‘ఎవరికైనా చెబితే చంపేస్తా’: బాక్సర్‌పై కోచ్ 4 ఏళ్లుగా లైంగిక వేధింపులు!
కర్ణాటక రాజధాని బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో తీవ్ర కలకలం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. స్టేడియంలోని లయన్స్ బాక్సింగ్ క్లబ్ కు చెందిన ఓ 50 ఏళ్ల బాక్సింగ్ కోచ్ తన వద్ద శిక్షణ పొందుతున్న 17 ఏళ్ల మైనర్ బాలికపై గత నాలుగేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై సదరు బాక్సర్ తన తల్లి ద్వారా మే 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత పదేళ్లుగా అదే క్లబ్ లో శిక్షణ పొందుతున్న ఆ బాలికను కోచ్ తీవ్రంగా వేధించినట్లు సమాచారం.
నిందితుడిని లయన్స్ బాక్సింగ్ క్లబ్ కోచ్‌గా పనిచేస్తున్న రామచంద్ర(50)గా గుర్తించారు. గత నాలుగేళ్లుగా కోచ్ తన కుమార్తెను వేధిస్తున్నాడని.. ముఖ్యంగా గత ఐదారు నెలలగా ఈ వేధింపులు మరింత ఎక్కువయ్యాయని బాలిక తల్లి తన ఫిర్యాగులో పేర్కొంది. కంఠీరవ స్టేడియంలో సదరు బాలికతో అసభ్యం ప్రవర్తించడానికి, ఆమెకు బలవంతంగా దగ్గరవ్వడానికి రామచంద్ర పలుమార్లు ప్రయత్నించాడని, అనేక సార్లు ఆమెను తప్పుగా తాకాడని ఎఫ్ఐఆర్‌లో నమోదైంది.

ఈ వేధింపులు అంతటితో ఆగకుండా ప్రయాణాల్లోనూ కొనసాగాయి. మే 17వ బాక్సింగ్ పోటీల నిమిత్తం జట్టుతో కలిసి చెన్నై వెళ్లిన సమయంలో కోచ్ రామచంద్ర ఆ బాలికను తన ప్రైవేట్ గదికి పిలిపించుకున్నాడు. అక్కడ ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ను తాకుతూ బలవంతంగా ముద్దు పెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. అంతే కాకుండా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెబితే చంపేస్తానంటూ కోచ్ తీవ్రంగా బెదిరించినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ వేధింపులకు సంబంధించి గతంలోనే ఒక కమిటీకి ముందస్తు ఫిర్యాదు కూడా అందినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. బాలిక తల్లి ఇచ్చిన తాజా ఫిర్యాదు ఆధారంగా బెంగళూరు పోలీసులు నిందితుడైన కోచ్ రామచంద్రపై పోక్సో చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications