వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీబీసీ ఎక్స్‌క్లూజివ్: పాకిస్తాన్‌తో కాదు ప్రజలతో చర్చిస్తాం - జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మనోజ్ సిన్హా

కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌తో చర్చించేదేమీ లేదని.. ఏదైనా ఉంటే స్థానికులతోనే చర్చిస్తామన్నారు జమ్మకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.

ఆర్టికల్ 370 తొలగింపు, జమ్ములో పండిట్లపై దాడులు, కశ్మీర్ అంశంపై చర్చలు, లోయలో ఎన్నికల నిర్వహణతో పాటు పాటు అనేక అంశాలపై బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

కశ్మీర్‌లో యువకులు రాళ్లు రువ్వడాలు, ఆందోళనలు ఆగిపోయాయని లెఫ్టినెంట్ గవర్నర్ ఇటీవల తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో తెలిపారు.

రాళ్లు విసరడం ఆగిపోయినా లోయలో స్వేచ్చ లేదని వస్తున్న ఆరోపణలు, ఇతర అనేక అంశాలపై బీబీసీ ప్రతినిధి ప్రశ్నకు ఆయనేం చెప్పారు?

ముకేశ్ శర్మ, మనోజ్ సిన్హా

బీబీసీ ప్రతినిధి: లోయలో స్వేచ్ఛ లేదన్న ఆరోపణలు వస్తున్నాయి..

మనోజ్ సిన్హా: రోజుల తరబడి బంద్‌లు, స్కూళ్ల మూసివేత, వ్యాపారం ఆగిపోవడం, వ్యవస్థలన్నీ స్తంభించడంలాంటివాటి పట్ల ఇక్కడి ప్రజలు విసిగిపోయారు.

దేశంలో వస్తున్న అభివృద్ధి తమకూ కావాలని యువత కోరుకుంటోంది. వారి ఆశలకు తగినట్లు ఎదుగుతున్నారు. వాటిని పూర్తి చేయాల్సి ఉంది.

చాలా కొద్దిమంది మాత్రమే, అది కూడా పొరుగునున్న వారి మాటలు వినేవాళ్లు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. మీలాంటి పాత్రికేయుల్ని తప్పుదారి పట్టించేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు.

బీబీసీ ప్రతినిధి: 2019లో ఆర్టికల్ 370ని తొలగించడాన్ని వ్యతిరేకించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని కుటుంబాలు ఇప్పటికీ అలాంటి నిర్బంధంలో ఉన్నాయి.

మనోజ్ సిన్హా: నేనొక మాట చెబుతాను. ఏ రాజకీయ నాయకుడు కూడా గృహ నిర్బంధంలో కానీ, జైల్లో కానీ లేరు. ఎవరైనా తీవ్రవాదులతో సంబంధాలున్నా, వారితో కలిసి ఉన్నా, దేశ సమైక్యతకు ప్రమాదకరంగా మారినా, అలాంటి వాళ్ల కోసమే జైళ్లను నిర్మించాం. తప్పు చేసిన వాళ్లు జైళ్లలోనే ఉంటారు. కానీ రాజకీయ, సామాజిక కార్యకర్తలను జైల్లో పెట్టలేదు.

బీబీసీ ప్రతినిధి: మిర్వాయిజ్ ఉమర్ ఫారుఖ్ మీద ఏఏ ఆరోపణలు ఉన్నాయో తెలియదని ఆయన సహచరులు అంటున్నారు. ఆయనను చాలా కాలం నుంచి గృహ నిర్బంధంలో ఉంచారు.

మనోజ్ సిన్హా: మీ మాటల్ని సవరించాలి. 2019లోనూ మిర్వాయిజ్ ఉమర్ ఫారుఖ్‌పై ప్రజా భద్రతా చట్టాన్ని ప్రయోగించలేదు. ఆయన్ని బంధించలేదు. దురదృష్టత్తువశాత్తూ ఆయన తండ్రిని హత్య చేశారు. ఆయన సురక్షితంగా ఉండాలనే ఆయన చుట్టూ పోలీసులను ఉంచారు. ఆయనేం చేయాలనుకుంటున్నారో చెయ్యవచ్చు. మా దృష్టిలో గృహ నిర్బంధం ఏమీ లేదు.

బీబీసీ ప్రతినిధి: మెహబూబా ముఫ్తీ చాలాసార్లు చెప్పారు. ఇటీవల కూడా నేను విన్నాను. పాకిస్తాన్‌తో చర్చించకపోతే శాంతి సాధ్యం కాదంటున్నారు. పాలనా ప్రతినిధిగా మీరేమంటారు.

