బెంగళూరులో మరో దారుణం: బాలికపై అత్యాచారం, హత్య
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో మరో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. ఈ సంఘటన బెంగళూరు హోసకోట్‌లోని ఓ నిర్మానుష్యమైన ప్రదేశంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి - పాఠశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత రెండో స్టాండర్డ్ చదువుతున్న ఆ అమ్మాయి ఇంటి వద్ద ఆడుకుంటోంది. తల్లిదండ్రులు పనికి వెళ్లారు. ఆ సమయంలో బాలికపై అత్యాచారం జరిగింది. పిల్లగుంప పారిశ్రామికవాడలో గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు జరగగా, సంఘటన ఏడున్నర గంటలకు వెలుగు చూసింది.

ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు తమ కూతురు కనిపించలేదు. బాలిక కోసం వారు తీవ్రంగా గాలించారు. తమ కూతురు శవాన్ని చూసి వాళ్లు షాక్ తిన్నారు. వెంటనే సులిబెలె పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. సంఘటన జరిగిన ప్రాంతంలో గల ఓ దుకాణం సిసిటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు.
ఓ వ్యక్తి బాలికను తీసుకెళ్తున్న దృశ్యం సిసిటీవీ కెమెరాలో కనిపించింది. అతనే అమ్మాయిపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఆ వ్యక్తిని గుర్తించడానికి పోలీసులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications