వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

BBC Investigation: మహిళల నగ్న చిత్రాలతో వ్యాపారం చేస్తున్న రహస్య ప్రపంచం గుట్టురట్టు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మోనిక ప్లాహా

చాలా మంది అమ్మాయిలు ఆన్‌లైన్‌లో ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. కొంత మంది ప్రొఫైల్స్ ప్రైవేట్‌గా ఉంచితే కొందరు పబ్లిక్ ప్రొఫైల్స్ ఉంచుతుంటారు. కొంత మందికి వేలల్లో ఫాలోవర్లు కూడా ఉంటారు.

కానీ, ఇలా ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు కొంత మంది అమ్మాయిల పాలిట శాపంలా మారాయి. ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన అమ్మాయిల ఫోటోలను దుర్వినియోగం చేస్తూ కొందరు ఆన్‌లైన్‌లో బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడటం, బెదిరించడం లాంటి పనులు చేస్తున్నారు.

రెడిట్ అనే ఆన్‌లైన్ వేదికలో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేస్తున్న ఒక వ్యక్తిని బీబీసీ కనిపెట్టింది.

"ఆమె నగ్న చిత్రాలు కావాలంటే మెసేజీ చేయండి. 5 పౌండ్లు (సుమారు రూ.470) ఖర్చవుతుంది".

"వ్యాపారం చేయాలనుకునేవారికి నా దగ్గర ఆమె వీడియోలు ఉన్నాయి".

"ఆమెను ఏమి చేస్తాం"?

ఇలాంటి కామెంట్లు, ఫోటోలను చూస్తూ స్క్రోల్ చేస్తున్నప్పుడు కొన్ని వేల ఫోటోలు కనిపించాయి.

ఆ ఫోటోల్లో అర్ధ నగ్నంగా లేదా నగ్నంగా ఉన్న అమ్మాయిల ఫొటోలు ఉన్నాయి. ఆ ఫొటోల కింద కొంత మంది అబ్బాయిల అశ్లీల కామెంట్లు కనిపిస్తున్నాయి. కొంత మంది ఆ అమ్మాయిలను అత్యాచారం చేస్తామని వారు బెదిరిస్తున్నారు.

నేను చూసిన చాలా విషయాలు ఇక్కడ రాయలేని విధంగా ఉన్నాయి.

స్నేహితురాలు ఒకరు ఈ విషయం గురించి నాతో చెప్పడంతో నేనీ సైట్ చూశాను. ఆమె ఫోటోను ఇన్‌స్టా‌గ్రామ్ నుంచి దొంగలించి రెడిట్‌లో పోస్ట్ చేశారు.

ఆ చిత్రం నగ్న చిత్రం కాదు. కానీ, ఆ ఫొటోకు సంబంధించిన కామెంట్లలో అసభ్యమైన, అవమానకరమైన భాషను వాడారు. నా స్నేహితురాలికి తన గురించి మాత్రమే కాకుండా ఇతర మహిళల గురించి ఆందోళన కలిగింది.

నేను చూస్తున్నదంతా ఒక సంతలా అనిపించింది. అందులో గుర్తు తెలియని వందలాది ప్రొఫైల్స్ లో ఉన్న వ్యక్తులు అమ్మాయిల ఫోటోలను షేర్ చేస్తూ, వాటితో వ్యాపారం చేస్తున్నారు. అయితే, ఇదంతా అందులో ఉన్న అమ్మాయిల అంగీకారం లేకుండానే జరుగుతోందని నాకనిపించింది.

ఇదంతా చూస్తుంటే ఆన్‌లైన్‌లో అనుమతి లేకుండా పోస్ట్ చేసే సెక్సువల్ కంటెంట్ మాదిరిగా రివెంజ్ పోర్న్‌ను తలపించింది.

మహిళలు వేరే వాళ్లతో సన్నిహితంగా ఉన్నలాంటి ఫోటోలను కొన్ని వేల మందికి షేర్ చేయడమే కాకుండా, కొందరు పురుషులు గుర్తు తెలియని ప్రొఫైల్స్ పెట్టుకుని ఈ మహిళల నిజ జీవితాన్ని బయటపెడతామని బెదిరిస్తున్నారు. దీనిని డాక్సింగ్ అని అంటారు.

