అమిత్ షాకు కీలక బాధ్యత, బీజేపీ చాణక్య వ్యూహం
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే దేశ రాజకీయాల్లో వేగవంతమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గెలిచిన రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు, ఓడిన చోట ఆత్మపరిశీలనకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో తదుపరి అడుగులు వేసేందుకు బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది.
పశ్చిమ బెంగాల్ చరిత్రలో తొలిసారిగా కాషాయ జెండా ఎగురవేసి బీజేపీ రికార్డు సృష్టించింది. 294 స్థానాలకు గాను ఏకంగా 207 సీట్లు గెలుచుకుని దీదీ కోటను కూల్చేసింది. ఈ నేపథ్యంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పరిశీలకుడిగా, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీని సహ-పరిశీలకుడిగా బీజేపీ నియమించింది. బెంగాల్ పగ్గాలు ఎవరికి అప్పగించాలనే దానిపై ఢిల్లీలో కసరత్తు మొదలైంది.

మరోవైపు, అస్సాంలో ఎన్డీయే హ్యాట్రిక్ విజయం సాధించడంతో అక్కడ ప్రభుత్వ ఏర్పాటు బాధ్యతలను కేంద్ర మంత్రి జేపీ నడ్డా, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీలకు అప్పగించింది. అస్సాంలో బీజేపీ సొంతంగా 82 సీట్లు గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
తమిళనాడులో 'దళపతి' సెన్సేషన్.. స్టాలిన్ రాజీనామా!
దక్షిణాది రాజకీయాల్లో భారీ మార్పు చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) 107 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేవలం 11 సీట్ల దూరంలో మెజారిటీ ఆగిపోయినప్పటికీ, దశాబ్దాల కాలంగా చక్రం తిప్పుతున్న డీఎంకే (59 సీట్లు) ను చావుదెబ్బ కొట్టింది. ఫలితాల అనంతరం నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఈ రాజీనామాను ఆమోదించారు. ఇప్పుడు విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు మిత్రపక్షాల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు.
కేరళలో కాంగ్రెస్ పునరుజ్జీవం.. పుదుచ్చేరిలో పాతదే!
కేరళలో ఎల్‌డీఎఫ్ (LDF) కోట బద్దలైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) భారీ మెజారిటీతో విజయం సాధించింది. 140 స్థానాలకు గాను కాంగ్రెస్ సొంతంగా 63 సీట్లు గెలుచుకుని పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక పుదుచ్చేరిలో మాత్రం ఏఐఎన్ఆర్‌సీ కూటమి తన అధికారాన్ని నిలబెట్టుకుని పట్టు చాటుకుంది.
మొత్తానికి.. ఈ ఫలితాలు కొన్ని పార్టీలకు కొత్త ఊపిరి పోయగా, మరికొన్ని పార్టీలకు ఉనికిని కాపాడుకోవడమే సవాలుగా మార్చాయి. బెంగాల్‌లో బీజేపీ ప్రయోగం, తమిళనాడులో విజయ్ కొత్త పంథా రాబోయే కాలంలో జాతీయ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.














Click it and Unblock the Notifications