మనోజ్ సిన్హా: అది ఆమె అభిప్రాయం. ఆమె అభిప్రాయం గురించి నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు. కానీ ఒక్క విషయం స్పష్టంగా చెబుతాను. చర్చలంటూ జరిగితే అది జమ్మకశ్మీర్ ప్రజలు, ఇక్కడి యువకులతోనే. పాకిస్తాన్‌తో చర్చల అవసరం లేదు. అలాంటిదేమీ జరగదు కూడా.

బీబీసీ ప్రతినిధి: పండిట్ల పునరావాసం గురించి... సోఫియాన్‌లో ఇటీవల జరిగిన సంఘటనలు. పండిట్లను లక్ష్యంగా చేసుకుని కొన్ని సంఘటనలు జరిగాయి. వారి పునరావసానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు వారిని లక్ష్యంగా చేసుకున్న వారు మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

కశ్మీరీ పండిట్‌లు

మనోజ్ సిన్హా: వాస్తవం ఏంటంటే.. కశ్మీరీ పండిట్ల మీద దాడులు జరిగాయి. వారితోపాటు మరి కొంతమంది పైనా జరుగుతున్నాయి. అందుకే ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. తీవ్రవాదుల దాడుల్ని మతం దృష్టిలో చూడకూడదు. తీవ్రవాదుల దాడుల్లో చనిపోయిన వారిలో కశ్మీరీ ముస్లింలు కూడా ఉన్నారు. అది ఎవరి కంటే తక్కువ కాదు. కాస్త ఎక్కువే కావచ్చు. గత మూడేళ్లలో భద్రతాదళాల తూటాల వల్ల ఒక్క నిర్దోషి కూడా చనిపోలేదు. ఇది చిన్న విషయం కాదు. రాళ్లు విసరడం అనేది చరిత్రగా మారింది. ఈ బంద్‌లు, ఆందోళనలు, ఇలాంటివన్నీ. పాకిస్తాన్ నుంచి ఆదేశాలు వస్తే దుకాణాలు మూతపడేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.

బీబీసీ ప్రతినిధి: కొన్ని రోజుల క్రితం చర్చ జరుగుతోంది. ఎవరైనా తీవ్రవాదులతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి బంధువులు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే వారి మీద విచారణ జరుగుతోంది. ఇటీవల కూడా జరిగింది.

మనోజ్ సిన్హా: దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారిని పట్టుకుంటున్నారు. వాళ్లు తీవ్రవాదులకు మద్దతిస్తున్నట్లు సంపూర్ణమైన ఆధారాలు ఉన్నాయి. తీవ్రవాదులతో కలిసినట్లు కొంతమంది మీద ఆరోపణలు ఉన్నాయి. ఒక్క నిర్దోషిని కూడా అదుపులోకి తీసుకోలేదు. తీసుకోం కూడా.

బీబీసీ ప్రతినిధి: జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు ఎప్పుడు జరగవచ్చు?

మనోజ్ సిన్హా: కేంద్ర హోంమంత్రి సభలో స్పష్టంగా చెప్పారు. మొదట నియోజకవర్గాల పునర్వవస్థీకరణ. తర్వాత ఎన్నికలు, తర్వాత సరైన సమయంలో రాష్ట్ర హోదా. నియోజక వర్గాల పునర్వవస్థీకరణ పూర్తయింది. ఇక ఎన్నికలు జరగాల్సి ఉంది. దేశం రాజ్యాంగాన్ని అనుసరించి నడుస్తుందని మీకు తెలుసు. ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు. ఎన్నికల సంఘం. అదొక రాజ్యాంగ వ్యవస్థ. ఓటర్ల జాబితా సిద్ధమవుతుంది. గతంలో ఉన్న జాబితా ఏడేనిమిదేళ్ల క్రితం తయారైంది. అప్పట్లో 12 ఏళ్లు ఉన్నవారికి ఇప్పుడు ఓటు హక్కు వచ్చింది. అలాంటి వారికి ఓటు హక్కు నిరాకరించడం ప్రజాస్వామ్యమేనా.. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను బట్టి ఓటర్ల జాబితా సిద్ధమవుతోంది. ఎన్నికల సంఘం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది.

బీబీసీ ప్రతినిధి: మీరు ఇక్కడ ప్రభుత్వ ప్రతినిధి. పూర్తి రాష్ట్ర హోదా ఎప్పుడు వస్తుంది? దీని గురించి మీరేమనుకుంటున్నారు.

మనోజ్ సిన్హా: నేను మీకు సమాధానం చెప్పాను. కేంద్ర హోంమమంత్రి పార్లమెంట్‌లో చెప్పారు. మొదట నియోజకవర్గాల పునర్వవస్థీకరణ. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు. ఆ తర్వాత సరైన సమయంలో రాష్ట్ర హోదా ప్రకటన. సరైన సమయం రానివ్వండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
BBC Exclusive: We will discuss with people, not Pakistan - Jammu and Kashmir Lt Governor Manoj Sinha
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X