ఆన్‌లైన్‌లో చిరునామాలు, ఫోన్ నంబర్లు, సోషల్ మీడియా ప్రొఫైళ్లను కూడా మార్చేస్తున్నారు. ఆ తర్వాత మహిళలను అసభ్యకర రీతిలో కామెంట్ చేస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేయడం, బెదిరించడం లాంటివి చేస్తున్నారు.

ఇంటర్నెట్‌లో ఒక చీకటి కోణంలో చిక్కుకున్నట్లు అనిపించింది. కానీ, ఇదంతా ఒక ప్రధానమైన సోషల్ మీడియా వేదిక పై జరుగుతోంది.

ఆన్‌లైన్‌లో పేరున్న రెడిట్‌కు 50 మిలియన్ మంది యూజర్లు ఉన్నారు.

ఒక్క యూకేలోనే ఈ ప్లాట్‌ఫాం‌కు సుమారు 40 లక్షల మంది యూజర్లు ఉన్నారు.

ఈ వేదికపై యూజర్లు ఫోరమ్‌లు ఏర్పాటు చేసుకునే వీలు కల్పిస్తుంది. వీటిని సబ్ రెడిట్స్ అని అంటారు. ఇందులో అన్ని రకాల ఆసక్తులు ఉన్నవారు ఉంటారు. చాలా వరకు సబ్ రెడిట్ లు హానికరంగా ఉండవు. అయితే, వివాదాస్పదమైన లైంగికపరమైన కంటెంట్‌ను పెట్టేందుకు అవకాశం కల్పిస్తుందనే పేరు రెడిట్‌కు ఉంది.

2014లో ఇదే సైటులో సెలబ్రిటీల వ్యక్తిగత ఫోటోలు షేర్ అవుతూ కనిపించాయి. నాలుగేళ్ల తర్వాత రెడిట్ డీప్ ఫేక్ టెక్నాలజీ వాడుతున్న ఒక గ్రూపును రెడిట్ నిలిపివేసింది. డీప్ ఫేక్ టెక్నాలజీతో సెలబ్రిటీల ఫోటోలను పోర్న్ వీడియోలకు చేర్చుతారు.

ఈ వివాదంపై స్పందిస్తూ, రెడిట్ కఠినమైన నిబంధనలను విధిస్తున్నట్లు ప్రకటించింది. వ్యక్తుల ప్రైవేటు ఫోటోలను వారి అనుమతి లేకుండా పోస్ట్ చేయడం పట్ల ఉన్న నిషేధాన్ని పటిష్టం చేసింది.

అయితే, అనుమతి లేకుండా అమ్మాయిల ఫోటోలు ఎలా షేర్ అవుతున్నాయో తెలుసుకోవాలని అనిపించింది. దీని వల్ల ప్రభావితమైన వారి పరిస్థితి ఏమిటని అనిపించింది.

వీటి వెనక ఎవరున్నారో తెలుసుకోవాలని అనిపించింది.

రెడిట్ విధించిన నిషేధం పని చేయడం లేదని అర్థమైంది.

అమ్మాయిల నగ్న చిత్రాలను షేర్ చేస్తున్న కొన్ని డజన్ల సబ్ రెడిట్‌లు ఉన్నట్లు తెలిసింది.

నేను చూసిన ఒక సబ్ రెడిట్‌లో దక్షిణ ఆసియా మహిళలకు సంబంధించింది. అందులో 20,000కు పైగా యూజర్లు ఉన్నారు. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, పంజాబీలో సంభాషిస్తున్న యూజర్లు కనిపించరు. సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉన్న మహిళల ఫోటోలు కూడా అందులో ఉన్నాయి. కొంత మంది నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు.

ఇందులో 15,000కు పైగా ఫోటోలు ఉన్నాయి. కొన్ని వేల ఫోటోలను పరిశీలించిన తర్వాత 150 చిత్రాలు లైంగికంగా ప్రేరేపించే విధంగా ఉన్నాయి. వాటిని మానవత్వం లేకుండా, సెక్స్ పరికరాల్లా భావిస్తూ ఆ ఫోటోల పై కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోరమ్ లో ఫోటోలు పెట్టేందుకు అందులో ఉన్న అమ్మాయిలెవరూ అంగీకరించి ఉండరు.

