ఆరంభం అద్దిరింది- ఈ ఏడాది తొలి వర్షం
Bengaluru rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం బెంగళూరును సేదతీర్చింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈ ఏడాది తొలి వర్షపాతం ఇదే. ఫలితంగా- ఎండ తీవ్రత చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో మంగళవారం సాయంత్రం బెంగళూరులో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం 5 గంటల నుంచి ఆకాశం మేఘావృతమై కనిపించింది. ఈదురుగాలులు వీచాయి. ఆ కొద్దిసేపటికే నగరంలో పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది.
మెజస్టిక్, శేషాద్రిపురం, బనశంకరి, జయనగర, ఈ మధ్యాహ్నం నగరం అంతటా మేఘావృతమైన వాతావరణం కనిపించింది. సాయంత్రం వేళల్లో మెజెస్టిక్, మల్లేశ్వరం, శేషాద్రిపురం, బనశంకరి, జయనగర, రాజాజీనగర, విజయనగర, ఇందిరానగర్, హలసూరు, అవలహళ్లి పరిసర ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షం పడింది.

ఎండ తీవ్రత, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరికి గురి అవుతున్న నగరవాసులకు ఈ వర్షం ఊరటనిచ్చింది.. సేదదీర్చింది. వర్షానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. కోరమంగళ, బీటీఎం లేఅవుట్, మార్థహళ్లి, లాల్‌బాగ్, డైరీ సర్కిల్, హెబ్బాళ, విద్యారణ్యపుర వంటి చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.
నాయండహళ్లి, నేలమంగళ, యలహంక, దొమ్మలూరు, రాజమహల్ గుట్టహళ్లి, హులిమావు వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆయా ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రత తగ్గినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాత్రి సమయానికి కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది.
మరో మూడు రోజులు బెంగళూరులో ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. బుధ, గురువారాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతానికి భారీ వర్ష సూచనలు ఏవీ లేవని బెంగళూరు ఐఎండీ సైంటిస్ట్ పువియరాసన్ చెప్పారు.
అటు తమిళనాడులో భారీ వర్షాలు పడ్డాయి. దక్షిణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో రాత్రంతా దంచి కొట్టాయి. తూత్తుకుడి జిల్లాలో వర్షాల తీవ్రత అధికంగా కనిపించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది.
కన్యాకుమారి, తిరునెల్వేలి, తెన్ కాశి, తూత్తుకూడి, విరుధునగర్, రామనాథపురం, పుదుక్కోట్టై, శివగంగ, తంజావూరు, మధురై జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. తిరుచ్చి, ఈరోడ్, సేలం, తిరువారూర్, నాగపట్నం, మైలాడుథురై, థేని, దిండిగల్, థేని, కోటగిరి, కోయంబత్తూరు.. వంటి ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.












Click it and Unblock the Notifications