మమత నోటి వెంట అలవోకగా అమ్మోరి మంత్రపుష్పం: అనర్గళంగా జపించగలరా: హాట్ సీట్‌గా
కోల్‌కత: తొలి విడత అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వామపక్షాలకు కొన్నేళ్ల పాటు కంచుకోటగా ఉంటూ వచ్చిన పశ్చిమ బెంగాల్‌లో బలంగా నాటుకుపోయిన తృణమూల్ కాంగ్రెస్‌ను పెకిలించి వేయడానికి భారతీయ జనతా పార్టీ చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి కొన్ని నెలల ముందు నుంచే విస్తృత ప్రచార కార్యక్రమాలను సాగిస్తోంది. ఈ సారి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అధికారం నుంచి దూరం చేయడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది.

హైఓల్టేజ్ స్టేట్‌గా బెంగాల్..
బీజేపీని నిలువరించడానికి మమతా బెనర్జీ అదే స్థాయిలో పోటీ ఇస్తోన్నారు. ఫలితంగా పోటాపోటీ రాజకీయాలు, వ్యూహ, ప్రతివ్యూహాలు, ప్రచార కార్యక్రమాలతో పశ్చిమ బెంగాల్.. హైఓల్టేజ్‌గా మారిపోయింది. ఈ పరిణామాల మధ్య మమతా బెనర్జీ కొద్దిసేపటి కిందటే తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సారి ఆమె నందిగ్రామ్ నుంచి ఎన్నికల బరిలో దిగారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న ఒకప్పటి తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సువేందు అధికారిని ఓడించాలనే లక్ష్యంతో ఆమె ఈ సారి తన స్థానాన్ని మార్చుకున్నారు. భవానిపురాను వీడి నందిగ్రామ్ నుంచి రేసులో నిల్చున్నారు.

పరమశివుడిని దర్శించుకుని..
నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ముందు ఆమె.. నందిగ్రామ్‌లో శివాలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూల విరాట్ వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి పూజలు చేశారు. మహా శివరాత్రికి ఒక్కరోజు ముందు పరమేశ్వరుడికి పూజలు నిర్వహించడం ఆనందంగా ఉందని, అంతా శుభమే జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు. ఆ తరువాతే రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. రెండో విడతలో అంటే.. ఏప్రిల్ 1వ తేదీన నందిగ్రామ్ నియోజకవర్గానికి పోలింగ్‌ను నిర్వహించనున్నారు.

మత రాజకీయాలు చెల్లవ్..
నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. అలవోకగా అమ్మవారి మంత్రపుష్పాన్ని జపించారు. మధ్యలో ఒకట్రెండు సార్లు తడబడ్డినప్పటికీ.. దాన్ని పూర్తి చేశారు. తాను బ్రాహ్మణురాలినని, మతాన్ని అడ్డుగా పెట్టుకుని ఓట్లను అడిగే దౌర్భాగ్యం తనకు పట్టలేదని చెప్పారు. తన వద్ద మత రాజకీయాలు చెల్లవని హెచ్చరించారు. చిన్నప్పుడు అభ్యసించిన అమ్మవారి మంత్రపుష్పం తన మస్తిష్కంలో బలంగా నాటుకుపోయిందని అన్నారు. మత రాజకీయాలు చేసే పార్టీల నాయకులు మంత్ర పుష్పాన్ని జపించగలరా? అని సవాల్ విసిరారు.

హాట్ సీట్‌గా నందిగ్రామ్..
సువేందు అధికారిని అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వనంటూ ప్రతిజ్ఞ చేసిన మమతా బెనర్జీ.. దాన్ని చేతల్లో చూపించారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేయడానికి నందిగ్రామ్‌ను ఎంచుకున్నారు. తన పాత నియోజకవర్గం భవానీపురాను వదిలి పెట్టారు. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉంటూ వచ్చిన నందిగ్రామ్‌ను తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 2009 ఉప ఎన్నిక తరువాత.. ఆ స్థానాన్ని తృణమూల్ ఎప్పుడూ ఓడిపోలేదు. అలాంటి స్థానంలో బీజేపీ తరఫున పోటీ చేస్తోన్న సువేందు అధికారి ఏ మేరకు ఆశించిన ఫలితాన్ని సాధిస్తారనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.












Click it and Unblock the Notifications