రెడిట్

కొన్ని ఫోటోలను అమ్మాయిల సోషల్ మీడియా అకౌంట్ల నుంచి దొంగలించారు. కానీ, ఆ ఫోటోల పై అవమానకరమైన కామెంట్లు చేస్తున్నారు. కొన్ని చోట్ల బాధితుల ఫోన్‌లను కంప్యూటర్‌లను వారి నగ్న చిత్రాల కోసం హ్యాక్ చేస్తామని బెదిరింపులు కూడా చేస్తున్నారు.

మేం ఒక మహిళను కలిశాం. ఆమె తనకు రోజూ లైంగికపరమైన, అసభ్యకరమైన మెసేజీలు వస్తూ ఉంటాయని చెప్పారు.

ఆమె క్రాప్‌టాప్ ధరించిన ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ నుంచి సేకరించి పోస్ట్ చేసి.. ఆమెను అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు.

సబ్ రెడిట్ గ్రూపులో ఉన్న కొంత మంది ఈ ఫోటోలతో వ్యాపారం కూడా చేస్తున్నారు. ఇందులో చాలా ఫొటోలు సెల్ఫీల్లా కనిపిస్తున్నాయి.

ఇవి వారు తమ భాగస్వాములతో షేర్ చేసుకున్నట్లుగా కనిపిస్తున్నాయి.

కొన్ని వీడియోలు.. మహిళలు సెక్స్‌లో పాల్గొంటున్నప్పుడు రహస్యంగా చిత్రీకరించినట్లు కనిపిస్తున్నాయి.

"నిన్ను పట్టుకుంటాను"

కొన్ని మెసేజీలు, వాటి కింద ఉన్న కామెంట్ల థ్రెడ్ చూసినప్పుడు అందులో నగ్నంగా ఉన్న ఓ మహిళ ఓరల్ సెక్స్ చేస్తున్నట్లుగా ఉంది.

ఈమె వీడియోలు ఎవరిదగ్గరైనా ఉన్నాయా? అని ఓ యూజర్ అడిగారు.

"నా దగ్గర ఆమెకు సంబంధించిన ఫోటోల ఫోల్డర్ ఉంది" అంటూ ఇంకొకరు దానికి సమాధానమిచ్చారు.

మరొకరు ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్ వివరాలడిగారు.

ఆయేషా (పేరు మార్చాం) గత సంవత్సరం ఆమె వీడియోలు రెడిట్‌లో షేర్ అయినట్లు గుర్తించారు.

ఆమె మాజీ భాగస్వామి ఆమెను రహస్యంగా చిత్రించారని ఆమె చెప్పారు.

ఒక వైపు ఆమె నమ్మకానికి భంగం కలగడంతో పాటు, మరో వైపు సోషల్ మీడియాలో వచ్చే బెదిరింపులు, ముప్పు ను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

"నువ్వు నాతో సెక్స్‌లో పాల్గొనకపోతే నీ తల్లితండ్రులకు ఫోటోలు పంపిస్తాను. నేను నిన్ను కనిపెడతాను. నాతో సెక్స్ కు ఒప్పుకోక పోతే నిన్ను రేప్ చేస్తాను" ఇలాంటి వేధింపులు వచ్చేవి.

"ఒక పాకిస్తాన్ అమ్మాయిగా పెళ్ళికి ముందు సెక్స్ లో పాల్గొనడాన్ని ఆమోదించరు" అని చెప్పారు.

అయేషా

అయేషా ఇల్లు వదిలి బయటకు వెళ్లడం, నలుగురితో కలవడం మానేశారు. ఆమె ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు.

ఆమె ఆత్మహత్య ప్రయత్నం తర్వాత ఇంట్లో తల్లితండ్రులకు జరిగిన విషయం చెప్పాల్సి వచ్చింది. ఇది విని ఆమె తల్లితండ్రులు కుంగిపోయారని చెప్పారు.

"వాళ్ళకిలాంటి పరిస్థితిని కలుగచేసినందుకు నాకు చాలా సిగ్గుగా అనిపించింది" అని చెప్పారు.

అయేషా రెడిట్ యాజమాన్యాన్ని సంప్రదించారు. ఒక సారి ఒక వీడియోను డిలీట్ చేశారు. కానీ, మరొకటి తొలగించేందుకు నాలుగు నెలలు పట్టింది. అక్కడితో ఈ విషయం ముగియలేదు. ఇక్కడ డిలీట్ చేసిన కంటెంట్ మరొక సోషల్ మీడియా వేదిక పై షేర్ చేశారు.

