఎప్పుడూ ప్రచురించలేదు.

ఈ నివేదికను బ్రిటిష్ విదేశాంగ శాఖ అధికారులు రూపొందించారు.

''2002లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడానికి కారణమైన వాతావరణం ఏర్పడటానికి మోదీ ప్రత్యక్షంగా బాధ్యుడు’’ అని ఆ నివేదికలో అధికారులు పేర్కొన్నారు.

గుజరాత్ అల్లర్ల విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను మోదీ చాలా కాలంగా తిరస్కరిస్తూ వచ్చారు. కానీ, బ్రిటిష్ విదేశాంగ కార్యాలయం కోసం ఈ నివేదికను రాసిన బ్రిటిష్ దౌత్యవేత్త మాత్రం నివేదికలో పేర్కొన్న అంశాలను సమర్థించారు.

గుజరాత్ హింసాకాండలో మోదీ ప్రమేయం లేదని భారత అత్యున్నత ధర్మాసనం సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

ఈ నివేదిక రూపకర్తల్లో ఒకరు డాక్యుమెంటరీలో మాట్లాడుతూ, ''మా ఇన్వెస్టిగేషన్‌లో కొన్ని విషయాలను కనుగొన్నాం. గుజరాత్‌లో జరిగిన హింసాకాండలో 2000 మందికిపైగా హత్యకు గురయ్యారు. ఇది చాలా ప్రణాళిక ప్రకారం జరిగింది. ఇదే నిజం’’ అని అన్నారు.

అప్పటి బ్రిటిష్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి జాక్ స్ట్రా ఆదేశాల మేరకు జరిగిన ఎంక్వైరీలో భాగంగా ఈ నివేదికను రూపొందించారు.

ఈ హింసాకాండ పరిధి చాలా ఎక్కువని ఆ నివేదిక పేర్కొంది. హిందూ ప్రాంతాల నుంచి ముస్లింలను తరిమేయడమే ఈ అల్లర్ల ఉద్దేశమని నివేదిక తెలిపింది.

రిషి సునాక్

బ్రిటిష్ ఎంపీ ఇమ్రాన్ హుస్సేన్ ఈ అంశాన్ని బ్రిటన్ పార్లమెంట్‌లో లేవనెత్తారు.

గుజరాత్ అల్లర్లకు మోదీ ప్రత్యక్ష కారణమంటూ బ్రిటిష్ విదేశాంగ కార్యాలయ దౌత్యవేత్తలు చెప్పిన విషయాన్ని మీరు అంగీకరించారా? అని ప్రధాని రిషి సునాక్‌ను ఆయన అడిగారు.

ఒక జాతిని తుదముట్టించే ఈ ఘోరమైన చర్యలో మోదీ ప్రమేయం గురించి బ్రిటిష్ విదేశాంగ కార్యాలయానికి ఇంకా ఏమేం విషయాలు తెలుసని రిషి సునాక్‌ను ఇమ్రాన్ హుస్సేన్ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నలకు రిషి సునాక్ సమాధానం ఇస్తూ, ఎంపీ ప్రతిపాదించిన ఈ అంశాలతో తాను ఏకీభవించడం లేదని అన్నారు.

''ఈ విషయంలో యూకే ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. సుదీర్ఘకాలంగా ఇది మారలేదు. హింస ఎక్కడ జరిగినా దాన్ని ఉపేక్షించబోం. అయితే, ఒక గౌరవనీయ వ్యక్తిని చిత్రీకరించిన తీరుతో నేను ఏకీభవించలేను’’ అని మోదీకి రిషి మద్దతుగా నిలిచారు.

బీబీసీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ''ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన అంశాలను హైలైట్ చేసే విషయానికి బీబీసీ కట్టుబడి ఉంది. భారత్‌లో హిందూ, ముస్లింల మధ్య ఉన్న ఉద్రిక్తతలను ఈ డాక్యుమెంటరీ సిరీస్ పరిశీలిస్తుంది. ఆ ఉద్రిక్తతలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాలను ఇది వివరిస్తుంది’’ అని అన్నారు.

అత్యున్నత ప్రమాణాలను పాటించి, తీవ్రంగా పరిశోధన చేసి ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్లు బీబీసీ చెప్పింది. ఈ డాక్యుమెంటరీ కోసం అనేక మంది ప్రత్యక్ష సాక్షులు, నిపుణులను సంప్రదించినట్లు వెల్లడించింది.

డాక్యుమెంటరీలో అన్ని అభిప్రాయాలను పొందుపరిచామని తెలిపింది. బీజేపీకి చెందిన వ్యక్తుల స్పందనలు కూడా ఇందులో చేర్చామని చెప్పింది.

సిరీస్‌లో లెవనెత్తిన అంశాలపై స్పందించాలని భారత ప్రభుత్వాన్ని కోరగా, వాటిపై స్పందించడానికి భారత ప్రభుత్వం నిరాకరించిందని తెలిపింది.

బ్రిటన్ విదేశాంగ మాజీ మంత్రి జాక్ స్ట్రా మాట్లాడుతూ, ''ఇది చాలా దిగ్భ్రాంతికరమైనది. పోలీసులు తమ పని చేయకుండా నిరోధించడంతో పాటు, హిందూ తీవ్రవాదులను నిశ్శబ్ధంగా ప్రోత్సహించడంలో మోదీ చురుకైన పాత్ర పోషించారనేవి చాలా తీవ్రమైన విషయాలు’’ అని అన్నారు.

ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకోగల చర్యల గురించి ఆయన మాట్లాడుతూ, ''మాకున్న అవకాశాలు అప్పుడు చాలా పరిమితం. భారత్‌తో దౌత్య సంబంధాలను ఎప్పటికీ విచ్ఛిన్నం చేసుకోబోం. కానీ, మోదీ ప్రతిష్టకు ఇది కచ్చితంగా ఒక మరక లాంటిది. అందులో ఎలాంటి సందేహం లేదు’’ అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
BBC documentary on Modi: How did India's Ministry of External Affairs and British Prime Minister react?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X