బళ్లారి స్థానంలో గాలి ఫ్యామిలీకి బిగ్ షాక్ ఇచ్చిన నారా భరత్ రెడ్డి
బెంగళూరు: అత్యంత ఉత్కంఠత రేకెత్తించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ స్పష్టత ఏర్పడుతోంది. ప్రారంభ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడినప్పటికీ- ఆ తరువాత బీజేపీ వెనుకంజ వేసింది. గతంతో పోల్చుకుంటే జనతాదళ్ (సెక్యులర్) కూడా ఈ సారి నష్టపోయింది.
తాజా సమాచారం ప్రకారం- కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీని సాధించేలా కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 113 స్థానాలు అవసరం కాగా- దీన్ని అందుకోవడం దాదాపుగా ఖాయమైంది. మధ్యాహ్నానికి 120 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. 72 స్థానాలకే పరిమితం అయ్యేలా ఉంది బీజేపీ పరిస్థితి. జేడీఎస్- 26, ఇతరులు ఆరు చోట్ల ఆధిక్యతలో ఉన్నారు. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ ఆధిక్యత చేతులు మారుతూ వస్తోంది.

ఏపీ సరిహద్దులకు ఆనుకుని ఉండే బళ్లారిలో గాలి బ్రదర్స్ దూకుడుకు అడ్డుకట్ట పడింది. బళ్లారి సిటీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో ఆధిక్యతలో కొనసాగుతోంది. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన నారా భరత్ రెడ్డి పూర్తి ఆధిక్యతలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి గాలి సోమశేఖర్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన కళ్యాన రాజ్య ప్రజాపక్ష అభ్యర్థి గాలి లక్ష్మీ అరుణ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.
గాలి జనార్ధన్ రెడ్డి భార్యే లక్ష్మీ అరుణ రెడ్డి. సోమశేఖర్ రెడ్డికి వదిన అవుతారు. ఈ ఫ్యామిలీకి జాయింట్‌గా షాకిచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి. భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. బీజేపీకి పడాల్సిన ఓట్లను గాలి లక్ష్మీ అరుణ రెడ్డి చీల్చడం వల్లే ఇక్కడ కాంగ్రెస్ గెలుపు దిశగా సాగుతోందనే అభిప్రాయాలు ఉన్నాయి. గంగావతిలో పోటీ చేసిన గాలి జనార్ధన్ రెడ్డి స్వల్ప మెజారిటీతో ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై- షిగ్గావ్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య-వరుణ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్-కనకపురల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. టికెట్ దక్కకపోవడం వల్ల చివరి నిమిషంలో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్ హుబ్లీ-ధర్వాడలో వెనుకంజలో ఉన్నారు. బీజేపీకే చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి లక్షణ సవాది- అథణి నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు.












Click it and Unblock the Notifications