తిరిగి సబ్ రెడిట్‌లో యథా స్థానానికి చేరుకుంది.

ఆయేషాను అవమానపరిచిన సబ్ రెడిట్‌ను జిప్పో మాడ్ అనే యూజర్ నిర్వహిస్తున్నారు.

ఈ పేరుతోనే ఆయన ట్రాక్ చేశాం.

ఆయన నిర్వహిస్తున్న గ్రూప్ రెడిట్ నిబంధనలను పాటించేలా చూడాల్సిన బాధ్యత ఆయన పై ఉంది. కానీ, అందుకు వ్యతిరేకంగా చేశారు.

ఆయన సబ్ రెడిట్‌ను ట్రాక్ చేసిన తర్వాత ఆయన మూడు సార్లు కొత్త వెర్షన్లు సృష్టించినట్లు కనిపెట్టాను.

ప్రతీ సారి ఫిర్యాదుల వల్ల ఆయన నిర్వహిస్తున్న గ్రూపును రెడిట్ తొలగించగానే కొత్త గ్రూపు సృష్టిస్తోంది. ప్రతీ సబ్ గ్రూపుకు అసలైన పేరును కొంత మార్పు చేసే పెట్టేవారు. ఈ పేరులో ఉన్న జాత్యహంకార పదజాలం వల్ల గ్రూఫు పేరును ఇక్కడ పెట్టలేకపోతున్నాం.

అన్ని గ్రూపుల్లోనూ ఒకే రకమైన సమాచారం ఉంది. అన్నిట్లోనూ కొన్ని వేల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

ఆన్‌లైన్‌లో నగ్న చిత్రాలతో చేసే వ్యాపారం విరివిగా పెరిగిపోయి దానికి కలెక్టర్ కల్చర్ అనే పేరును కూడా పెట్టారు.

"ఇది మతి చెడినవారో, తిక్కతోనో ప్రవర్తించే వారు చేస్తున్న పని కాదు. ఇలా కొన్ని వేల మంది చేస్తున్నారు" అని ఆన్ లైన్ వేధింపుల అధ్యయనంలో నిపుణులు డార్హం యూనివర్సిటీ లా ప్రొఫెసర్ క్లేయిర్ మెక్ గ్లిన్ చెప్పారు.

"ఫోటోల క్రయవిక్రయాలు చిన్న చిన్న చాట్ గ్రూపుల్లో జరుగుతూ ఉంటాయి" అని చెప్పారు.

"ఇందులో చాలా మంది పురుషులు ఫోటోలలో ఉన్న వారి అంగీకారం లేని కొన్ని వేల ఫోటోలను కలెక్ట్ చేసి ఉంటారు" అని చెప్పారు.

ఈ వేదికల నుంచి తమ ఫోటోలను తొలగించేందుకు ప్రయత్నం చేసిన 7గురు మహిళలు రెడిట్ ఎటువంటి సహాయం అందించటం లేదని చెప్పారు.

కొంత మంది ఫోటోలు అసలు డిలీట్ చేయకపోగా, కొంత మంది వారి ఫోటోలను డిలీట్ చేయించేందుకు 8 నెలలు ఆగాల్సి వచ్చిందని చెప్పారు.

గత ఏడాది రెడిట్ అనుమతి లేకుండా పోస్ట్ చేసిన 88,000 ఫోటోలను తొలగించినట్లు చెప్పింది. ఇలా చేసేందుకు వారికి ఆటోమేటడ్ టూల్స్‌తో పాటు శిక్షణ పొందిన సిబ్బంది ఉంటారని తెలిపింది.

ఇలా చేసే ఫోరమ్స్ ను ఎప్పటి కప్పుడు తొలగిస్తామని చెప్పింది.

"ఈ విషయంలో మేము చేయాల్సిన పని చాలా ఉందని మాకు తెలుసు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు మేము మా సిబ్బంది పై, కొత్త టెక్నాలజీ కోసం వెచ్చిస్తున్నాం" అని రెడిట్ ప్రతినిధి చెప్పారు.

చాలా దేశాల్లో చట్టాలు మహిళలకు ఆన్ లైన్ లో భద్రత కల్పించేందుకు పటిష్టంగా లేవు.

