బళ్లారి/బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా బళ్లారి నియోజక వర్గం బీజేపీ టిక్కెట్ ఎవ్వరికి అనే ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. బళ్లారి శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏప్రిల్ 21వ తేదీ నామినేషన్ వెయ్యడానికి గాలి సోమశేఖర్ రెడ్డి సిద్దం అయ్యారని ఆయన వర్గీయులు అంటున్నారు. అయితే బీజేపీ మాత్రం అధికారికంగా బళ్లారిలో తమ పార్టీ అభ్యర్థిని ఇంత వరకూ ప్రకటించలేదు.

బెంగళూరులో స్క్రీనింగ్ కమిటి
బెంగళూరులో బీజేపీ పార్టీ స్క్రీనింగ్ కమిటి నిర్వహించింది. స్క్రీనింగ్ కమిటీకి గాలి సోమశేఖర్ రెడ్డి హాజరైనారు. బళ్లారి నుంచి బీజేపీ టిక్కెట్ ను మరో వ్యక్తి ఆశించలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి తానే అని గాలి సోమశేఖర్ రెడ్ది ధీమాతో ఉన్నారని తెలిసింది.

తీవ్ర ఒత్తిడిలో గాలి బ్రదర్స్
బళ్లారి శాసన సభ నియోజక వర్గం టిక్కెట్ తనకు వస్తుందో ? లేదో ? అనే ఒత్తిడిలో మొదట గాలి సోమశేఖర్ రెడ్ది ఉన్నారు. అయితే బీజేపీ నుంచి మరో వ్యక్తి బీజేపీ స్క్రీనింగ్ కమిటీ ముందు అర్జీ సమర్పించకపోవడంతో గాలి సోమశేఖర్ రెడ్డి కాస్త ఊపిరిపీల్చుకున్నారు.

సుడిగాలి పర్యటన
బళ్లారి శాసన సభ నియోజక వర్గంలో గాలి సోమశేఖర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఓటు బీజేపీకి వెయ్యాలని గాలి సోమశేఖర్ రెడ్డి ప్రజలకు మనవి చేస్తున్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా చేసిన సేవలను గుర్తు పెట్టుకుని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని గాలి సోమశేఖర్ రెడ్డి మనవి చేస్తున్నారు.

శ్రీ ఆంజనేయస్వామి
శాసన సభ ఎన్నికల్లో తాను ఈసారి పోటీ చేస్తానని చెబుతున్న గాలి సోమశేఖర్ రెడ్డి ఓటు మాత్రం బీజేపీకి వెయ్యాలని ప్రచారం చెయ్యడం ఆ నియోజక వర్గం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కసాపుర శ్రీ ఆంజనేయస్వామి తన వైపు ఉన్నారని, గెలుపు తనదే అని గాలి సోమశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అధిష్టానం ఆలోచన
అక్రమ గనుల కేసులో గాలి జనార్దన్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చిన తరువాత ఆయన బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అవినీతి పరులకు శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం ఇవ్వమని, గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీ ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పడంతో టిక్కెట్ ప్రకటించే వరకు వేచి చూద్దామని గాలి అభిమానులు అంటున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!