జార్జీ

జార్జీ ఫోటోలు ఆన్ లైన్ లో షేర్ అవుతున్నాయని తెలియగానే ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

"నా ఫోటోలను ఎంత మంది చూశారో కూడా తెలియదు. వాళ్ళను ఆపే దారి కూడా లేదు" అని చెప్పారు.

ఆమె ఫోటోలను షేర్ చేస్తున్నట్లు ఆమె మాజీ భాగస్వామి తనతో చెప్పారని, కానీ, అవి ఆమెను ఇబ్బంది పెట్టేవిగా, గాయపరిచేవిగా ఉండకూడదని చెప్పినట్లు తెలిపారు.

ఆయన పెట్టిన మెసేజ్ ఆయన చట్టపరంగా తప్పించుకునేందుకు పనికొస్తుంది.

దక్షిణ ఆసియా మహిళలను లక్ష్యంగా చేసుకున్న జిప్పో మాడ్ ను ట్రాక్ చేశాను. ఆ సైటులో ఆయన చేసిన కామెంట్లు చూసినప్పుడు నిజమైన పేరు, ఈ మెయిల్ అడ్రెస్ , ఫోటోలు కనిపించలేదు.

కానీ, ఆయన యూజర్ పేరు నుంచి క్లూ దొరికింది.

ఆయన జిప్పో లైటర్లను సేకరిస్తారని ఒక లైటర్ అమ్మకానికి ఉందని పోస్టు చేశారు. దీంతో, ఒక ఫేక్ అకౌంట్ సృష్టించుకుని ఆ లైటర్ కొనుక్కుంటానని అడిగాను.

ఆయన ఒక మీటింగ్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. మా అండర్ కవర్ రిపోర్టర్ ఆయనను కలిశారు.

ఆయన పేరు హిమేష్ సింఘాడియా. ఆయన యూనివర్సిటీలో చదువుకుని ఒక పెద్ద సంస్థలో మేనేజర్ గా పని చేస్తున్నారు. నేను వెతుకుతున్న వ్యక్తి అలా ఉంటారని ఊహించలేదు.

పనోరమా ఆయనను సంప్రదించిన తర్వాత సింఘాడియా సబ్ రెడిట్ ను తొలగించారు. ఈ గ్రూపును దక్షిణ ఆసియా మహిళలను ప్రశంసించేందుకు క్రియేట్ చేసినట్లు చెప్పారు.

ఈ గ్రూపులో అత్యధిక సంఖ్యలో ఉన్న యూజర్ల వల్ల కామెంట్లను మోడరేట్ చేయలేకపోయినట్లు చెప్పారు.

ఆయన ఎవరి వ్యక్తిగత వివరాలను షేర్ చేయడం లేదా ఫొటోలతో వ్యాపారం చేయడం గాని చేయలేదని చెబుతున్నారు.

మహిళలు అడిగినప్పుడు వారి ఫోటోలను తొలగించినట్లు చెప్పారు.

"జిప్పోమాడ్ చేసిన పని పట్ల చాలా సిగ్గుపడుతున్నారు. ఇది ఆయన స్వభావాన్ని ప్రతిబింబించటం లేదు" అని రెడిట్ ప్రకటన తెలిపింది.

బీబీసీ వెలుగులోకి తెచ్చిన మరి కొన్ని ఇలాంటి గ్రూపులను రెడిట్ తొలగించింది.

అంటే, కనీసం కొన్ని వేల మంది మహిళల ఫోటోలు తొలగించి ఉంటారు. ఈ మొత్తం వ్యవహారం మిగిల్చిన బాధ తర్వాత వారి ఫోటోల తొలగింపు కొంత ఊరట అని చెప్పవచ్చు.

ఈ వ్యాపారంలో మహిళలు దోపిడీకి గురి కాకుండా టెక్ సంస్థలు, చట్ట సభ సభ్యులు తగిన మార్పులు చేయాల్సి ఉంది.

తన ఫోటోలను షేర్ చేసిన మాజీ భాగస్వామి గురించి చెబుతూ, "ఆయనను శిక్షించాలని అనుకోను. ఇలాంటి పనిని మరొకసారి చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను" అని జార్జీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
BBC Investigation: Undercover world of women's nudes trade is busted
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X